- నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్
- బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్‌ను టార్గెట్ చేసిన సీనియర్లు
- 4 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు షాక్!
- మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి, ఇతర సీనియర్లతో ఉత్తమ్ భేటీ
- నల్గొండలో కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కౌన్సిలర్లు
- ఎంపీ కోమటిరెడ్డి సమక్షంలో చేరిన మున్సిపల్ చైర్మన్ అబ్బగోని
- గుర్రంపోడులో జానా సమక్షంలో చేరిన జడ్పీటీసీ సరిత, ఇతర ప్రజాప్రతినిధులు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్లు ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి తెరలేపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని శపథం చేసిన ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నేత కుందూరు జానారెడ్డి వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మంగళవారం ఒక్కరోజే నాలుగు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలకు గట్టిషాక్ ఇచ్చారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, మాజీ ఇన్చార్జి కన్మంత శశిధర్ రెడ్డితో పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మంగళవారం చందర్రావు తల్లి వర్ధంతి సందర్భంగా ఉత్తమ్ కోదాడలో ఆయన ఇంట్లో చర్చలు జరపగా, అంతకుముందు శశిధర్ రెడ్డి ఫాంహౌజ్‌లో ఎర్నేని వెంకటరత్నం బాబు, ఇతర సీనియర్ నేతలతోనూ మాట్లాడారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, సీనియర్ నేత మహాబూబ్జానీ, మున్సిపల్ చైర్మన్ శిరీష లక్ష్మీనారాయణతో సహా పలువురు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీరందరినీ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు ఉత్తమ్, బీఆర్ఎస్ సీనియర్లతో మంతనాలు జరిపారు. ఇదిలావుంటే హుజూర్నగర్ఎమ్మెల్యే సైదిరెడ్డి స్నేహితులు, పార్టీ నేతలు కూడా మెల్లగా జారుకుంటున్నారు. సోమవారం హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి సోమవారం కాంగ్రెస్‌లో చేరగా, మంగళవారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్నేహితుడు, సీపీఎం మాజీ ఎమ్మెల్యే ఆరింబడి లక్ష్మీనారాయణ మనవడు సుంకరి క్రాంతి కుమార్ బీఆర్ఎస్కు రిజైన్ చేశారు. ఆయన త్వరలో కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. రవి, క్రాంతి ఇద్దరూ సైదిరెడ్డికి దగ్గరి మిత్రులు కావడం గమనార్హం.
సాగర్‌లో స్పీడ్ పెంచిన జానా...
కొడుకు జయవీర్ రెడ్డి గెలుపు కోసం సాగర్‌లో మకాం పెట్టిన జానారెడ్డి బీఆర్ఎస్ ముఖ్యనేతలతో చర్చిస్తున్నారు. వారం రోజులుగా చేరికల పైనే దృష్టి పెట్టిన జానా మంగళవారం గుర్రంపోడులో పెట్టిన సభకు భారీగా బీఆర్ఎస్ నాయకులు వచ్చారు. ఎమ్మెల్యే భగత్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అసమ్మతి నేతలు మూకుమ్మడిగా జానారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. గుర్రంపోడు జడ్పీటీసీ గాలి సరితా రవికుమార్, జిల్లా రైతు సమితి మెంబర్ కంచర్ల విజయేందర్ రెడ్డి, రైతు సమితి మండల కన్వీనర్ బల్గూరి నగేశ్‌తో సహా వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ లీడర్లు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు బీఆర్ఎస్కు రిజైన్ చేశారు. వచ్చే రెండు రోజుల్లో తిరుమలగిరి, అనుమల మండలానికి చెందిన పలువురు ముఖ్యనేతలు కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.
బీఆర్ఎస్ ఇన్చార్జీల ఆపరేషన్ విఫలం..!
గ్రామాలు, మండలాల్లో అసమ్మతి నేతలకు నచ్చచెప్పేందుకు పార్టీ హైకమాండ్ నియోజకవర్గ ఇన్చార్జీలను రంగంలోకి దింపింది. కానీ వారు ఎంతచెప్పినా అసమ్మతి నేతలు దారికొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నల్గొండలో కౌన్సిలర్లను బుజ్జగించేందుకు ఇన్చార్జి జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ఎంత ప్రయత్నించినా లాభం లేకుండాపోయింది. తలా రూ.10 లక్షలు ఆఫర్ చేసినప్పటికీ కౌన్సిలర్లు ఒప్పుకోలేదని తెలిసింది. ఇక సాగర్‌లో ఎమ్మెల్సీ కోటిరెడ్డికి బుజ్జగింపుల బాధ్యతలు అప్పగించగా, కోటిరెడ్డి ప్రభావం చూపించే తిరుమలగిరి, గుర్రంపోడు మండలాల్లోనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కోదాడ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, హుజూర్నగర్ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా కోదాడలో బీఆర్ఎస్ అసమ్మతి నేతల వ్యవహారం హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇక్కడ అభ్యర్థిని మార్చకపోతే తలోదారి చూసుకుంటామని అసమ్మతి నేతలు హెచ్చరించారు. అయినా అధిష్టానం నిర్ణయంలో మార్పు లేకపోవడంతో పలువురు సీనియర్లు కాంగ్రెస్‌లో చేరాలనే నిర్ణయానికి వచ్చారు.
బీజేపీలో చేరిన రంజిత్ యాదవ్...
నాగార్జునసాగర్ బీఆర్ఎస్ నేత మన్నెం రంజిత్ యాదవ్ మంగళవారం బీజేపీలో చేరారు. చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ‘సాగర్’ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ రంజిత్ యాదవ్ మొదటి నుంచి ఎమ్మెల్యే భగత్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి యాదవ్ మనవడు అయిన రంజిత్ టికెట్ రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈయన బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు తెలిసింది. 2014 ఎన్నికల్లో సాగర్‌లో యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, టీడీపీ నుంచి కడారి అంజయ్య పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి నిలబడ్డారు. దీంతో బీసీ ఓట్లు చీలి జానారెడ్డికి లాభం చేకూరింది. ఈ ఎన్నికల్లో కూడా అదే తరహా సీన్ రిపీట్ అయితే అనివార్యంగా బీఆర్ఎస్ నష్టపోక తప్పదని సీనియర్లు హెచ్చరిస్తున్నారు.
నల్గొండలో కోమటిరెడ్డి దూకుడు
నల్గొండలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దూకుడు పెంచారు. కొద్దిరోజులుగా ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం నల్గొండ మున్సిపల్ కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి హైదరాబాద్‌లోని వెంకటరెడ్డి ఇంట్లో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కంగుతిన్నారు. మూడు నెలల ముందు నుంచే కౌన్సిలర్లు వెంకటరెడ్డితో టచ్‌లో ఉన్నారని, తెలిసి షాక్‌కు గురయ్యారు. చేరిన వారిలో వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, ప్రదీప్ నాయక్, ఖయ్యుంబేగ్, బోయపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆరుగురు కౌన్సిలర్లు ఉన్నారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి ఒంటెత్తు పోకడలు నచ్చకనే పార్టీ మారుతున్నట్టు వైస్ చైర్మన్ రమేశ్మీడియాకు తెలిపారు. తమ రాజకీయ గురువైన కోమటిరెడ్డిని తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించి తమ సత్తా చాటుతామన్నారు.