
హైదరాబాద్, వెలుగు: దేశమంతా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదం మార్మోగుతోందని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు అన్నారు. లక్షల కోట్ల రూపాయలతో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవద్దా ? అని ప్రశ్నించారు. గురువారం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ పై ఉన్న సోనియా, రాహుల్ గాంధీ బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి అప్రతిష్ట పాల్జేయాలని ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. ఈడీ ప్రాథమిక విచారణలోనే సోనియా, రాహుల్ గాంధీ ముద్దాయిలుగా తేలారని గుర్తు చేశారు.
సోనియా గాంధీ కుటుంబం బోఫోర్స్ కుంభకోణం, 2జీ స్కామ్, హెలికాప్టర్ కుంభకోణం, కామన్ వెల్త్ స్కామ్లాంటి ఎన్నో అవినీతి కేసుల్లో వేల కోట్లు, దేశ సంపదను లూఠీ చేసిందని ఆరోపించారు. పాట్నా, లక్నో, ఢిల్లీ, ముంబైలో ఉన్న వేలకోట్ల రూపాయల నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కాంగ్రెస్ పార్టీలోని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, వారి కుటుంబం కాజేసిందని చెప్పారు. అద్దంకి దయాకర్ కొత్తగా ఎమ్మెల్సీ అయ్యారని, ఆయన స్థాయికి మించి మోదీ, అమిత్ షాపై అవమానకరంగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు.