- డీసీఓకు నోటీస్అందజేసిన 11 మంది సొసైటీ డైరెక్టర్లు
- చైర్మన్ రేసులో తుళ్లూరి బ్రహ్మయ్య, యలగొండస్వామి?
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) పై కాంగ్రెస్ పార్టీ కన్నేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జరిగిన పరిణామాల్లో డీసీసీబీ పీఠాన్ని దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న కూరాకుల నాగభూషణం వి.వెంకటాయపాలెం సొసైటీ చైర్మన్. సొసైటీ చైర్మన్‌గా ఉన్న ఆయనపై అవిశ్వాసానికి 11 మంది నోటీస్ఇచ్చారు.
ఇక్కడ మొత్తం 13 మందికి గాను 11 మంది అవిశ్వాసం నోటీసులపై సంతకాలు చేసి, జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్(డీసీవో)కు నోటీస్ అందజేయడంతో అవిశ్వాసం నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వారు నెగ్గితే నాగభూషణం డీసీసీబీ చైర్మన్ పదవి కూడా కోల్పోవలసి వస్తుంది. దీంతో ఆ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేలా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఇది ఉమ్మడి ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల అనుచరులు చైర్మన్ పీఠం కోసం పోటీ పడుతుండడంతో ఎవరికి చాన్స్ వస్తుందుదోననే ఆసక్తి నెలకొంది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు గడువు
2020 ఫిబ్రవరిలో ఖమ్మం డీసీసీబీ ఎన్నికలు జరిగాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ పాలకవర్గానికి గడువు ఉంది. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ గా ఉన్న కూరాకుల నాగభూషణం రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం పీఏసీఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సొసైటీలో నాగభూషణంతో కలిపి మొత్తం 13 మంది సభ్యులు ఉండగా, గతంలో అప్పటి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సపోర్టుతో సొసైటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆ తర్వాత డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. 13 మందికి గాను, 11 మంది నాగభూషణంకు వ్యతిరేకంగా అవిశ్వాసం నోటీస్ పై సంతకాలు చేశారు. గురువారం ఖమ్మం జిల్లా సహకారశాఖ అధికారి విజయనిర్మలను కలిసి నోటీస్‌ను అందజేశారు. వి.వెంకటాయపాలెం సొసైటీ చైర్మన్ గా నాగభూషణంను అవిశ్వాసం ద్వారా తప్పిస్తే డీసీసీబీ చైర్మన్ గా ఆయన అనర్హుడిగా మారే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ ఈ ఎత్తు వేసింది.
రేసులో మంత్రుల అనుచరులు..
కొత్త డీసీసీబీ చైర్మన్ రేసులో ఉన్న నాయకులు ఇప్పటికే తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఉన్న ప్రస్తుత డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు, ముదిగొండ పీఏసీఎస్ చైర్మన్ తుపాకుల యలగొండస్వామితో పాటు మరికొందరు రేసులో ఉన్నారు. మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ పరిధిలో 101 పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21, ములుగు జిల్లాలో రెండు, మహబూబాబాద్ జిల్లాలో రెండు పీఏసీఎస్‌లు ఉన్నాయి. పీఏసీఎస్ చైర్మన్లుగా ఉన్నవారే డీసీసీబీ డైరెక్టర్లుగా ఎన్నికవుతారు. అలా మొత్తం 21 మంది డీసీసీబీ డైరెక్టర్ల నుంచి డీసీసీబీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు.