- కాంగ్రెస్ ఎంపీల వెల్లడి
- కేటీఆర్ లాగా చెల్లి బెయిల్ కోసం సీఎం ఢిల్లీకి రాలేదని కౌంటర్
- బీఆర్ఎస్ పదేండ్లలో సాధించలేనిది ఏడాదిలో రేవంత్ చేశారని కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు: గడిచిన పదేండ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు రూ. 50 వేల కోట్లకు పైగా నిధులు తెచ్చామని కాంగ్రెస్ ఎంపీలు అన్నారు. 139 ఎకరాల డిఫెన్స్ భూములను కూడా సాధించారని చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాదిరిగా చెల్లెలికి బెయిల్ ఇప్పించుకోవడానికి రేవంత్ ఢిల్లీకి రాలేదని ఎద్దేవా చేశారు. మంగళవారం ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి అధికారిక నివాసంలో కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామి రెడ్డి, కడియం కావ్య, సురేశ్ షెట్కార్, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్.. మీడియాతో మాట్లాడారు.
ఫెడరల్ స్ఫూర్తితో సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని మల్లు రవి అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలు కేంద్రంతో ముడిపడి ఉన్నాయనే విషయం తెలుసుకోకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారని, ఆయన విలువలు లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్లలో సాధించలేని వాటిని రేవంత్ రెడ్డి గత పది నెలల్లో సాధించారని చెప్పారు. ‘‘కేంద్ర మంత్రులను సీఎం కలుస్తుంటే వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్లలో ఈ పరిస్థితి లేదని మంత్రులు చెబుతున్నారు. గౌరవంగా భావించి నిధులు ఇస్తున్నామని తెలిపారు” అని చెప్పారు.
మా సీఎం కామన్ మ్యాన్.
తమ సీఎం రేవంత్ రెడ్డి కామన్ మ్యాన్ అని ఎంపీ చామల అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూడదనే రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానాల్లో తిరగడం లేదన్నారు. అందులోనూ ఎకనామిక్ సీట్లలోనే ప్రయాణాలు చేస్తున్నారని వివరించారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి రూ.38, 319 కోట్లు వచ్చాయని చెప్పారు. అలాగే సివిల్ సప్లై శాఖలో రూ.2, 699 కోట్లు, మ్యాచింగ్ గ్రాంట్స్, వెనక బడిన జిల్లాలకు వచ్చే రూ. 450 కోట్లు, ఇతర రూపాల్లో మరిన్ని నిధులు రాష్ట్రానికి సీఎం తెచ్చారన్నారు.
వీటితో పాటు కేంద్రం ప్రకటించిన ఏడు టెక్స్ టైల్స్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి రావడంలో చొరవ చూపారన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు మాత్రం.. పనికిమాలిన ప్రాజెక్టులతో రూ.లక్షల కోట్లు దోచుకుందని చామల మండిపడ్డారు.