కాంగ్రెస్​ ఎంపీలు రాజీనామా చేయాలి: బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి

కాంగ్రెస్​ ఎంపీలు రాజీనామా చేయాలి: బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి
  • మూసీని ఏటీఎంలా మార్చే ప్రయత్నాలు చేస్తున్నరు
  • అసెంబ్లీలో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి వ్యాఖ్య
  • మేం కాదు మీరే రిజైన్ చేయాలి:ఆది శ్రీనివాస్ కౌంటర్​


హైదరాబాద్, వెలుగు : బడ్జెంట్ కేటాయింపుల్లో  రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసిందని భావిస్తే 8 మంది కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీలో  కేంద్ర బడ్జెట్‌‌‌‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. " తెలంగాణకు  కేంద్రం అన్యాయం చేయలేదు. విభజన చట్టం హామీల్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు. 

అవకాశం ఉంటేనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలన చేస్తామని మాత్రమే విభజన చట్టంలో ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 28 వేల కోట్ల ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అమృత్​ పథకం కింద కేంద్రం రూ.4500 కోట్లు ఇస్తే రాత్రికి రాత్రే మాయం చేశారు. అవి ఏమయ్యాయో చెప్పండి. కేంద్రం త్రిపుల్​ ఆర్​కు రూ.26వేల కోట్లు ఇచ్చింది. త్రిపుల్ ఆర్ తో  హైదరాబాద్ రూపు రేఖలు మారుతాయి" అని ఏలేటి మహేశ్వర్​రెడ్డి వివరించారు. 

ఏటీఎంలా మూసీ

మూసీ ప్రక్షాళన పెద్ద కుంభకోణమని ఏలేటి మహేశ్వర్​రెడ్డి ఆరోపించారు. మూసీ సుందరీకరణపై కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం డీపీఆర్‌‌‌‌లు కూడా ఇవ్వలేదని తెలిపారు. గత ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఏటీఎం లా వాడుకున్నట్లే మూసీని కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాదని విమర్శించారు. ఎవరికి కమిషన్లు ఇవ్వడానికి లక్ష కోట్లతో మూసీ నదిని అభివృద్ధి చేస్తామంటున్నరని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కుట్రలో తమను భాగం కావాలని పిలుస్తున్నారని మండిపడ్డారు. సరైన ప్రతిపాదనలు ఇవ్వకుండా కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని తెలిపారు. కేంద్రం సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలును పక్కదారి పట్టిస్తుందన్నదని ఫైర్ అయ్యారు.

మీరే చేయాలి: ఆదిశ్రీనివాస్​ 

కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలనే బీజేపీ సవాల్ పై ప్రభుత్వ విప్​ఆది శ్రీనివాస్​ స్పందించారు. ముందు బీజేపీకి చెందిన 8 మంది  ఎంపీలే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నిధుల కోసం పోరాడాలన్నారు.  తెలంగాణ కోసం బీజేపీ ఫైట్ చేయాల్సిందిపోయి కాంగ్రెస్ ఎంపీలను రిజైన్ చేయమనడం విడ్డూరంగా ఉందని ఆదిశ్రీనివాస్ పేర్కొన్నారు.