ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

చొప్పదండి,వెలుగు: గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులను రద్దు చేయాలని కాంగ్రెస్ లీడర్లు చొప్పదండి అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్​చార్జి ఎం.సత్యం మాట్లాడుతూ ప్రజలపై ప‌‌‌‌‌‌‌‌న్నుల భారం మోప‌‌‌‌డమే ల‌‌‌‌క్ష్యంగా టీఆర్ఎస్​పాల‌‌‌‌న  సాగిస్తోందన్నారు. ఏటా ఇంటి ప‌‌‌‌న్ను, వ్యాపార లైసెన్సు ఫీజులు 5 శాతం పెంచేవారని, కొత్త పంచాయతీ రాజ్ చ‌‌‌‌ట్టం పేరిట ఇంటి ప‌‌‌‌న్ను 5 నుంచి 20 శాతానికి పెంచ‌‌‌‌డం దారుణమన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు. ధర్నాలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్​రెడ్డి, లీడర్లు తదితరులు
పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు :బల్దియా చైర్ పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి
జగిత్యాల, వెలుగు : ఆఫీసర్లు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని బల్దియా చైర్ పర్సన్ డాక్టర్​భోగ శ్రావణి హెచ్చరించారు. శుక్రవారం జగిత్యాల బల్దియా ఆఫీస్ లో వివిధ విభాగాల ఆఫీసర్లు, సిబ్బంది తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సిబ్బంది అందరూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కోరారు. సమావేశంలో కమిషనర్ గంగాధర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేశ్వర్, టీపీఓ ప్రవీణ్, టీపీఎస్​శ్యాంసుందర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, బిల్ కల్లెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ప్లాస్టిక్ టెక్నాలజీపై ఉచిత శిక్షణ
జ్యోతినగర్, వెలుగు: రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ(సీపెట్) ద్వారా యువతకు ప్లాస్టిక్ టెక్నాలజీపై ఉచిత శిక్షణ అందిస్తామని డీజీఎం త్రివేదియా, సీపెట్ ఆఫీసర్ గోవింద తెలిపారు. శిక్షణ తర్వాత ప్లాస్టిక్, అనుబంధ పరిశ్రమల్లో ప్లేస్​మెంట్​కల్పిస్తామన్నారు. శుక్రవారం ఎన్టీపీసీ ఈడీసీ హాల్ లో వారు మాట్లాడారు. మెషీన్ ఆపరేటర్ అసిస్టెంట్, ఇంజక్షన్ మౌల్డింగ్ అసిస్టెంట్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ తదితర కోర్సులలో 6 నెలల శిక్షణ ఇస్తామని, భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు 99593 33417, 89784 80207 నంబర్లపై సంప్రదించాలని సూచించారు.

‘పోడు’ సర్వే వేగవంతం చేయాలి:కలెక్టర్ అనురాగ్ జయంతి
రాజన్న సిరిసిల్ల,వెలుగు : పోడు భూముల సర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో వివిధ మండలాల తహసీల్దార్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం నియమించిన ఆఫీసర్లు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలను శనివారం తనిఖీ చేసి, నివేదిక సమర్పించాలన్నారు. ధరణి, రెవెన్యూ సమస్యలు, కోర్టు కేసులు, మీసేవ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలన్నారు. 15 రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు సమాయత్తం కావాలని సూచించారు. కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఇన్​చార్జి ఆర్డీఓ  టి.శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు. 

స్థలం కబ్జా చేసినోళ్లపై చర్యలు తీసుకోండి 
అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే రవిశంకర్

చొప్పదండి,వెలుగు: స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల క్రీడా మైదానానికి చెందిన నాలుగు ఎకరాల 34 గుంటల స్థలాన్ని సర్వే చేయించి హద్దులు నిర్ణయించడంతోపాటు స్థలాన్ని కబ్జా చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రవిశంకర్ తహసీల్దార్ రజితను ఆదేశించారు. క్రీడా మైదానంలో ఓపెన్ జిమ్ పనులు చేసేందుకు వచ్చిన కూలీలను శుక్రవారం చొప్పదండి పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు తిరిగి పంపడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మైదానాన్ని పరిశీలించారు. జిమ్ పనులకు ఆటంకం కలిగిస్తే చర్యలు తీసుకోవాలని ఎస్ఐ ఉపేంద్రాచారిని ఆదేశించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించి పనుల ఆలస్యంపై కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట మున్సిపల్ చైర్​పర్సన్ నీరజ, వైస్ చైర్​పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శాంతి కుమార్, కౌన్సిలర్లు ఉన్నారు.

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు రండి
కలెక్టర్ కు సర్పంచ్ ​ఆహ్వానం

కొడిమ్యాల, వెలుగు: మండలకేంద్రంలో ఈనెల 21వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే రాష్ట్రస్థాయి 55వ సీనియర్ ఖోఖో పోటీలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ గుగులోత్ రవిని కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలేటి మమత నర్సింహరెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మమత మాట్లాడుతూ ఉమ్మడి పది జిల్లాల క్రీడాకారులు పాల్గొనే ఈ టోర్నీ నిర్వహణకు తెలంగాణ ఖోఖో అసోసియేషన్, కొడిమ్యాలను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.'

ప్రత్యామ్నాయ పంటలపై  దృష్టి 
జిల్లా ఉద్యానవన అధికారి జగన్మోహన్ రెడ్డి 

ముత్తారం, వెలుగు : రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని పెద్దపల్లి జిల్లా ఉద్యానవన అధికారి జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్థానిక తిరుమల ఆయిల్ కెమికెల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు  ఆయిల్ పాంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇండోనేషియా జన్యు విభాగ శాస్త్రవేత్త నికోలస్ ఆయిల్ పాం గురించి వివరించారు. లోహా, తిరుమల కంపెనీ సీఈఓలు రంగనాయకులు, కేశుకల్యాణ్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో 9వేల ఎకరాల ఆయిల్ పాం మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. అనంతరం శాస్త్రవేత్త నికోలస్ను వారు 
సన్మానించారు.  

‘సీపీఎం ఆరోపణలు చేయడం సరికాదు’
కరీంనగర్ సిటీ, వెలుగు: ఎలాంటి అధారాలు లేకుండా రైస్ మిల్లర్స్ పై సీపీఎం లీడర్​వాసుదేవరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రైస్ మిల్లర్స్ అసోసియోషన్ జిల్లా అధ్యక్షుడు బచ్చు భాస్కర్ అన్నారు. శుక్రవారం నగరంలోని ప్రెస్ భవన్​లో ఆయన మాట్లాడారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఆదేశించినంత ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. కరోనా టైంలో కూడా మిల్లులు తెరిచి కార్మికులకు ఉపాధి కల్పించామన్నారు. 40 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్నామని ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రావు పాల్గొన్నారు. 


పాత అలైన్​మెంట్ ప్రకారమే కెనాల్ నిర్మించండి

తహసీల్దార్​ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ ధర్నా
ఎల్లారెడ్డిపేట, వెలుగు: కాళేశ్వరం నైన్త్ ప్యాకేజ్ డీ బ్లాక్ కెనాల్ ను పాత అలైన్​మెంట్ ప్రకారమే నిర్మించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఎల్లారెడ్డిపేట తహసీల్ ఆఫీస్ ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండలాధ్యక్షులు నర్సయ్య మాట్లాడుతూ ఎల్లారెడ్డి పేట మండలం హరిదాస్ నగర్ లో కాళేశ్వరం 9వ ప్యాకేజీ డీ బ్లాక్ కెనాల్ కోసం అధికారులు సర్వే నిర్వహించి అలైన్​మెంట్​ ఇచ్చారన్నారు. ముంపునకు గురవుతున్న భూమిలో టీఆర్ఎస్ నాయకుడు పెట్రోల్ బంకు నిర్మిస్తున్నందున దాన్ని తప్పించడానికి ఇరిగేషన్ అధికారులు మళ్లీ సర్వే చేస్తున్నారన్నారు. అలైన్​మెంట్​మార్చడం వల్ల 50 మంది రైతులు అదనంగా 20 గుంటల చొప్పున భూమి నష్టపోతారన్నారు. అనతరం తహసీల్దార్ జయంత్ కు వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో సంగీతం శ్రీనివాస్, షేక్ గౌస్, బానోతు రాజు నాయక్, దండు శ్రీనివాస్, గంట బుచ్చ గౌడ్, రైతులు
పాల్గొన్నారు. 

విద్యా వ్యవస్థ పటిష్టతకు సర్కార్ కృషి 
జడ్పీ చైర్ పర్సన్ వసంత

జగిత్యాల, వెలుగు: రాష్ట్ర సర్కార్ విద్యా వ్యవస్థ పటిష్టత కోసం కృషి చేస్తోందని జడ్పీ చైర్ పర్సన్ డి.వసంత అన్నారు. శుక్రవారం జడ్పీ ఆఫీస్ లో చింతకుంట, కొత్తపేట, ఓబుళాపూర్, నాచుపల్లి, గుట్రాజ్ పెల్లి స్కూల్​హెడ్ మాస్టర్లకు ఇంగ్లిష్ ​మీడియం అండర్ టేకింగ్ సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ స్టూడెంట్లకు మెరుగైన విద్యా బోధన చేయాలని సూచించారు. పిల్లలకు మంచి భవిష్యత్​ను అందించేందుకు ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమం లో జడ్పీ సీఈఓ రామానుజాచార్యులు, హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు.

స్వచ్ఛతలో తెలంగాణదే అగ్రస్థానం

మున్సిపల్ చైర్​పర్సన్ ​కళ
సిరిసిల్ల టౌన్, వెలుగు : పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో స్వచ్ఛతలో తెలంగాణ అగ్ర స్థానంలో నిలిచిందని మున్సిపల్ చైర్​పర్సన్ జిందం కళ అన్నారు. శుక్రవారం సిరిసిల్లలోని సినారె కళా మందిరంలో స్వచ్ఛ సర్వేక్షణ్​ లో భాగంగా స్వచ్ఛత నియమాలు, చెత్తను వేరు చేయడంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కళ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పట్టణ ప్రగతితో పురపాలక సంఘానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారన్నారు. అనంతరం ఉత్తమ పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ శ్రీనివాస్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. 

ఇసుక లారీలు అడ్డుకున్న గ్రామస్తులు
సుల్తానాబాద్, వెలుగు: మండలంలోని తొగర్రాయిలోని ఇంటర్నల్ రోడ్డుపై వెళ్తున్న ఇసుక లారీలను శుక్రవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. మానేరు ఇసుక రీచ్ కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ లో ఉన్న రోడ్డు గుండా కాకుండా గ్రామం ఇంటర్నల్ రోడ్డు నుంచి ఇసుక లారీలు వెళ్లడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. లారీల వల్ల ప్రమాదాలు జరిగి, రోడ్డు పాడవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు వచ్చి ఆందోళన విరమింపజేశారు.


పెద్దఎత్తున దళిత బంధు మంజూరు చేశాం:కరీంనగర్​ కలెక్టర్​ కర్ణన్
జమ్మికుంట, వెలుగు : దళితుల కోసం ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి పెద్దఎత్తున దళిత బంధు యూనిట్లు మంజూరు చేసిందని కరీంనగర్​కలెక్టర్ కర్ణన్ అన్నారు. శుక్రవారం జమ్మికుంట, హుజూరాబాద్, ఇల్లందకుంటలోని దళితబంధు యూనిట్లను ఆయన పరిశీలించారు. జమ్మికుంటలోని గోల్డెన్​ బేకరి, లేడీస్​ ఎంపోరియం, మిల్క్ డైరీ యూనిట్లతో పాటు ఫ్లెక్సీ యూనిట్లను పరిశీలించారు. అనంతరం సక్రమంగా నడుపుతున్న యూనిట్లకు రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఎస్సీ కార్పొరేషన్​ ప్రత్యేక అధికారి సురేశ్, ఈడీ నాగార్జున, ఎమ్మార్వోలు రాజేశ్వరి, మాధవి తదితరులు పాల్గొన్నారు. 

పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తాం:ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు 
మెట్ పల్లి, వెలుగు: కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్యం, విద్య అందిస్తున్నట్లు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చెప్పారు. శుక్రవారం మెట్ పల్లిలో మహాత్మ  జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్(బాయ్స్)ను ఆర్డీఓ వినోద్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కోరుట్లలో వంద పడకల హాస్పిటల్, మెట్ పల్లి హాస్పిటల్ డెవలప్​మెంట్​కు రూ.ఏడున్నర కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే సర్కారు కొత్తగా 33 రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసిందన్నారు. కార్యక్రమంలో బల్దియా చైర్ పర్సన్ సుజాత, వైస్ చైర్మన్ చంద్ర శేఖర్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ పాల్గొన్నారు.

‘కార్మికులపై పని భారం పెరిగింది’
జ్యోతినగర్, వెలుగు: ఎన్టీపీసీ లో విద్యుత్‌‌‌‌ ఉత్పత్తి పెరుగుతున్నా కార్మికుల సంఖ్య పెరగడంలేదని, దీంతో పని భారం విపరీతంగా పెరిగిందని ఐఎన్టీయూసీ అడిషనల్ ఎన్ బీసీ మెంబర్ బాబర్ సలీం పాషా డిమాండ్ చేశారు. శుక్రవారం రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్ లోని ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ ఆఫీసు లో ఆయన మాట్లాడారు. కొవిడ్ సమయంలో వంద శాతం విద్యుదుత్పత్తి చేసిన కార్మికులకు 20 గ్రాముల బంగారం, రూ.75 వేల  బోనస్​ఇవ్వాల్నారు. సమావేశంలో ఐఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్వామి, జనరల్ సెక్రటరీ కనుకయ్య, ట్రెజరర్ శ్రీనివాస్ నాయకులు పాల్గొన్నారు.


‘పనులైనా బిల్లులు ఇస్తలేరు’
జగిత్యాల, వెలుగు : టీఆర్ఎస్ పాలన లో లీడర్లకు బాధ్యతలే ఉన్నాయని నిధులు లేవ ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగిత్యా ల జిల్లా సారంగాపూర్ లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన  మాట్లాడారు. అప్పు చేసి అభివృద్ధి చేసినా బిల్లు రావడం లేదన్నారు. కేటీఆర్ మునుగోడుకే మినిస్టర్ కాదని, రాష్ట్రానికి మంత్రి అని గుర్తు చేశారు. రైతు వేదికలు నిర్మించా లని ప్రోత్సహించిన కలెక్టర్లు బిల్లులు చెల్లించడంలో బాధ్యత వహించారా అని ప్రశ్నించారు.''

కుల వృత్తుల సంక్షేమమే ధ్యేయం:ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి
జమ్మికుంట, వెలుగు : కుల వృత్తుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని హుజూరాబాద్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం జమ్మికుంట, వావిలాల పెద్ద చెరువులలో 5 లక్షల చేప పిల్లలను నీటిలో వదిలారు. రూ.68 లక్షలతో వావిలాల మార్కెట్ సబ్​ యార్డుకు నిర్మించిన ప్రహరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌశిక్ మాట్లాడారు. కార్యక్రమంలో కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్​విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్​శ్రీనివాస్, మున్సిపల్​ చైర్మన్ రాజేశ్వర్​రావు  పాల్గొన్నారు.  

ఇసుక లారీలు అడ్డుకున్న గ్రామస్తులు
సుల్తానాబాద్, వెలుగు: మండలంలోని తొగర్రాయిలోని ఇంటర్నల్ రోడ్డుపై వెళ్తున్న ఇసుక లారీలను శుక్రవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. మానేరు ఇసుక రీచ్ కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ లో ఉన్న రోడ్డు గుండా కాకుండా గ్రామం ఇంటర్నల్ రోడ్డు నుంచి ఇసుక లారీలు వెళ్లడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. లారీల వల్ల ప్రమాదాలు జరిగి, రోడ్డు పాడవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు వచ్చి ఆందోళన విరమింపజేశారు.


కారు ఢీకొని పాల వ్యాపారి మృతి
కరీంనగర్, వెలుగు: స్థానిక 8వ డివిజన్ అలుగునూరుకు చెందిన గుర్రాల కృష్ణారెడ్డి(50) కారు ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణారెడ్డి జీవనోపాధి కోసం పాల వ్యాపారం చేస్తున్నాడు. పనిలో భాగంగా శుక్రవారం ఉదయం పాలు తీసుకుని స్కూటీపై జిల్లా కేంద్రానికి వస్తుండగా కోతి రాంపూర్ వద్ద కారు ఢీకొంది. దీంతో  తల పగిలి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రైలు కింద పడి యువతి మృతి
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి కొత్తపల్లికి చెందిన తేజస్వి(22) నెల్లూరు జిల్లా గుడూరు రైల్వే స్టేషన్ లో రైలు కింద పడి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. తేజస్వి కుటుంబ సభ్యులు గురువారం రాత్రి జమ్మికుంట రైల్వే స్టేషన్ లో కరీంనగర్​-తిరుపతి రైలు ఎక్కి దైవ దర్శనానికి వెళ్లారు. శుక్రవారం ఉదయం గుడూరు రైల్వే స్టేషన్ లో రైలు ఆగడంతో ముఖం కడుక్కోవడానికి కిందికి దిగింది. అనంతరం రైలు బయలుదేరుతుండగా పరుగెత్తుకుంటూ రైలు ఎక్కడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో జారి కింద పడి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.