పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ముంగిట నుంచి ఓటమి కోరల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుతం అక్కడి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం గల కెప్టెన్ అమరీందర్ సింగ్ స్థానంలో చరణ్‌జీత్ సింగ్ చన్నీని సీఎంగా నియమించిన నాటి నుంచి పరిస్థితులన్నీ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా మారాయి. వరుసగా రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ ప్రతిపక్షంపై పైచేయి సాధించలేకపోతోంది. అమరీందర్ సింగ్ సొంత పార్టీ ప్రకటించి, బీజేపీతో జత కట్టడం బీజేపీకి కలిసొచ్చే అంశం. అమరీందర్ సింగ్ మేలైన పరిపాలన అందిస్తున్నప్పటికీ ప్రియాంక, రాహుల్ గాంధీ అతని వ్యతిరేక వర్గంలోని నవజ్యోత్ సింగ్ సిద్ధూ వైపు మొగ్గు చూపారు. సామర్థ్యంలో తన ప్రత్యర్థులతో సరితూగలేని సిద్ధూకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా వారు కాంగ్రెస్ ఓటమికి ముందే బాటలు వేశారు.
పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం ద్వారా అమరీందర్ సింగ్ కు రాహుల్, ప్రియాంక మరో ఆప్షన్ ఇవ్వలేదు. బీజేపీ, అకాలీదళ్, ఆమ్ఆద్మీ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా వాటిలో చేరడానికి ఆయన సిద్ధపడలేదు. ఎందుకంటే ఆయన స్థాయికి తగ్గ అవకాశాలు ఆ పార్టీల్లో దక్కకపోవచ్చు. అందువల్లే ఆ పార్టీల ఆహ్వానాలను తిరస్కరించిన అమరీందర్ సొంత పార్టీ పెట్టుకోవడమే కరెక్ట్ అని డిసైడ్ అయ్యారు. అయితే, బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించిన అమరీందర్ సొంత పార్టీ పెట్టి, తర్వాత పంజాబ్‌లో ప్రభుత్వాన్ని స్థాపించేందుకు బీజేపీతో జత కట్టవచ్చు.
బీజేపీకి అందివచ్చిన అవకాశం
పంజాబ్‌లో బీజేపీ సాధించలేనిది, అక్కాతమ్ముళ్లిద్దరూ వారికి చేసిపెట్టినట్లయ్యింది. పంజాబ్ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఆశలకు వారు ప్రాణం పోశారు. ఇన్నాళ్లూ పంజాబ్‌లో అకాలీదళ్ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. రాష్ట్రంలో తమకు సొంత బలం లేనందున బీజేపీ కూడా అకాలీదళ్‌తో కలిసి నడిచింది. రైతు ఉద్యమ నేపథ్యంలో రైతులకు మద్దతుగా నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి తమ సపోర్ట్‌ను ఉపసంహరించుకుని బీజేపీకి అకాలీదళ్ షాక్ ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్‌లో బీజేపీకి కష్టాలు తప్పవని అనుకుంటున్న సమయంలో గాంధీ వారసుల వల్ల బీజేపీ ఎన్నడూ లేనంత బలంగా ఫామ్‌లోకి వచ్చింది. అంతా సవ్యంగా ఉంటే రాష్ట్రంలో మళ్లీ అమరీందర్ సీఎం కూడా కావొచ్చు. అకాలీదళ్ ప్రాభవం క్రమంగా తగ్గిపోవడం, కాంగ్రెస్ కుమ్ములాటల మధ్య బీజేపీ–అమరీందర్ దోస్తీ వెలిగిపోవడం ఖాయమనిపిస్తోంది.
సిద్ధూకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి..
మొదటి నుంచీ పరిపక్వత, రాజకీయ చతురత లేని సిద్ధూ వైపు నిలబడి గాంధీలు పొరపాటు చేశారు. సొంత పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని బాహాటంగా విమర్శిస్తూ సిద్ధు పీసీసీ చీఫ్ పదవి పొందాడు. మూడోసారి విజయం సాధించేందుకు అంతా సిద్ధం చేసుకున్న అమరీందర్‌ను సిద్ధూ ఎదిరిస్తున్నా కూడా గాంధీలు అతనికే మద్దతు పలికారు. సిద్ధూని అదుపులో ఉంచాల్సిన గాంధీలు సైలెంట్‌గా ఉండటం అతనిని ప్రోత్సహించడమే అయ్యింది. పైగా అతనికి పీసీసీ చీఫ్ పోస్ట్ ఇచ్చి నెత్తి మీద కూర్చోబెట్టుకుంది. క్రికెటర్ కమ్ పొలిటీషియన్ అయిన సిద్ధూ కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా పార్టీకి అత్యంత ముఖ్యుడైన అమరీందర్‌నే పక్కన పెట్టింది. అమరీందర్ రాజీనామా సమర్పిస్తానని చెప్పినప్పుడు ఆమోదించాల్సింది పోయి చండీగఢ్‌లో జరిగిన లెజిస్లేచర్ మీటింగ్‌లో ప్రభుత్వం నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు ప్రకటించింది. రెండుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా, పంజాబ్ పీసీసీ చీఫ్‌గా పనిచేసిన అమరీందర్‌ను కాంగ్రెస్ వెళ్లగొట్టిన తీరు చూస్తే ఎవరికైనా పాపం అనిపించక మానదు. ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ మరింత మెరుగైన వీడ్కోలు ఇవ్వాల్సిందని కూడా అంతా భావిస్తున్నారు.
అమరీందర్ పొరపాట్లు కాంగ్రెస్ ఖాతాలోకే..
కొత్త సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ విషయానికొస్తే మూడు, నాలుగు నెలలు గడిస్తేనే కాని ఆయన పాలనపై ఒక అభిప్రాయానికి రాలేము. అతనిది దళిత నేపథ్యం అయినప్పటికీ రాబోయే ఎన్నికల్లో అది కాంగ్రెస్‌కు ఓట్లు తెచ్చిపెడుతుందో లేదో కాలమే చెబుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం పంజాబ్‌లో ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీనే ఎదుర్కోవాల్సి వస్తుంది. మాజీ సీఎం అమరీందర్ సింగ్ చేసిన పొరపాట్లకు కూడా ఇప్పుడు ఆ పార్టీనే మూల్యం చెల్లించాల్సి రావొచ్చు. ఇదే సమయంలో అటు పార్టీ, ఇటు ప్రభుత్వం నుంచి బయటకు పంపడం ద్వారా అమరీందర్‌కు జనంలో సానుభూతి పెరిగినట్టు కనిపిస్తోంది.
గాంధీలే పూర్తి బాధ్యత తీసుకోవాలె
చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కూడా టీఎస్ సింగ్ డియో, సచిన్ పైలట్ వంటి నేతల నుంచి అసమ్మతి సెగలు తగులుతూనే ఉన్నాయి. పార్టీ అధిష్టానం తిరుగుబాటు నేతలను బుజ్జగించనట్లైతే మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటనలే రిపీట్ కావచ్చు. అక్కడ జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి బీజేపీలో చేరారు. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో ఆయనే కీలకపాత్ర వహించారు. ప్రస్తుతం దేశంలో పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సొంత పార్టీలో సమస్యలను చక్కదిద్దుకోకపోతే దేశంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీ ఇచ్చిన నినాదం కూడా త్వరలోనే నిజమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికైనా పంజాబ్‌లో జరిగిన అనుభవాల్ని గుర్తెరిగి సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఉంది. ఇందుకోసం పార్టీ హైకమాండ్ మరింత నష్టం జరగకముందే మేల్కొని వేగంగా స్పందించాలి. కాంగ్రెస్ ఏదైనా తప్పు చేస్తుందేమో అని పార్టీ అసమ్మతి లీడర్లు, బీజేపీ కూడా ఎదురుచూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి తప్పు జరిగినా దానికి గాంధీలే పూర్తి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
వాస్తవాలను ఇప్పటికైనా గుర్తించాలె
తాజా పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ముందుగా సొంతింటిని చక్కబెట్టుకోవాలి. పార్టీ నాయకులను బెదిరించే ధోరణిని పక్కన పెట్టి వారిలో పార్టీ హైకమాండ్ పట్ల గౌరవం పెరిగేలా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీలోని స్వార్థపూరిత, అసూయాపరులైన వ్యక్తుల మధ్య ఉన్న గాంధీలు తమ చుట్టూ tతుడిచిపెట్టుకుపోతుందన్న విషయాన్ని గ్రహించాలి. పంజాబ్‌లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని తమ నాయకుల్ని, సీనియర్ లీడర్లను కాంగ్రెస్ అవమానిస్తూ వస్తోంది. యువత, పెద్దల నుంచి కూడా పాలసీలు, కార్యక్రమాలకు సంబంధించి ప్రతిఘటన ఎదురవుతోంది. ఇప్పటికే జీ23 లీడర్లు పార్టీ హైకమాండ్‌పై తిరుగుబాటు చేస్తున్నారు. భవిష్యత్‌లో వారి అడుగులు ఎటుపడతాయో అనేది కూడా కీలకమే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వారి మద్దతును పొందేందుకు అమరీందర్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
వ్యతిరేకత కాస్తా.. సానుభూతిగా మారింది
అమరీందర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నప్పుడు పార్టీ పరంగా ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది. అయితే, ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి అవమానకరంగా గెంటేసినప్పుడు ప్రజల్లో ఆయన పట్ల వ్యతిరేకత కాస్తా సానుభూతిగా మారింది. రెండు టర్మ్‌లు సీఎంగా, పీసీసీ చీఫ్‌గా సేవలందించిన అమరీందర్‌ను అవమానించడం మంచిది కాదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు వచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టే ప్రయత్నం చేయనని అమరీందర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలనే సిద్ధూ కలను వాస్తవం కానివ్వనని కూడా ఆయన ప్రకటించారు. వాస్తవానికి, ప్రస్తుతం అమరీందర్‌సింగ్ కంటే సిద్ధూ భవిష్యత్తే అంధకారంగా మారింది. అతనికి భవిష్యత్‌లో కూడా అమరీందర్ నుంచి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యమంత్రి పీఠం లేకపోయినా అమరీందర్‌కు రాష్ట్రంలో గౌరవం, ప్రజల అభిమానం మెండుగానే ఉన్నాయి. ప్రజల్లో సానుభూతి, బీజేపీ సాన్నిహిత్యం ఆయన మళ్లీ సీఎం పీఠం అధిరోహించేందుకు తోడ్పడుతుందనడంలో సందేహం లేదు.