న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో గురువారం జరిగిన టెర్రర్అటాక్ ఘటనపై కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై కాంగ్రెస్ శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆర్మీ సిబ్బంది, పౌరుల భద్రత విషయంలో ఎన్డీయే ప్రభుత్వ విధానాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించింది. దీనిపై శుక్రవారం కాంగ్రెస్అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎక్స్‌వేదికగా స్పందించారు.
"గుల్‌మార్గ్‌లో ఆర్మీ వెహికల్‌పై టెర్రరిస్టుల దాడిలో మన వీర జవాన్లు వీరమరణం పొందారనే వార్త బాధ కలిగించింది. దాడిలో ఇద్దరు కూలీలు కూడా ప్రాణాలు కోల్పోవడం విచారకరం. వారికి నివాళులు అర్పిస్తున్నాను. జమ్మూకశ్మీర్‌లో భద్రత, శాంతిని నెలకొల్పడంలో కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ విధానాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఇలాంటి ఘటనలతో రాష్ట్రం ప్రమాదపు నీడలో జీవిస్తోంది" అని రాహుల్ పేర్కొన్నారు.