హైదరాబాద్, వెలుగు: హిందువుల పండుగలంటే కాంగ్రెస్కు చిన్నచూపని బీజేపీ మహిళా మోర్చా జాతీ య అధ్యక్షురాలు వసతి శ్రీనివాసన్ అన్నారు. సెక్యులరిజం పేరుతో హిందు సంప్రదాయాలను అగౌరవపరుస్తోందని విమర్శించారు. శుక్రవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె చీఫ్ గెస్టుగా హాజరై మాట్లాడారు.
బతుకమ్మ పండుగ నిర్వహణకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, హైకోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకొని నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై కూడా వసతి స్పందించారు. మూడో వ్యక్తి గురించి, ఇతరుల కుటుంబాల గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం తప్పని అభిప్రాయపడ్డారు.
బతుకమ్మకు కూడా కోర్టు పర్మిషనా? : డీకే అరుణ
రాష్ట్రంలో బతుకమ్మ ఆడాలంటే కూడా కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలా? అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. సాయంత్రం 6 గంటల వరకే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలకు అనుమతులున్నాయంటూ పోలీసులు నిలిపివేయడంపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.