కాంగ్రెస్​ మహిళా అస్త్రం .. మహిళా సెంటిమెంట్​పై కాంగ్రెస్ గురి 

  • ఆదిలాబాద్ పార్లమెంట్ బరిలో మొదటిసారి మహిళా అభ్యర్థి 
  • ఆదివాసీ హక్కుల పోరాట యోధురాలు సుగుణకు కాంగ్రెస్ పట్టం
  • ఇద్దరు సీనియర్లను ఢీకొట్టనున్న ఉద్యమకారిణి
  • సుగుణ ఎంపికలో చక్రం తిప్పిన ఇన్​చార్జి మంత్రి సీతక్క 
  • మూడు పార్టీలకు అభ్యర్థులు ఖరారు

ఆదిలాబాద్, వెలుగు:  అభ్యుదయ భావజాలంతో పాటు ఆదివాసీల హక్కుల కోసం 22 ఏండ్ల నుంచి పోరాడుతున్న ఆత్రం సుగుణకు కాంగ్రెస్ ఆదిలాబాద్ లోక్​సభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పార్లమెంట్ పరిధిలోని రాజకీయాల్లో ఓ చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క రాజకీయ పార్టీ ఆదివాసీ మహిళకు లోక్ సభ టికెట్ ఇచ్చే సాహసం చేయలేదు.

అలాంటిది కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది ఆశావహులను కాదని హక్కుల ఉద్యమకారిని, ప్రభుత్వ ఉపాధ్యాయురాలైన ఆత్రం సుగుణను ఎంపీ బరిలో దించడం సర్వత్రా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని సొంత పార్టీ వారే కాకుండా ప్రత్యర్థి పార్టీలు సైతం పరోక్షంగా హర్షిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. చాలా రోజులుగా కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఎంతో మంది సీనియర్లు, ఆశావహులు టికెట్ కోసం పెద్ద ఎత్తున పావులు కదిపారు. చివరకు ఉద్యమకారిణి ఆదివాసీ మహిళ వైపు మొగ్గు చూపింది. 

25 మందిని కాదని..

ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇన్​చార్జి మంత్రి సీతక్క జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి అడుగు వేశారు. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఆదివాసీ అభ్యర్థులైన గొడం నగేశ్, ఆత్రం సక్కుకు టికెట్లు కేటాయించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఈ ఇద్దరు సీనియర్లను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ అభ్యర్థి కోసం తీవ్ర కసరత్తు చేసింది. దాదాపు 25 మంది అభ్యర్థులతో పాటు ఇతర పార్టీల నుంచి సైతం ఆశావహులు టికెట్ ఆశించగా వారిని పరిశీలించింది. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్​టికెట్ వస్తే గెలుస్తామనే ధీమాతో తీవ్ర ప్రయత్నాలు చేశారు. సర్వేలు, అభిప్రాయాలు తీసుకున్న కాంగ్రెస్ చివరకు రెండు పార్టీలకు భిన్నంగా ఆదివాసీ ఆడబిడ్డను పార్లమెంట్ బరిలో దించేందుకు నిర్ణయించింది. 

అభ్యర్థులు ముగ్గురు ఉపాధ్యాయులే..

సుగుణక్క అభ్యర్థిత్వం ఎంపికలో మంత్రి సీతక్క ప్రధానంగా చక్రం తిప్పారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లా ఇన్​చార్జ్​గా నియమితులైన తర్వాత సీతక్క పార్లమెంట్ నియోజకవర్గమంతా సుడిగాలి పర్యటనలు చేశారు. ముఖ్యంగా ఆదివాసీ గూడాలు, తండాల్లో పర్యటించి అక్కడి జనాల నాడీ తెలుసుకున్నారు. దీనికి అనుగుణంగానే ఆమె ఆత్రం సుగుణ పేరును వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొచ్చారు.

లోక్ సభ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న అంశాన్ని కూడా పార్టీ పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా సెంటిమెంట్ అస్త్రంతో బీజేపీ, బీఆర్ఎస్​కు చెక్ పెట్టేలా ఆదివాసీ మహిళను బరిలోకి దింపింది. గతంలో ఉపాధ్యాయు వృత్తికి రాజీనామా చేసి గొడం నగేశ్ ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచారు. ఆత్రం సక్కు సైతం టీచర్​ జాబ్​కు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఆత్రం సుగుణ ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి లోక్​సభ ఎన్నికల బరిలో నిలిచారు.

ఇక ప్రచార క్షేత్రంలోకి ముగ్గురు

మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ క్యాండెట్లు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ నాలుగు, కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆయా సెగ్మెంట్ల వారీగా బలాబలాలను పరిగణలోకి తీసుకొని ప్రచార అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ కు 4,65,476 ఓట్లు, బీజేపీకి 4,48,961 ఓట్లు, కాంగ్రెస్ కు 2,52,286 ఓట్లు వచ్చాయి.

అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. కాంగ్రెస్ ఒక్కసారిగా పుంజుకుంది. సర్పంచ్ లు మొదలు కొని ఎంపీటీసీ, జడ్పీటీసీ, డీసీసీబీ, జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఇలా ఎంతో మంది సీనియర్ లీడర్లతో పాటు క్యాడర్ సైతం కాంగ్రెస్ లో చేరారు. దీనికి తోడు ఆదిలాబాద్ పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి ఓ మహిళకు తామే ఎంపీగా అవకాశం ఇచ్చామనే ప్రచారం సైతం కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం. పార్టీ సెంటిమెంట్ తో పాటు సంక్షేమ అభివృద్ధి పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తోంది.