
- పార్టీ వ్యూహాలు, విధానాలపై చర్చ
న్యూఢిల్లీ, వెలుగు: గుజరాత్‌లోని అహ్మదాబాద్లో ఏప్రిల్ 8, 9న జరగనున్న ఏఐసీసీ కీలక సమావేశాల కోసం ఏర్పాటు చేసిన డ్రాఫ్టింగ్ కమిటీ తొలి భేటీ శుక్రవారం జరిగింది. న్యూఢిల్లీ అక్బర్ రోడ్ లోని పాత ఏఐసీసీ హెడ్డాఫీసులో జరిగిన ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, విధానాలు, రాజకీయ నిర్ణయాలు రూపొందించడంలో పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. కాగా.. ఏప్రిల్ 8న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కానుంది.
తర్వాత 9న ఏఐసీసీ ప్రతినిధుల సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు గత ఏడాది డిసెంబరులో కర్నాటకలోని బెళగావిలో నిర్వహించిన ‘నవ సత్యాగ్రహం’ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఉంటాయని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ సమావేశాల్లో పార్టీ రాజకీయ మేనిఫెస్టో, సంస్థాగత మార్పులు, రాబోయే ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను డ్రాఫ్టింగ్ కమిటీలో చర్చిస్తున్నారు. కాగా... 15 మంది సభ్యులతో కూడిన డ్రాఫ్టింగ్ కమిటీని ఈ నెల 24న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు.