హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గాంధీభవన్ ముందు ధర్నా చేశారు. అక్కడే రోడ్డుపై బీజేపీ నేతల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అనంతరం బేగంబజార్ పోలీస్‌స్టేషన్ కు వెళ్లి రాహుల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
అంతకుముందు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో పలువురు మహిళా నేతలు, కార్యకర్తలు బీజేపీ ఆఫీసును ముట్టడించేందుకు గాంధీభవన్ నుంచి ర్యాలీగా వెళ్లారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మహిళా నేతలకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు మహిళా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
వాళ్లను సస్పెండ్ చేయాలి: దానం
యాక్టింగ్ చేసే ప్రధాని దేశానికి అరిష్టమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రాహుల్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీకి చెందిన ఓ నటి కూడా రాహుల్ పై దారుణంగా మాట్లాడుతున్నదని మండిపడ్డారు. ‘‘సోనియా, రాహుల్‌కు ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వచ్చినా వారు తీసుకోలేదు. త్యాగాల కుటుంబం వారిది. అలాంటి రాహుల్ పై బీజేపీ నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి” అని కోరారు. బీజేపీ నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు డిమాండ్ చేశారు. లేదంటే మోదీని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. బీజేపీ నేతలు మహిళలపై అత్యాచారాలు, దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
హత్యాయత్నం కేసు పెట్టాలి: బల్మూరి
బషీర్ బాగ్, వెలుగు: రాహుల్‌పై అనుచిత, బెదిరింపు వ్యాఖ్యలు చేసినోళ్లపై హత్యాయత్నం కేసు పెట్టాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్డిమాండ్ చేశారు. రాహుల్‌కు బీజేపీ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ నారాయణగూడ చౌరస్తాలో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేంద్రమంత్రి రవణీత్సింగ్బిట్టు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బల్మూరి మాట్లాడుతూ.. ‘‘బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ప్రజల్లో రాహుల్‌గాంధీకి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేకపోతున్నారు. రాహుల్ ప్రధాని అవుతారని భయపడి, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు” అని అన్నారు. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే బీజేపీ నాయకులను రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించారు.