ఫస్ట్ స్టెప్..4లక్షల మెజార్టీ ..వయనాడ్ ప్రియాంకదే

ఫస్ట్ స్టెప్..4లక్షల మెజార్టీ ..వయనాడ్ ప్రియాంకదే
  • తొలి అడుగులోనే 4.1 లక్షల భారీ మెజార్టీ 
  • మొత్తం ఓట్లల్లో ఆమెకే 6,22,338 ఓట్లు
  • గత ఎన్నికల్లో రాహుల్​ గాంధీ సాధించిన రికార్డు బ్రేక్​
  • పార్లమెంట్‌లో బలమైన గొంతుకనపుతా: ప్రియాంక
  • పార్టీకి, వయనాడ్ ప్రజలకు, ఫ్యామిలీకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్

వయనాడ్:కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా(52) ఘన విజయం సాధించారు. ఎన్నికల బరిలో దిగిన ఫస్ట్ టైమే ఏకంగా 4.1 లక్షలకు పైగా మెజార్టీతో విజయఢంకా మోగించారు. 

ఈ ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో  వయనాడ్, రాయ్​బరేలి స్థానాల నుంచి రాహుల్ పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ గెలుపొందడంతో వయనాడ్ స్థానాన్ని ఆయన వదులుకున్నారు. దాంతో ఇక్కడ ఉపఎన్నిక జరిగింది. 

కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) తరఫున మొదటిసారి ప్రియాంక ఎన్నికల బరిలో నిలబడ్డారు. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌‌‌‌డీఎఫ్‌‌‌‌) తరఫున సత్యన్ మొకేరి, ఎన్‌‌‌‌డీయే తరఫున నవ్య హరిదాస్​తో సహా 16 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ నెల13న వయనాడ్ లోక్ సభ స్థానానికి పోలింగ్ జరిగగా, శనివారం ఫలితాలు విడుదలయ్యాయి.  

రాహుల్ రికార్డుకు బ్రేక్

వయనాడ్ లోక్ సభ స్థానంలో రాహుల్ గాంధీ పేరిట ఉన్న రికార్డును ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీ వాద్రా తిరగ రాశారు. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌లో  వయనాడ్ లో రాహుల్ కి 3.64 లక్షల ఓట్ల మెజార్టీరాగా తాజా ఎన్నికల్లో ఆ మెజార్టీని ప్రియాంక అధిగమించారు. ఏకంగా 4.1 లక్షలకు పైగా మెజార్టీని అందుకున్నారు. అయితే, రాహుల్ సాధించిన ఓట్లను మాత్రం ప్రియాంక చేరుకోలేకపోయింది. ఆయనకు మొత్తం 6,47,445 ఓట్లురాగా.. ప్రియాంకకు మొత్తం 6,22,338 ఓట్లు వచ్చాయి. 

మీ ప్రోత్సాహం వర్ణనాతీతం

ఎన్నికల సమయంలో తన వెన్నంటే ఉన్న కుటుంబ సభ్యులకు ప్రియాంక కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎన్నికల టైంలో నా తల్లి సోనియా, భర్త రాబర్ట్ తోపాటు నా ఇద్దరు రత్నాలైన రెహాన్, మిరాయా చూపిన ప్రేమ, కనబరిచిన ధైర్యానికి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. మీ ప్రోత్సాహం వర్ణనాతీతం. రాహుల్ నువ్వో ధైర్యవంతుడివి. నా వెన్నంటే ఉండి ముందుకు నడిపించినందుకు ధన్యవాదాలు!’ అని భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. తనకు మద్దతుగా నిలబడిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పొలిటికల్ ఎంట్రీ ఇలా..

కుటుంబమంతా రాజకీయ నేపథ్యం కావడంతో ప్రియంకా గాంధీ పొలిటిక్స్ లోకి ఎంట్రీ చర్చకు దారితీసింది. 2019లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2022లో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార బాధ్యతలను భుజానెత్తుకున్నారు.  ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడినా ప్రియాంక మాటలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. 2022 చివరిలో జరిగిన హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలతో ప్రియాంక దేశం దృష్టిని ఆకర్షించారు. ఆ ఎన్నికల్లో తెరవెనుక ఆమె అన్నీ తానై పార్టీని నడిపించి విజయాన్నిందించారు. అప్పటి నుంచి పార్టీలో కీలక ప్రచారకర్తగా మారిపోయారు. 

మీ తరఫున బలమైన గొంతుకనవుతా

భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ప్రియాంక గాంధీ వాద్రా.. తనకు ఓటు వేసిన ప్రజలకు, తన గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. పార్లమెంటులో వయనాడ్ తరఫున బలమైన గొంతుకగా నిలుస్తానని వారికి భరోసా ఇచ్చారు. 

ఈమేరకు ప్రియాంక 'ఎక్స్' వేదికగా తన గెలుపుపై స్పందించారు. "నా ప్రియమైన వయనాడ్ సోదరీ, సోదరీమణులారా..! మీరు నాపై చూపిన నమ్మకానికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మీ ఆశలు, కలలను నేను కూడా అర్థం చేసుకుంటాను. వాటి కోసం పార్లమెంట్‌‌‌‌లో మీ తరఫున బలమైన గొంతుకనవడానికి ఎదురుచూస్తున్నాను! నాకు ఈ గౌరవంతోపాటు మీ ప్రేమను ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు. ప్రజల ప్రేమను పొందడం చాలా సంతోషంగా ఉంది" అని ప్రియంక పేర్కొన్నారు. 

ప్రియాంకకు మొత్తం 6.22 లక్షల ఓట్లు

ఈసీ లెక్కల ప్రకారం.. వయనాడ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ప్రియాంక గాంధీ వాద్రాకు మొత్తం 6,22,338 ఓట్లతో 4,10,931 మెజార్టీ సాధించారు. ఎల్‌‌‌‌డీఎఫ్‌‌‌‌ అభ్యర్థి సత్యన్‌‌‌‌ మొకేరి 2,11,407 ఓట్లతో  రెండో స్థానంలో..ఎన్‌‌‌‌డీయే అభ్యర్థి నవ్య హరిదాస్ 1,09,939 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. వయనాడ్‌‌‌‌లో మొత్తం 14 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ..ఉపఎన్నిక పోలింగ్ శాతం మాత్రం 65 శాతంగా నమోదైంది. ఈ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించిన ఆమె.. ప్రతి పంచాయతీకి వెళ్లారు. పోలింగ్ రోజున మిగతా అభ్యర్థుల కంటే ఎక్కువ బూత్ లను సందర్శించారు. అందుకే ఆమె భారీ మెజార్టీని సొంతం చేసుకున్నట్లు అంచనా. 

ప్రియాంక ప్రొఫైల్ 

గాంధీ-నెహ్రూ కుటుంబం వారసురాలిగా ప్రియాంకా గాంధీ రాజకీయాలకు పరిచయమయ్యారు. కానీ, వయనాడ్ లోక్ సభ స్థానానికి ఇటీవల నిర్వహించిన ఉపఎన్నిక ద్వారానే ఆమె తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. వయనాడ్ ప్రజలు ఆమెకు భారీ మెజార్టీ కట్టబెట్టి పార్లమెంట్​కు పంపిస్తున్నారు. ఒక క్యాంపెయినర్​గా మొదలైన ప్రియాంక రాజకీయ ప్రయాణం.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఎంపీగా గెలుపొందారు. 

ఢిల్లీలోనే ఎడ్యుకేషన్ 

ప్రియాంకా గాంధీ 1972 జనవరి 12న జన్మించారు. న్యూ ఢిల్లీలోని మోడరన్ స్కూల్ అండ్ కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీలో పాఠశాల విద్య పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన జీసస్ అండ్ మేరీ కాలేజీ నుంచి సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. బుద్ధిస్ట్ స్టడీస్ లో మాస్టర్స్ డిగ్రీని కంప్లీట్ చేశారు. 1997లో ప్రియాంక గాంధీకి బిజినెస్ మ్యాన్ రాబర్ట్ వాద్రాతో పెండ్లి జరిగింది. వారికి   రెహాన్, మిరాయాఅనే ఇద్దరు పిల్లలున్నారు.