హనుమకొండ, వరంగల్, వెలుగు: పార్లమెంట్లో తెలంగాణ కోసం తాము తెగించి కొట్లాడామని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న నాటి కాంగ్రెస్ ఎంపీలు పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వాల్సిందేనని ప్రణబ్ ముఖర్జీకి చెప్పామని తెలిపారు. ఉద్యమ సమయంలో తాము చేసిన పోరాటాలను వారు గుర్తుచేసుకున్నారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండలోని డీ కన్వెన్షన్ హాలులో సోమవారం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఉద్యమ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, మధుయాష్కీగౌడ్, అంజన్ కుమార్, సిరిసిల్ల రాజయ్య తదితరులు చీఫ్ గెస్ట్ లుగా హాజరయ్యారు. ముందుగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. వరంగల్‌వెస్ట్ నియోజకవర్గంలోని దాదాపు 800 మంది ఉద్యమకారులు, అమరుల కుటుంబ సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి పొన్నం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రమనే ఫుట్ బాల్ గ్రౌండ్ లో బిల్లు పాస్‌చేసే గోల్కొట్టడానికి నాడు12 మంది ఎంపీలం కృషి చేశామని చెప్పారు.
తెలంగాణ అమరులు, ఉద్యమకారులను గౌరవించుకోవడం, వారి కుటుంబాలను ఆదుకునేందుకు నివేదిక తయారు చేయాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో వారందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 11వ ఆవిర్భావ సభలోగా అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు, 25 వేల పింఛన్, ఉద్యమంలో జైలుకెళ్లిన ఉద్యమకారులకు సరైన గౌరవం కల్పిస్తామని తెలిపారు. గతంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కాకతీయ ఉత్సవాలు జరిగాయని, ఈ ఏడాది మళ్లీ నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణలో ఉద్యమకారులకు సముచిత స్థానం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో పదేండ్ల తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడిందని, ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపేలా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, పాలకులు, ప్రజలు ఎవరైనా ప్రసంగం ముగించే సమయంలో 'జై తెలంగాణ' నినాదం చేసేలా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తెలంగాణ ఏర్పాటును ప్రధాని అవమానపర్చిండు
తెలంగాణ ఏర్పాటును ప్రధాని మోదీ అవమాన పరుస్తున్నారని, తెలంగాణ ఏర్పాటును అవమానపరిచేలా మాట్లాడితే అమరులను కించపరిచినట్టేనని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి బిల్లు పాస్ చేస్తే.. తెలంగాణ ఏర్పడిందనే కనీస అవగాహనతో ఆ పార్టీ నాయకులు మాట్లాడాలని సూచించారు. తెలంగాణ అమరుల ఆకాంక్షలు, ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. తెలంగాణ తల్లుల ఆవేదన, ఆకాంక్షలను నెరవేర్చాలనే ఉద్దేశంతోనే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ప్రకటించారని చెప్పారు.
ఉద్యమ సమయంలో స్పీకర్ మీరా కుమార్, ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మా స్వరాజ్ ఎంతగానో సపోర్ట్ చేశారని, వారందరి కృషి తెలంగాణ రాష్ట్ర సాధనకు కారణమైందని తెలిపారు. తానొక్కడినే తెలంగాణ తెచ్చానని చెప్పుకునే వాళ్ల వల్లనే ఉద్యమకారులమంతా అడ్రస్ లేకుండా పోయామని, గడిచిన పదేండ్లలో ఉద్యమకారులను చెత్త బుట్టలో వేశారని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ బిల్లు విషయమై సుప్రీంకోర్టు కు వెళ్దామంటే పేరున్న ఏ లాయర్ అందుబాటులో లేడని, అందరికీ ఆంధ్రా వాళ్లు పైసలు ఇచ్చారని ఓ లాయర్ చెప్పాడని గుర్తు చేశారు. ఎంతోమంది పోరాట ఫలితంగా తెలంగాణ వచ్చిందని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇన్నేండ్లు నిరంకుశ, నియంతృత్వ పాలన సాగిందని చెప్పారు. ఇప్పుడు అందరి పోరాట ఫలితంగా నిరంకుశ పాలన సమాధి అయ్యిందని స్పష్టం చేశారు.
ఉద్యమాన్ని అణచివేయాలని చూసిన్రు: వివేక్
మంత్రి పదవులు, పోస్టుల ఆశచూపి రగులుతున్న తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు కొంతమంది నాయకులు ప్రయత్నం చేశారని ఉద్యమకాలంలో ఎంపీగా పని చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో మీడియా మొత్తం ఆంధ్రాదే ఉండేదని, తెలంగాణ వాయిస్ ఢిల్లీలో వినిపించడానికే 'వీ6' చానల్ ను స్థాపించానని చెప్పారు. చానల్ ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పామని, తెలంగాణవాదాన్ని విస్తారించామని తెలిపారు. తెలంగాణ కోసం పార్లమెంట్ మెట్ల మీద నిరాహారదీక్ష చేసినప్పుడు చాలామంది ఎంపీలు తమను చూసి నవ్వుకుంటూ పోయారని, అసలు తెలంగాణ సాధ్యమవుతుందా? అని అనుమానపడ్డారని చెప్పారు. అయినా కాంగ్రెస్ ఎంపీలుగా తెలంగాణ కోసం పార్లమెంట్ లో పోరాటం చేశామని తెలిపారు. రాష్ట్రం ఇవ్వాల్సిందేనని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి చెప్పామని, తెలంగాణ ఎందుకు ఇవ్వాలో సోనియాగాంధీకి వివరించామని తెలిపారు.
తెలంగాణ వనరులు, ఇక్కడ ఖర్చు చేస్తున్న నిధుల గురించి కూడా వివరించామని చెప్పారు. తెలంగాణ బిల్లు పాస్ చేయించే బాధ్యత సోనియాగాంధీ తమపై పెట్టారని, గులాం నబీ ఆజాద్‌తోపాటు జైపాల్ రెడ్డి తెలంగాణ బిల్లు పాస్ కావడానికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఆ తర్వాత తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసిందని, జైపాల్ రెడ్డి చెప్పిన ప్రకారమే వాయిస్ ఓటింగ్ తోనే తెలంగాణ బిల్లు పాస్ అయిందని గుర్తు చేశారు. అది తెలంగాణ ప్రజల విక్టరీ అని, పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధిలో మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, నాగరాజు, యశస్వినీరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.