
- అందుకే చార్జ్‌షీట్‌లో పేరు నమోదు చేశారన్న కాంగ్రెస్
- ఈడీ తీరుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి పెరుగుతున్న ప్రజాధరణ చూసి బీజేపీకి భయం మొదలైందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ను ఉపయోగించుకుని తప్పుడు కేసులు పెడుతోందని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో దాఖలు చేసిన చార్జిషీట్లో సోనియా, రాహుల్ గాంధీల పేర్లను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని అక్బర్ రోడ్డులో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్దకు కాంగ్రెస్ ఎంపీలు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా తదితర అనుబంధ సంఘాల నేతలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో భద్రతాబలగాలను మోహరించారు. కాంగ్రెస్ ఢిల్లీ చీఫ్ దేవేందర్ యాదవ్ సహా పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ నిరంకుశ మోదీ సర్కారు తన పాపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు గాంధీ కుటుంబంపై నిందలు వేస్తోందని ఆరోపించారు. గాంధీ కుటుంబంపైనా, కాంగ్రెస్ పార్టీపైనా బీజేపీ కక్ష కట్టిందన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్‌కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి మోదీ సర్కారులో భయం మొదలైందన్నారు. ‘‘కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంధన లూటీకి పాల్పడుతున్నది. బీజేపీకి ఒక విజన్ లేదు, సొల్యూషన్ లేదు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే వారి పాలసీ. వర్తక లోటు మూడేండ్ల కనిష్టానికి చేరింది. టారిఫ్‌లు, ట్రేడ్ వార్ల మీద కేంద్రానికి క్లారిటీ లేదు. నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. కేవలం పెట్రో ధరలు రూ.39 లక్షల కోట్లు పన్నుల రూపంలో పిండి సామాన్యుడి నడ్డి విరగ్గొట్టారు. తాజాగా మళ్లీ ఎల్పీజీ సిలిండర్ ధరలు రూ.50 పెంచారు. మోదీ వైఫల్యాల మీద మేము మా గళాన్ని ఎత్తుతూనే ఉంటాం. కేంద్రం బెదిరింపు చర్యలకు భయపడం” అని ఖర్గే పేర్కొన్నారు. కేంద్రంలో 11 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ఆరోపణలు చేయడమే తప్ప ఒక్క చిన్న ఆధారాన్నీ చూపలేదని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ అన్నారు. గాంధీ కటుంబంపై తప్పుడు చార్జిషీట్లు ఫైల్ చేశారని ‘ఎక్స్’ లో ఆయన అన్నారు. నేషనల్ హెరాల్డ్‌ను చూసి గతంలో బ్రిటిషర్లు భయపడేవారని, ఇప్పుడు ఆరెస్సెస్ భయపడుతోందని కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరా ట్వీట్ చేశారు.
ఆధారాలు లేకపోయినా కేసులా?
పన్నెండేండ్ల క్రితం జరిగిన కేసును కేవలం రాజకీయ కక్షతోనే మళ్లీ తిరగతోడారని కాంగ్రెస్ లీడర్ సుప్రియా శ్రీనటే విమర్శించారు. గాంధీ ఫ్యామిలీని చూసి మోదీ సర్కారు భయపడుతున్నదని ఎద్దేవా చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్ల నుంచి 240 పడిపోయిందని, దీంతో బీజేపీలో భయం మొదలైందని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హి ఎద్దేవా చేశారు. ఎన్డీయే కూటమిని నితీశ్, చంద్రబాబు వీడితే ప్రభుత్వమే పడిపోతుందన్నారు.