కాంగ్రెస్ లీడర్ల..హామీల వరద

  • కాంగ్రెస్ లీడర్ల..హామీల వరద
  • ఇప్పటికే రైతు, యూత్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు 
  • ముప్పైకి పైగా హామీలు ఇచ్చిన పార్టీ పెద్దలు 
  • మళ్లీ మేనిఫెస్టో కమిటీ భేటీలు
  • హామీలు ఇస్తూనే.. చర్చలేంటంటున్న నేతలు
  • కమిటీలో మాట్లాడే అంశాలు బయటికి చెప్పొద్దంటూ ఆదేశాలు
  • చిన్న క్లూ ఇచ్చినా.. నేతలకు వార్నింగ్​లు.. క్లాసులు!

హైదరాబాద్, వెలుగు:  కాంగ్రెస్ హామీల ప్రకటన వరంగల్ రైతు డిక్లరేషన్​తో మొదలైంది. నిరుడు మే 6న వరంగల్ వేదికగా రాహుల్​తో భారీ సభ నిర్వహించి రైతు డిక్లరేషన్ ప్రకటించింది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, పెట్టుబడి సాయం కింద రూ.15 వేలు, ఉపాధి హామీ కింద నమోదు చేసుకున్న కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం, పంటలకు గిట్టుబాటు ధరలు, చెరకు ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్, పంటల బీమా, పసుపు బోర్డు ఏర్పాటు, ధరణి పోర్టల్ రద్దు సహా రైతులకు సంబంధించి చాలా హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నీ అమలు చేసి తీరుతామని ప్రకటించింది. మేనిఫెస్టోలోనూ ఈ హామీలు చేర్చుతామని సభా వేదికగా స్పష్టం చేసింది.

యూత్​కూ ఆల్రెడీ వరాలు

ఈ ఏడాది మే8న ప్రియాంక గాంధీ హాజరైన యువ సంఘర్షణ సభలో భాగంగా కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. అమరుల కుటుంబాలకు రూ.25 వేల పింఛన్, ఉద్యమకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, గల్ఫ్ దేశాల్లో మెరుగైన ఉపాధి కల్పన, కొత్తగా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు, నాలుగు ట్రిపుల్ ఐటీలు అని హామీలు ఇచ్చింది. గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం, పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం స్పెషల్ యూనివర్సిటీ, 18 ఏండ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ తదితర హామీలు ప్రకటించింది. జులై 2న ఖమ్మంలో పొంగులేటి చేరిక సభలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్లను రూ.4 వేలు చేస్తామని రాహుల్ ప్రకటించారు. దానికి సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న మంచిర్యాలలో, పోయిన నెల 26న చేవెళ్లలో నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీల కోసం 12 హామీలు ప్రక టించింది. రిజర్వేషన్ల పెంపు, అభయహస్తం, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, విద్యాజ్యోతి స్కీమ్​, గురుకులాల వంటి హామీలు ఇచ్చింది. మహిళా, బీసీ, మైనారిటీ డిక్లరేషన్లపై కసరత్తు చేస్తున్నది. 

నేతలకు వార్నింగ్​లు!

మేనిఫెస్టో కమిటీలో చర్చించిన అంశాలు బయటికి చెప్పొద్దంటూ నేతలకు పార్టీ పెద్దలు వార్నిగ్​లు ఇస్తున్నారు. మేనిఫెస్టోలో ఏం పెడ్తున్నారు.. డిక్లరేషన్లు మేనిఫెస్టోలో ఉంటాయా.. ఐదు గ్యారెంటీ స్కీమ్​లు ఏంటన్న వాటిపై నేతలను అడుగుతున్నా వారి నుంచి నో కామెంట్ అన్న సమాధానమే వస్తున్నది. మేనిఫెస్టోను అధికారికంగా ప్రకటించే దాకా నేతలు ఎవరూ దానిపై మాట్లాడొద్దని హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. క్యాజువల్​గా మాట్లాడినా.. ఎందుకు మాట్లాడారంటూ నేతలకు పిలిచి మరీ వార్నింగ్​లు ఇస్తున్నారట. కొందరు నేతలకు క్లాసులు కూడా పీకారట. మేనిఫెస్టో విషయంలో మీడియాకు దూరంగా ఉండాలన్న ఆదేశాలు 
అందాయన్న టాక్ వినిపిస్తున్నది.

ALSO READ: విష జ్వరాలతో ఆదిలాబాద్ విలవిల ..రోగులతో కిటకిటలాడుతున్న దవాఖానాలు​

ఇవి మేనిఫెస్టోలో ఉండవా..?

ఇప్పటికే ముప్పైకి పైగా హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ మేనిఫెస్టో కమిటీ పేరిట హంగామా ఎందుకు చేస్తున్నదన్న చర్చ జరుగుతున్నది. వీటన్నింటినీ మేనిఫెస్టోలో పెడితే.. మళ్లీ వీటిపై చర్చ ఎందుకున్న వాదనా వినిపిస్తున్నది. మేనిఫెస్టోలో పెట్టాల్సిన హామీలన్నీ ఇప్పటికే రెడీ అయ్యాయన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది. కర్నాటక ఎన్నికల మేనిఫెస్టోలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కనుగోలు.. తెలంగాణ కోసం ఇప్పటికే మేనిఫెస్టోలో పెట్టాల్సిన హామీలు సిద్ధం చేసి పెట్టారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించడంతో పాటు కర్నాటక తరహాలో మహిళలకు నెలకు రూ.2000 ఇచ్చేలా స్కీమ్​ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ కల్పించే యోచనలోనూ కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం.

పెద్ద లీడర్లు సభ పెట్టినప్పుడల్లా ఒక డిక్లరేషన్.. అవకాశం వచ్చినప్పుడల్లా ఒక హామీ.. ఇలా ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరిట ముప్పైకిపైగా హామీలు ప్రకటించింది. రూ.500కే సిలిండర్, పింఛన్ల పెంపు, రుణమాఫీ, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షలు (అభయహస్తం).. అంటూ హామీలు ఇచ్చేసింది. వాటితో పాటు బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ పేరిట మరిన్ని స్కీమ్స్ రూపొందిస్తున్నది. అవి త్వరలో ప్రకటించే చాన్స్ ఉంది. హామీలు ముందే ప్రకటిస్తూ.. మళ్లీ మేనిఫెస్టో కమిటీ అంటూ హామీలపై కొత్తగా కసరత్తు మొదలు పెట్టడం ఏంటని పార్టీలోని పలువురు నేతలు చర్చించుకుం టున్నారు. అయితే, అన్నీ బయటికి చెప్తూనే మేనిఫెస్టో కమిటీలో చర్చించే ఏ అంశమూ బయటకు వెళ్లొద్దంటూ కండీషన్లు పెడ్తున్నారని నేతలు వాపోతున్నారు.