- ఎమ్మెల్యేలు ప్రయారిటీ ఇవ్వడం లేదని దూరంగా కొందరు లీడర్లు
- త్వరలో లోకల్‌బాడీ ఎలక్షన్స్
- ఎన్నికల నిర్వహణపై ఆఫీసర్ల ఫోకస్
మహబూబ్‌నగర్, వెలుగు: పార్టీలో ఏండ్లుగా కొనసాగుతున్న వారికి కాకుండా.. కొందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తున్నారనే టాక్ నడుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌లో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెబుతూ పాత క్యాడర్ దూరంగా ఉంటోంది. ఈ తరుణంలో లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎవరికి చాన్స్ వస్తుందనే విషయంపై చర్చ జరుగుతోంది. పార్టీలో కొత్తగా చేరిన వారికి చాన్స్ ఇస్తామని ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పని చేసిన తమను పక్కన బెడుతున్నారని సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. సీనియర్లకే ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది.
ఎన్నికల ముందు భారీగా చేరికలు..
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు, 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కొందరు ఎంపీపీలు, జడ్పీటీసీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, పార్టీ లీడర్లు కాంగ్రెస్‌లో భారీగా చేరారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు వీరంతా త్వరలో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. గ్రామాల్లో జరిగే మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనల్లో వీరే హడావుడి చేస్తున్నారు. లోకల్‌గా కాంగ్రెస్ లీడర్లు ఉన్నా.. వారిని పక్కకు పెడుతున్నారు. వీరి తీరుతో కాంగ్రెస్ సొంత క్యాడర్ చాలా గ్రామాల్లో నారాజ్‌లో ఉంది.
పార్టీకి దూరంగా..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ 12 స్థానాల్లో విజయం సాధించింది. ఈ విజయం కోసం పార్టీ క్యాడర్ సీరియస్‌గా గ్రౌండ్ వర్క్ చేసింది. అయితే బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీకి చెందిన కొందరు లీడర్లు ఇల్లీగల్ దందాలు నిర్వహించారనే ఆరోపణలు రావడంతో.. దీనిపై అప్పట్లో కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఎక్కువగా ఇసుక, సాండ్, మైన్స్ దందాలు చేసిన వారే ఉన్నారనే టాక్ ఉంది.
Also Read :- 555 టీఎంసీలు ఇవ్వాల్సిందే
తమ దందాలను యథావిధిగా కొనసాగించుకోవడంతో పాటు పార్టీలో పదవులు దక్కించుకునేందుకు వీరు పార్టీలు మారినట్లు పబ్లిక్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కూడా వీరికే సపోర్ట్‌గా ఉంటున్నారనే టాక్ వస్తోంది. సొంత క్యాడర్ కలిసేందుకు వచ్చినా కొందరు ఎమ్మెల్యేలు టైం కూడా ఇవ్వడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరికొందరు ఎమ్మెల్యేలు క్యాడర్‌ను పట్టించుకోకుండా పూర్తిగా పక్కకు పెట్టేశారనే విమర్శలున్నాయి. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో పోటీ చేసేందుకు పాత క్యాడర్ సిద్ధంగా ఉన్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయకూండా దూరం పెడుతుండడంతో వారంతా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటున్నారనే టాక్ నడుస్తోంది.