గుజరాత్‌‌‌‌ నుంచే కాంగ్రెస్‌‌‌‌ ప్రక్షాళన షురూ

గుజరాత్‌‌‌‌ నుంచే కాంగ్రెస్‌‌‌‌  ప్రక్షాళన షురూ
  • 43 మంది ఏఐసీసీ పరిశీలకులు, 183 మంది పీసీసీ పరిశీలకుల నియామకం
  • తెలంగాణ నుంచి బలరాం నాయక్‌‌‌‌, వంశీచంద్​ రెడ్డి, సంపత్‌‌‌‌ కుమార్‌‌‌‌
  • ఈనెల 15న ఏఐసీసీ, పీసీసీ పరిశీలకుల మొదటి భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్‌‌‌‌  పార్టీ గుజరాత్‌‌‌‌  నుంచే పార్టీ ప్రక్షాళనను షురూ చేసింది. గుజరాత్‌‌‌‌ లో రెండు రోజుల పార్టీ సమావేశం జరిగిన కొద్ది రోజుల్లోనే దూకుడు పెంచింది. సంస్థాగత ప్రక్షాళన, గుజరాత్‌‌‌‌  జిల్లాల కాంగ్రెస్‌‌‌‌  కమిటీ-ల అధ్యక్షులను ఎంపిక చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. 43 మంది ఏఐసీసీ పరిశీలకులను, 183 మంది పీసీసీ పరిశీలకులను నియమిస్తూ శనివారం పార్టీ  జనరల్  సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్  ఓ ప్రకటన విడుదల చేశారు.

 ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి ఏఐసీసీ పరిశీలకులుగా చోటు దక్కింది. తెలంగాణ నుంచి ఎంపీ బలరాం నాయక్‌‌‌‌, మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్​రెడ్డి, సంపత్‌‌‌‌ కుమార్‌‌‌‌ కు అవకాశం కల్పించారు. ఏపీ  నుంచి గిడుగు రుద్రరాజు, సిరివెళ్ల ప్రసాద్‌‌‌‌ ను ఏఐసీసీ పరిశీలకులుగా నియమించారు. కాంగ్రెస్‌‌‌‌  పార్టీ సంస్థాగత, ప్రక్షాళన, నిర్మాణ ప్రక్రియకు సంబంధించి వీరిని నియమించామని పేర్కొన్నారు. పార్టీ సంఘటన్‌‌‌‌, సుజన్‌‌‌‌  అభియాన్‌‌‌‌  పేరుతో ఓ లిస్టును పార్టీ ప్రకటించింది. గుజరాత్‌‌‌‌ లోని జిల్లాల కాంగ్రెస్‌‌‌‌  పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి.. మొత్తం 41 జిల్లాలకు జిల్లా కాంగ్రెస్  కమిటీ (డీసీసీ) అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. ప్రతి జిల్లాకు ఒక ఏఐసీసీ పరిశీలకుడిని, నలుగురు పీసీసీ పరిశీలకుల బృందాన్ని నియమించారు. 

ప్రక్షాళన ప్రక్రియ కోసం మొత్తం 43 మంది ఏఐసీసీ పరిశీలకులు, 183 మంది పీసీసీ పరిశీలకులకు బాధ్యతలను అప్పగించారు. పీసీసీ పరిశీలకుల బృందానికి  సమన్వయకర్తగా ఏఐసీసీ పరిశీలకుడు వ్యవహరించనున్నారు. పైలట్‌‌‌‌  ప్రాజెక్టుగా గుజరాత్‌‌‌‌ ను పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఏఐసీసీ  సమావేశాల్లో తీసుకున్న విధానపరమైన నిర్ణయం ప్రకారం పార్టీ ప్రక్షాళన ప్రక్రియను ప్రారంభిస్తున్నామని స్పష్టం చేసింది. మొడాసా పట్టణంలో ఈనెల 15న మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ, పీసీసీ పరిశీలకుల తొలి 
భేటీ జరగనుంది.