సీఎం చొరవతోనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

  • రాష్ట్ర ప్రజల కల నెరవేరుతున్నది: కాంగ్రెస్ ఎంపీలు 
  • 2025 ఆగస్టు కల్లా నిర్మాణం పూర్తవుతుందని వెల్లడి 
  • విభజన హామీలపై కేసీఆర్ ఏనాడూ కేంద్రాన్ని కలవలేదని ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో తెలంగాణ ప్రజల కల నెరవేరుతున్నదని కాంగ్రెస్ ఎంపీలు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ ఎంపీలు మీడియాతో మాట్లాడారు. 2025 ఆగస్టు వరకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తవుతుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య చెప్పారు. ‘‘కేంద్రం తొలుత వ్యాగన్ తయారీ కేంద్రం ఇచ్చింది. దాన్ని రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ గా అప్ గ్రేడ్ చేసింది. ఇప్పుడు పూర్తిగా వందే భారత్ కోచ్ లు కూడా తయారు చేసేలా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఎయిర్ పోర్టు, వెల్ నెస్ సెంటర్, గిరిజన యూనివర్సిటీ.. ఇలా రెండో రాజధానిగా వరంగల్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది” అని తెలిపారు. 

బీజేపీ చెప్పుచేతల్లో బీఆర్ఎస్...

విభజన హామీలపై కేసీఆర్ ఏనాడూ కేంద్ర పెద్దలను కలవలేదని ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. ‘‘సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే విభజన హామీలు, రాష్ట్రాభివృద్ధి ప్రాధాన్య అంశాలుగా రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కానీ రేవంత్ ఢిల్లీకి రావడం వల్లే విభజన హామీలన్నీ సాకారమవుతున్నాయి. ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికీ బీజేపీ చెప్పుచేతల్లోనే బీఆర్ఎస్ ఉంది. రెండు పార్టీలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి” అని ఫైర్ అయ్యారు. ఎవరిని కలవను, నిజాం రాజుల వ్యవహరిస్తానంటే రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు రావని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇదే పని కేసీఆర్ చేశారని, అందుకే పదేండ్లలో విభజన హామీలు నెరవేరలేదన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాకర్టీ విషయంలో కేంద్రంపై కేసీఆర్, కేటీఆర్ ఒత్తిడి పెంచలేదని.. కానీ 28 సార్లు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్ ఒత్తిడితోనే కేంద్రం దిగివచ్చిందని చెప్పారు.  

అభివృద్ధే ముఖ్యం.. 

విభజన హామీలను ఒక్కొక్కటిగా సాధిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. 2026లో తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్ జరగనున్నాయని చెప్పారు. పదేండ్లలో బీఆర్ఎస్ ఏం తెచ్చిందో కేటీఆర్ భజన మండలి చెప్పాలని సవాల్ విసిరారు. తెలంగాణ కాంగ్రెస్ పనితీరును కేంద్రమంత్రులే మెచ్చుకుంటున్నారని అన్నారు. కేంద్ర మంత్రులను కలిస్తే తప్పేంటని ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలు పక్కనపెట్టి, అభివృద్ధే అజెండాగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. భవిష్యత్తులోనూ ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తామని తెలిపారు.