- పార్లమెంట్ ఎన్నికల ముందు హస్తంలో జోష్
- ఒక్కో పోస్ట్‌ను కోల్పోతూ ఢీలా పడుతున్న బీఆర్ఎస్
నిజామాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంటుంది. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతో దూకుడుగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ లీడర్ల చేతుల్లో ఉన్న పలు కీలక పదవులను తన ఖాతాలోకి వేసుకుంటోంది. రైతులు, ప్రజలతో దగ్గరి సంబంధాలు ఉండే పలు కీలక పోస్టులు కాంగ్రెస్ లిస్ట్‌లో చేరడంతో ఆ పార్టీలో జోష్ పెరిగింది. అసెంబ్లీ ఎలక్షన్లో మిశ్రమ ఫలితాలు వచ్చినా, పార్లమెంట్ఎన్నికల నాటికి మరింత ఓటు బ్యాంక్‌ను తనవైపు తిప్పుకొని ఎంపీ బరిలో సత్తా చాటాలని భావిస్తోంది.
మున్సిపాలిటీల్లో పాగా..
జిల్లాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపాలిటీలున్నాయి. వీటిలో బోధన్, ఆర్మూర్ లలో కాంగ్రెస్ పాగా వేసింది. నిజామాబాద్ మేయర్ దండు నీతూకిరణ్ సైతం బీఆర్ఎస్తో అంటిముట్టనట్లు ఉంటున్నారు. ఐదు రోజుల కింద ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను నిరసిస్తూ పార్టీ శ్రేణులు నిరసన చేయగా, ఆమె స్థానికంగా ఉండి కూడా అటెండ్ కాలేదు. కాంగ్రెస్ లీడర్లతో టచ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఇక బీఆర్ఎస్నుంచి బయటకు వచ్చిన బోధన్ చైర్పర్సన్ తూము పద్మ సహా ఆమెకు మద్దతుగా ఉన్న మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు పూర్తి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని26 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ కండువా ధరించి చైర్‌పర్సన్‌గా లావణ్యను గెలిపించారు. ఆర్మూర్‌లో కాంగ్రెస్ ఉనికే లేకుండా చేసిన బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. జడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్ ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే ఈ నేతలకు ప్రజలతో దగ్గరి సంబంధాలుంటాయి. పార్టీ విస్తరణకు ఇది ఉపయోగపడుతోంది.
మార్క్‌ఫెడ్ నుంచి డీసీసీబీ దాకా..
జిల్లాకు చెందిన స్టేట్ మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి 20 రోజుల కింద కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు డీసీసీబీ కూడా హస్తగతమైంది. ఈ రెండు పదవులకు వ్యవసాయం, రైతాంగంతో సంబంధం ఉంటుంది. జిల్లాలో 8 లక్షల ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ఉండగా, 3.5 లక్షల మంది రైతులున్నారు. కీలకమైన మార్క్‌ఫెడ్, డీసీసీబీ చైర్మన్ పదవులు కాంగ్రెస్ వైపు రావడంతో రైతులు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. వీటికి తోడుగా గడిచిన నెల రోజుల్లో దాదాపు 20 సింగిల్ విండోల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది.
జోష్ పెంచిన స్టేట్పదవులు
అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బోధన్, రూరల్ సెగ్మెంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలువగా అర్బన్, ఆర్మూర్‌లో బీజేపీ, బాల్కొండలో బీఆర్ఎస్విజయం సాధించాయి. పార్లమెంట్ ఎలక్షన్నాటికి పరిస్థితిని తమకు పూర్తి అనుకూలంగా మార్చుకోవాలనే కాంగ్రెస్ముఖ్య లీడర్లు భావిస్తున్నారు. తాజాగా మైనార్టీ నేత తాహెర్, మాజీ ఎమ్యెల్యే ఈరవత్రి అనిల్, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్రెడ్డిలకు ముఖ్యమైన నామినేటెడ్ పోస్టులు దక్కాయి. దీంతో క్యాడర్‌కు నాయకత్వ సమస్య తీరి ఉత్సాహంగా పనిచేస్తున్నారు.