- ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1160 ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభం
- డిమాండ్ ను బట్టి మరో 171 సెంటర్లు ఏర్పాటు చేసే యోచనలో అధికారులు
కరీంనగర్, వెలుగు: వడ్ల కొనుగోళ్లపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పుడిప్పుడే వరి కోతలు మొదలుకాగా రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు కొనుగోలు సెంటర్లను ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,331 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని టార్గెట్‌గా పెట్టుకోగా ఇప్పటికే 1160 సెంటర్లను ప్రారంభించారు. డిమాండ్ ను బట్టి మరో 171 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కెనాల్స్ కింద చాలాచోట్ల వరి కోతలు ఇంకా మొదలు కాకపోవడంతో చాలా చోట్ల కొనుగోళ్లు ఊపందుకోలేదు.
కొనుగోళ్లకు ఐరిస్..
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గతంలో వడ్లు అమ్మిన రైతు నుంచి బ్యాంక్ అకౌంట్, ఆధార్ నంబర్ ను తీసుకుని ట్యాబ్‌లో ఎంటర్ చేస్తే వారికి ఓటీపీ వచ్చేది. దాని ఆధారంగానే కొనేవారు. రైతు రాకపోయినా ఆతడి వివరాలు ఇస్తే ఎంట్రీ చేసేవారు. అయితే రైతుల పేరిట కొందరు దళారులు, వ్యాపారులు వడ్లు అమ్ముతున్నారనే ఆరోపణలు రావడంతో సివిల్ సప్లయీస్ ఆఫీసర్లు ఈసారి ఐరిస్ అమలు చేస్తున్నారు. దీంతో వడ్లు అమ్మే రైతు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలకు రావాల్సి ఉంటుందని, దీనివల్ల దళారులకు చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
అలాగే కౌలు రైతులు కూడా వడ్లు అమ్ముకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం కౌలు రైతులు తొలుత ఏఈవోలను కలిసి ఎవరి భూమిని కౌలుకు తీసుకున్నారో, సర్వే నంబర్, విస్తీర్ణం వివరాలు సమర్పించాలి. ఆ వివరాలను ఏఈవోలు ఆన్ లైన్ ప్రొక్యూర్‌మెంట్ మేనేజ్ మెంట్ సిస్టంలో నమోదు చేస్తారు. దీంతో కౌలు రైతు సైతం తాను పండించిన వడ్లను అమ్ముకునే చాన్స్ ఉంటుంది. తద్వారా కౌలు రైతుల వివరాలు కూడా నమోదు కానున్నాయి
సన్నాలకు డిమాండ్ ఉండడంతో..
కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులకు తమ అకౌంట్లలో డబ్బులు జమ కావడం ఆలస్యం కావడం, తరుగు పేరిట 40 కిలోల బస్తాపై 2, 3 కిలోలు తీస్తుండడం, తేమ పేరిట కొర్రీలు పెడుతుండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునేందుకే మొగ్గుచూపుతున్నారు. సన్నాలకు డిమాండ్ ఉండడంతో మిల్లర్లు, వ్యాపారులు రూ.2300 వరకు చెల్లిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఈ ధర రాకపోవడంతో సన్నాలు పండించిన రైతులంతా వ్యాపారులకే అమ్మేస్తున్నారు.
జిల్లాలవారీగా కొనుగోలు కేంద్రాలు ఇలా..
కరీంనగర్ జిల్లాలో 341 సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఇందులో ఇప్పటిదాకా 250 సెంటర్లు ఓపెన్ చేశారు. మానకొండూరు, కేశవపట్నం, తిమ్మాపూర్ లో ఇప్పటికే కొనుగోళ్లు ఊపందుకున్నాయి. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 313 సెంటర్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 250, ఐకేపీ ఆధ్వర్యంలో 63 ప్రారంభమయ్యాయి. ఈ జిల్లాలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే పెద్దపల్లి జిల్లాలో చాలా చోట్ల వరి కోతలు ప్రారంభం కాలేదు.
జగిత్యాల జిల్లాలో మొత్తం 418 సెంటర్లు ఓపెన్ చేయాలని టార్గెట్ పెట్టుకోగా పీఏసీఎస్, ఐకేపీ అధ్వర్యం లో 410 సెంటర్లు ఓపెన్ చేశారు. గత యాసంగిలో 4.21 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా.. ఈ సారి 5. 65 లక్షల టన్నులు సేకరించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో 259 కొనుగోలు సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించగా.. ఇప్పటివరకు 250 సెంటర్లు ఓపెన్ అయ్యాయి. రెండు రోజుల్లో మిగతా 9 సెంటర్లు ప్రారంభించనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. యాసంగి సీజన్ లో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.