- ఫస్ట్ లిస్ట్‌లో 8 మంది, సెకండ్ లిస్ట్‌లో ఆరుగురిని ఫైనల్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్
- అనూహ్యంగా నారాయణపేట బరిలో పర్ణికా రెడ్డి
- ఆరు స్థానాల్లో పోటీ చేయనున్న యూత్ లీడర్లు
- మూడు సీట్లు బీసీలకు, రెండు చోట్ల మహిళా లీడర్లకు అవకాశం
మహబూబ్‌నగర్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే క్యాండిడేట్లను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసింది. ఈ నెల 15న రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 8 సీట్లకు క్యాండిడేట్లను కన్ఫాం చేయగా.. పోటీ ఎక్కువగా ఉన్న మిగిలిన ఆరు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఇదే సమయంలో ఈ సెగ్మెంట్లలో టికెట్లు ఆశించిన లీడర్లకు కూడా హామీలు ఇచ్చినట్లు సమాచారం. అలాగే పార్టీ చేపట్టే రెండో విడత బస్సు యాత్రలోనూ స్థానం కల్పించింది.
అభ్యర్థులు వీరే..
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ శుక్రవారం రాత్రి ప్రకటించిన సెకండ్ లిస్ట్‌లో వనపర్తి నుంచి మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల నుంచి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, దేవరకద్ర నుంచి పాలమూరు డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్‌రెడ్డి(జీఎంఆర్), మక్తల్ నుంచి నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు వాటికి శ్రీహరి, నారాయణపేట నుంచి దివంగత మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి మనుమరాలు చిట్టెం పర్ణికా రెడ్డి పేర్లను ఫైనల్ చేసింది. అయితే, నారాయణపేట నుంచి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా, ఆయన పోటీకి దూరంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే స్థానం కోసం కుంభం శివకుమార్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ నడిచినా.. అవన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది.
ఆయన తన మేనకోడలు పర్ణికారెడ్డికి నారాయణపేట టికెట్ ఇవ్వాలని గతం నుంచి హైకమాండ్ వద్ద డిమాండ్ చేస్తున్నారు. ఫైనల్‌గా ఆమెకు టికెట్ కన్ఫాం కావడంతో ఆయన పోటీలో ఉంటారనేది ఊహాగానమని తేలిపోయింది. సామాజిక సమీకరణల్లో భాగంగా మహబూబ్‌నగర్, మక్తల్, దేవరకద్ర స్థానాల్లో ఒక సెగ్మెంట్ బీసీ లీడర్‌కు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ తెరమీదకు వచ్చింది.
ఈ తరుణంలో మహబూబ్‌నగర్ నుంచి ఎన్పీ వెంకటేశ్, సంజీవ్ ముదిరాజ్, దేవరకద్ర నుంచి ప్రదీప్‌కుమార్ గౌడ్, మక్తల్ నుంచి శ్రీహరి పేర్లను హైకమాండ్ పరిశీలించగా, చివరగా మక్తల్ స్థానాన్ని బీసీలకు కేటాయించింది. దీంతో పాలమూరు, దేవరకద్ర స్థానాల నుంచి యెన్నం, జీఎంఆర్‌లకు పోటీకి లైన్ క్లియర్ అయ్యింది. అలాగే మక్తల్ స్థానం కోసం మాజీ ఎమ్మెల్యే సీతమ్మ, మాజీ డీసీసీబీ చైర్మన్ వీరారెడ్డి కుమారుడు ప్రశాంత్‌రెడ్డి తదితరులు పోటీ పడినా అవకాశం దక్కలేదు.
వనపర్తి నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి టికెట్ కోసం ప్రయత్నించినా, ఫైనల్‌గా హైకమాండ్ చిన్నారెడ్డికే అవకాశం ఇచ్చింది. టికెట్ల కోసం పోటీ పడిన నేతలను బుజ్జగించేందుకు హైకమాండ్ పలు హామీలు కూడా ఇచ్చినట్లు సమాచారం.
ముగ్గురు బీసీలు.. ఇద్దరు మహిళలు..
ఉమ్మడి జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడంతో మూడు సీట్లను బీసీలకు కేటాయించింది. ఫస్ట్ లిస్టులో గద్వాల స్థానాన్ని సరిత తిరుపతయ్య, షాద్‌నగర్ నుంచి వీర్లపల్లి శంకర్ పేరును ఫైనల్ చేసింది. రెండో లిస్ట్‌లోనూ మక్తల్ నుంచి శ్రీహరికి బీసీ కోటా కింద అవకాశం కల్పించింది. అలాగే ఇద్దరు మహిళా లీడర్లకు చాన్స్ఇచ్చింది. ఫస్ట్ లిస్ట్‌లో సరిత ఉండగా, సెకండ్ లిస్టులో పర్ణికారెడ్డి పేరును ప్రకటించింది. రూలింగ్ పార్టీ ఉమ్మడి జిల్లాల్లోని 14 స్థానాల్లో ఒక్క మహిళకు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం.
పాలమూరులో బస్సు యాత్ర-–2
ఎలక్షన్ల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఉమ్మడి జిల్లాల్లో బస్సు యాత్రలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేస్ యాత్ర ముగియగా, సెకండ్ ఫేస్‌ను శనివారం నుంచి ప్రారంభించనుంది. 17 నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగనుండగా, అందులో 31న కొల్లాపూర్, నవంబర్ ఒకటిన కల్వకుర్తి, జడ్చర్ల నియోజకవర్గాల మీదుగా ఈ యాత్ర వెళ్లనుంది. కొల్లాపూర్‌లో జరిగే సభకు ప్రియాంక గాంధీ హాజరు కానుండగా, జడ్చర్ల సభకు రాహుల్ గాంధీ హాజరయ్యే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అక్కడి నుంచి షాద్‌నగర్‌కు యాత్ర వెళ్లనుండగా, అక్కడి నుంచి కొంత దూరం పాదయాత్ర చేయనున్నట్లు సమాచారం.
బరిలో ఆరుగురు యూత్ లీడర్లు..
ఉమ్మడి జిల్లాల్లోని 14 స్థానాలకు గాను ఆరు స్థానాల్లో కాంగ్రెస్ హైకమాండ్ యూత్ లీడర్లకు అవకాశం కల్పించింది. వీరంతా మొదటి సారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి, తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో జడ్చర్ల నుంచి అనిరుధ్‌రెడ్డి, దేవరకద్ర నుంచి జీఎంఆర్, గద్వాల నుంచి సరిత, మక్తల్ నుంచి శ్రీహరి, నారాయణపేట నుంచి పర్ణిక, నాగర్‌కర్నూల్ నుంచి రాజేశ్‌రెడ్డి ఉన్నారు. వీరంతా పదేండ్లుగా అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, సుంకిని రాజేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డిలపై పోటీ చేయనున్నారు.