![కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జ్గా మీనాక్షి నటరాజన్](https://static.v6velugu.com/uploads/2025/02/congress-party-appoints-new-in-charges-for-9-states-meenakshi-natarajan-to-lead-telangana_kcABqrhXnu.jpg)
- పలు రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను ప్రకటించిన పార్టీ హైకమాండ్
- మధ్యప్రదేశ్‌కు చెందిన మీనాక్షికి రాష్ట్రంతో ప్రత్యేక అనుబంధం
- 2022లో భూదాన్ పోచంపల్లిలో పర్యటన
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ తెలంగాణ కొత్త ఇన్చార్జ్గా సీనియర్ నేత మీనాక్షి నటరాజన్‌ను పార్టీ హైకమాండ్ నియమించింది. ప్రస్తుత ఇన్చార్జ్ దీపాదాస్మున్షీ స్థానంలో మీనాక్షి బాధ్యతలు చేపట్టనున్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే శుక్రవారం రాత్రి తొమ్మిది రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జ్‌లను నియమించారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. జార్ఖండ్ రాష్ట్ర ఇన్చార్జ్గా కె.రాజుకు బాధ్యతలు అప్పగించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్ రాష్ట్ర ఇన్చార్జ్గా పార్టీ సీనియర్ నేత కృష్ణ అళ్లవారును నియమించారు. హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ బాధ్యతలు రజనీ పాటిల్‌కు అప్పగించారు.
హర్యానా ఇన్చార్జ్ గా బీకే హరి ప్రసాద్, మధ్య ప్రదేశ్ ఇన్చార్జ్ గా హరీశ్ చౌదరి, తమిళనాడు, పుదుచ్చేరికి గిరీశ్ చోడంకర్, ఒడిశాకు అజయ్ కుమార్ లల్లూ ను నియమించారు. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్ బాధ్యతలు సప్తగిరి సాంకర్ ఉల్కాకు ఇచ్చారు. వీరితో పాటు పంజాబ్ జనరల్ సెక్రటరీగా చత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేశ్ బాఘేల్, జమ్మూ-కాశ్మీర్, లఢక్ కు సీడబ్ల్యూసీ మెంబర్ సయ్యద్ నాసీర్ హుస్సేన్ ను పార్టీ జనరల్ సెక్రటరీ గా నియమించింనట్లు కేసీ తన ప్రకటనలో స్పష్టం చేశారు.
ఎన్ఎస్యూఐ నుంచి..
రాష్ట్ర కొత్త ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన మీనాక్షి పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ యూఐ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1999–2002 మధ్య ఎన్ఎస్ యూఐ నేషనల్ ప్రెసిడెంట్‌గా పని చేశారు. ప్రస్తుతం రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన్ జాతీయ అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. 2009లో మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ ఎంపీగా ఎన్నికయ్యారు. తెలంగాణతో ఆమెకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
2022లో రాష్ట్రంలో భూదానోద్యమానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఆమె భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకురాలిగా వ్యవహరించారు. కాగా.. కొత్త ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ కు పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్నాళ్లు ఇన్చార్జ్ గా పని చేసిన దీపాదాస్ మున్షీకి ధన్యవాదాలు చెప్పారు. దీపాదాస్ పార్టీని పటిష్టం చేయడంలో ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చిన త్వరాత.. అప్పటి వరకు ఇన్చార్జ్గా ఉన్న మాణిక్కం ఠాకూర్ స్థానంలో దీపాదాస్ ను హైకమాండ్ నియమించింది. ఆమె దాదాపు ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగారు.