- అలకేషన్‌కు సర్కారు ఓకే
- గిరిజన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు వినియోగం
- ఎన్నికలయ్యాక పెట్టే పూర్తిస్థాయి బడ్జెట్లో కేటాయింపులు
- పదేండ్లుగా ఐటీడీఏలకు పైసా ఇయ్యని గత బీఆర్ఎస్ సర్కారు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లకు మంచి రోజులుగా రానున్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో పదేండ్లుగా పైసా ఫండ్స్ లేకపోవడంతో ఐటీడీఏ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అయితే, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు వీటిపై దృష్టి సారించి.. నిధులు కేటాయించాలని నిర్ణయించింది. ఐటీడీఏల బాధ్యతలు చూస్తున్న ప్రాజెక్టు డైరెక్టర్ల(పీవో)కు ఒక్కొక్కరికి రూ.30 కోట్ల చొప్పున ఫండ్స్ ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఈ నిధులను పీవోలు తమ విచక్షణ అధికారం కింద ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో నిధుల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. అటవీ ప్రాంత గ్రామాల్లో వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి ఈ నిధులు ఉపయోగపడే అవకాశముంది. కొన్నేండ్లుగా సర్కారు నుంచి ఫండ్స్లేక జీసీసీ(గిరిజన సహకార మండలి) ద్వారా గిరిజన ఉత్పత్తులు కొనలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ సర్కారు ఐటీడీఏ పీవోలకు ఫండ్స్ కేటాయించడం మంచి పరిణామమని గిరిజన సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమస్యలు ఫుల్.. నిధులు నిల్
రాష్ర్టంలో నాలుగు ఐటీడీఏలు ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, ఉమ్మడి వరంగల్ లో ఏటూరు నాగారం, ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు, మహబూబ్ నగర్ జిల్లాలో మున్ననూరు ఐటీడీఏలను పదేండ్లుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ఒకప్పుడు ఐటీడీఏలకు ఐఏఎస్ లను పీవోలుగా నియమించి, జిల్లా కలెక్టరేట్లతో సమాంతరంగా పాలన నడిపేవారు. శాఖలవారీగా రివ్యూలు నిర్వహించి, ఫండ్స్ కేటాయించేవారు. కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఐటీడీఏలను గాలికి వదిలేశారు. ఫండ్స్ లేకపోవడంతో రివ్యూలు కూడా నిలిచిపోయాయి.
కనీసం జిల్లాలకు మంత్రులు వెళ్లినపుడు కూడా ఐటీడీఏలవైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ లోపడ్డాయి. పీవోలు ఏజెన్సీ ఏరియాల్లో పర్యటిస్తున్న టైంలో గిరిజనులు ఎన్నో సమస్యలను వారి దృష్టికి తెచ్చి పరిష్కరించాలని కోరుతున్నారు. రోడ్లు, బ్రిడ్జిలు, కల్వర్టులు, హాస్పిటళ్లు, స్కూళ్ల రిపేర్లు, తాగు నీరు, కరెంట్, ఇతరత్రా సమస్యలను దృష్టికి తెస్తున్నారు. ఈ పనులకు ప్రపోజల్స్ పంపి, ఫండ్స్ రిలీజ్ అయ్యి పరిష్కరించాలంటే ఏండ్లకు ఏండ్లు పడుతోంది. దీంతో పీవోలకు ఫండ్స్ కేటాయిస్తే సమస్యలను వెనువెంటనే పరిష్కరించవచ్చని సర్కారు భావిస్తోంది.
భద్రాచలం మీటింగులో డిప్యూటీ సీఎం దృష్టికి..
భద్రాచలం ఐటీడీఏ ఆఫీసులో గత ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా గత పదేండ్లలో ఐటీడీఏలకు పైసా ఫండ్స్ రాలేదని ఆఫీసర్లు మంత్రుల దృష్టికి తెచ్చారు. కనీసం మంత్రులు సైతం రివ్యూలు చేయలేదని వివరించారు. అధికారులతో పాటు గిరిజన సంఘాల ప్రతినిధులు సైతం తమ సమస్యల పరిష్కారానికి వెంటనే ఫండ్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు ఇచ్చారు.
దీంతో నిధుల కోసం ప్రపోజల్స్ పంపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడి పీవోను ఆదేశించారు. ఆ శాఖ ఉన్నతాధికారులతోనూ చర్చించిన అనంతరం ప్రతి పీవోకు ఏటా బడ్జెట్లో రూ.30 కోట్ల చొప్పున కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల తర్వాత పెట్టబోయే పూర్తిస్థాయి బడ్జెట్లో కేటాయింపులు చేయనున్నారు.