- మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఆహ్వానాలు
- టచ్‌లోకి వస్తున్న బీఆర్ఎస్ అసంతృప్తులు
- కొల్లాపూర్ సభలో భారీ చేరికలకు ప్లాన్
మహబూబ్‌నగర్, వెలుగు : కర్నాటక ఎన్నికల తరువాత క్రమంగా పుంజుకుంటున్న కాంగ్రెస్ రాష్ట్రంలో చేరికలపై ఫోకస్ పెట్టింది. ఈ నెల 2న ఖమ్మం సభ ద్వారా ఇచ్చిన ‘ఘర్ వాపసీ’ నినాదం ఆ పార్టీకి ప్లస్‌పాయింట్‌గా మారింది. ఇప్పుడు ఇదే నినాదంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఆపరేషన్‌కు లీడర్లు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 20న ఉమ్మడి జిల్లా స్థాయిలో కొల్లాపూర్ కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
కార్యక్రమానికి ప్రియాంక గాంధీ చీఫ్ గెస్ట్‌గా హాజరవుతుండగా, సభ ద్వారా పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిని, రూలింగ్ పార్టీలోని అసంతృప్తులను హస్తం గూటిలో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి లీడర్లు స్వయంగా రంగంలోకి దిగి నేతల ఇండ్లకు వెళ్లి వారిని కలుస్తున్నారు.
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు..
కాంగ్రెస్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పని చేసిన వారిని తిరిగి రప్పించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో ఉమ్మడి జిల్లాకు చెందిన లీడర్లు స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి, పెద్దమందడి, వనపర్తి ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి, కూచుకళ్ల రాజేశ్ కొల్లాపూర్ సభలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వీరితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు పార్టీలో చేరతారనే చర్చ నడుస్తోంది. అలాగే వనపర్తి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి, సీనియర్ లీడర్‌ను కాంగ్రెస్ అప్రోచ్ అయినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీలో చేరే నిర్ణయాన్ని సదరు మాజీ మంత్రి ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం. దేవరకద్ర నియోజకవర్గం నుంచి గతంలో పార్టీ కోసం పని చేసిన మరో సీనియర్ లీడర్‌ను కూడా సంప్రదించినట్లు తెలిసింది. ఈయన చేరిక దాదాపు కన్ఫామ్ అయ్యిందని, కొల్లాపూర్‌లో పార్టీలో చేరతారని టాక్ వస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యేను కాంగ్రెస్‌లోకి రావాలని ఏకంగా పార్టీ స్టేట్ చీఫ్ అప్రోచ్ అయినట్లు తెలిసింది.
కానీ, ఆయన పార్టీలో చేరే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
దేవరకద్రకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేను ఇది వరకే కాంగ్రెస్‌లోకి రావాలని సంప్రదించారు. ఇప్పటికే వీరు కాంగ్రెస్‌లో చేరాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల లేట్ అయ్యిందని అంటున్నారు. ఈ నెల 14న సదరు మాజీ ఎమ్మెల్యే పార్టీలో చేరే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని, ఆయన అనుచరులు చెబుతున్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రాధ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ ఆహ్వానించారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారు. త్వరలో పార్టీలో చేరుతారనే చర్చ నడుస్తోంది.
రేవంత్‌ను కలిసిన జడ్పీ చైర్పర్సన్ దంపతులు
గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు వారాల కింద చైర్పర్సన్ భర్త రేవంత్‌ను కలిశారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక లీడర్ ప్రకటన చేశారు. కానీ, ఇవి పుకార్లేనని కొట్టి పారేశారు. తాజాగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జడ్పీ చైర్ పర్సన్, ఆమె భర్త హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్‌ను ఆయన నివాసంలో కలవడం హాట్ టాపిక్‌గా మారింది. కొల్లాపూర్ సభలో వీరు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
త్వరలో పాదయాత్ర..
రాహుల్ గాంధీ ‘హాత్ సే హాత్ జోడో’ యాత్ర ఉమ్మడి పాలమూరులో సక్సెస్ కావడంతో, నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామాన్ని, ప్రతి ఇంటికి, ప్రతి ఓటరును చేరేలా పాదయాత్రలు చేపట్టాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొల్లాపూర్ సభ అనంతరం యాత్రలను స్టార్ట్ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రేవంత్ రెడ్డిస్పెషల్ ఫోకస్..
ఏడాదిన్నరగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. సొంత జిల్లా కావడం, దక్షిణ తెలంగాణలోనే పెద్ద జిల్లా కావడం, ఇక్కడ 14 అసెంబ్లీ స్థానాలు ఉండడంతో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో మాజీలను సొంత గూటికి తీసుకురావాలనే ప్రపోజల్ ముందుకు తెస్తున్నారు.
బీఆర్ఎస్లో ప్రయారిటీ దక్కని లీడర్లను, అసంతృప్తులను, ఉమ్మడి జిల్లాకు చెందిన కౌన్సిలర్లు, సర్పంచులు, ఇతర లీడర్లను కాంగ్రెస్ గూటికి రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కొల్లాపూర్ సభలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల నుంచి 60 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో జాయిన్ అవుతున్నట్లు ఓ లీడర్ ద్వారా తెలిసింది.