చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కారుపై కోడిగుడ్లతో దాడి

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కారుపై కోడిగుడ్లతో దాడి

చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యపై కోడిగుడ్లతో దాడి చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. 2024, ఆగస్ట్ 28వ తేదీ బుధవారం.. ఎమ్మెల్యే యాదయ్య.. నియోజకవర్గంలోని షాబాద్ లో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీకి వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భీమ్ భరత్ అనుచరులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. గో బ్యాక్ యాదయ్య అంటూ నినాదాలు చేశారు. 

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కాలె యాదయ్య.. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు నియోజకవర్గం ఇంచార్జి బీమ్ భరత్. యాదయ్య పార్టీలో చేరినప్పటి నుంచి రెండు వర్గాలు చీలారు కార్యకర్తలు. ఈ క్రమంలో యాదయ్య షాబాద్ రావటంతో.. భరత్ వర్గీయులు అడ్డుకుని.. కోడి గుడ్లు విసిరారు. దీంతో యాదయ్య అనుచరులు సైతం భరత్ అనుచరులపై దాడికి ప్రయత్నించారు. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితి చక్కదిద్దారు.

ALSO READ | వీడియో : సీసీ కెమెరాలో దెయ్యం కనిపించింది.. ఊరంతా ఒకటే భయం

నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జికి సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తారంటూ నిలదీశారు భరత్ అనుచరులు. పదేళ్లుగా షాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని.. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అణిచివేశారని.. అలాంటి యాదయ్య ఇప్పుడు షాబాద్ ఎలా వస్తారంటూ ప్రశ్నించారు.. నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలకు కాకుండా తన అనుచరులకే నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారంటూ ఎమ్మెల్యే యాదయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు భరత్ అనుచరులు.