- అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నరు
- తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలుకాంగ్రెస్కు ఏటీఎంలు
- ముంబైలో బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఏడాదిగా కాంగ్రెస్ అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నదని తెలిపారు. ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 99% ఇంకా మొదలే కాలేదని అన్నారు. మహారాష్ట్రలోని ముంబైలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్, రాహుల్ జోడీ.. తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేశారో.. అదే తరహాలో మహారాష్ట్ర ప్రజలను కూడా మభ్యపెట్టాలని చూస్తున్నారని అన్నారు. తెలంగాణ, కర్నాటక ప్రభుత్వాలు.. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారాయని, ఆర్ఆర్ (రాహుల్‌గాంధీ, రేవంత్) ట్యాక్స్ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో పూర్తిగా అధికార దుర్వినియోగం జరుగుతున్నదని తెలిపారు. రైతులకు రైతు భరోసా పేరుతో రూ.15వేల ఆర్థిక సహాయం అందడం లేదని, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న ఆర్థిక సాయం కూడా ఏ ఒక్కరికీ చేరలేదని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో.. ఒక్క ఇంటికి కూడా శంకుస్థాపన చేయలేదని, కానీ హైదరాబాద్ లో మూసీ సుందరీకరణ పేరుతో దశాబ్దాలుగా ఉన్నవారి ఇండ్లను కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేనిఫెస్టోలో మొదటి పేజీలోని పథకాలే అమలు చేయలేని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు.. మహారాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రూ.4వేల పింఛను ఇస్తామని చెప్పారని, కానీ.. గతంలో ఇచ్చే పింఛను కూడా ఇవ్వడంలేదని ఆరోపించారు. పేపర్లలో భారీగా ప్రకటనలు ఇవ్వడమే తప్ప వాటిని అమలుచేసే శక్తి కాంగ్రెస్ నేతలకు లేదని ఎద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా.. ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిపై ముంబై ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమా? అని రాహుల్‌గాంధీ కి సవాల్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని, దాదాపు రూ.8లక్షల అప్పులున్నాయని పేర్కొన్నారు. తెలంగాణను పదేండ్లపాటు బీఆర్ఎస్ లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వంతు వచ్చిందని విమర్శించారు.