
- ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ దేశానికి ఆదర్శం:ఎంపీ మల్లు
- ఫోన్ ట్యాపింగ్ పై కేటీఆర్ భ్రమలో ఉన్నారు: ఎంపీ చామల
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టుల సాధన దిశలో అన్ని పార్టీల ఎంపీలను కలుపుకొని ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తామని కాంగ్రెస్ ఎంపీలు తెలిపారు. బీజేపీ ఎంపీలు, ఎఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లు తమతో కలిసి వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి నేతృత్వంలో ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, సురేశ్ షట్కర్, కడియం కావ్య, రామ సహాయం పాల్గొని, మాట్లాడారు.
తొలుత ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ..మెట్రో విస్తరణ, మూసి ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్డు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, ఇతర పెండింగ్ అంశాలపై త్వరలో ప్రధాని నరేంద్ర మోదీనిని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. అలాగే.. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ వర్గాల పిల్లల భవిష్యత్ కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను మంజూరు చేయడం హర్ష నీయమన్నారు. ఈ మేరకు కొత్తగా 55 స్కూల్స్ కోసం 11 వేల కోట్లతో జీవో 56 ను రిలీజ్ చేయడం గొప్ప విషయమని చెప్పారు.
బీజేపీ పాలిత ప్రాంతాలు సైతం గురుకులాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.సీఎం రేవంత్ పై కేటీఆర్ వ్యాఖ్యలు ఆయన మానసిక పరిస్థితికి, రాజకీయ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ కు ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధిచెప్పారని, ఇకనైనా మారకపోతే తరిమి కొడతారన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే లేదని కేటీఆర్ ను మల్లు రవి హెచ్చరించారు.
కేటీఆర్ భ్రమలో ఉన్నడు: ఎంపీ చామల
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పేటెంట్ హక్కులు బీఆర్ఎస్ వేనని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తమలాగే ఇతరులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారనే భ్రమలోనే కేటీఆర్ ఉన్నారని కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నియంతృత్వ పాలనలోనే ఇది సాధ్యమని ఫైర్ అయ్యారు. తాము ఈ –ఫార్ముల రేస్ ను తప్పుబట్టలేదని, కేవలం అందులో జరిగిన అవకతవకలపై మాత్రమే ప్రశ్నిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
ఇకనైనా రాజకీయాలు పక్కనపెట్టి తెలంగాణ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కలిసి రావాలని సూచించారు. భారత్ క్రికెట్ కప్ ను గెలిస్తే ఆ సంబరాలను ఎవరైనా అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రతిపల్లెలో సంబురాలు జరిగాయని ఎక్కడా అభ్యంతరం చెప్పలేదన్నారు. అయితే, శాంతిభద్రతలకు విఘాతం కలిగితే మాత్రం పోలీసులు చూస్తూ ఊరుకోరని, దీనికి పార్టీలు, కులాలు, మతాలు, సంఘాలతో సంబంధం లేదని చామల పేర్కొన్నారు.
మామూనూరు ఎయిర్ పోర్ట్ కల నెరవేరింది: కావ్య
సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే మామునూరు ఎయిర్ పోర్ట్ కల నెరవేరిందని ఎంపీ కడియం కావ్య అన్నారు. పదిహేనేండ్ల నుంచి ఆ సమస్య పెండింగ్ లో ఉందన్నారు. తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ ఉత్తర్వులతో ఎయిర్ పోర్ట్ కు కావాల్సిన 253 ఎకరాల భూ సేకరణపై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. దానిని త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు.
.కాజీపేట డివిజన్ సహా పలు రైల్వే పెండింగ్ అంశాలు సాధించాల్సి ఉందని, వీటికోసం కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరామని గుర్తు చేశారు. కుల గణనకు ఎవరూ సాహసించలేదని, కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ధైర్య సాహసాలతో ముందుకెళ్లారని వివరించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలం నిర్ణయం తీసుకున్న మొదటి సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని కావ్య పేర్కొన్నారు.