కాంగ్రెస్​కి ఈ ఏడాది కలిసొచ్చింది!

నాయకుడు లేకుండా విక్టరీ సాధించడం చాలా కష్టమనుకుంటారు. కాంగ్రెస్​ మాత్రం ఫుల్​ టైమ్​ ప్రెసిడెంట్​ లేకుండానే మహారాష్ట్రలో, జార్ఖండ్​లో పవర్​ పార్టనర్​గా నిలబడింది. ప్రాంతీయ పార్టీల జమానాలో పెద్దన్న పాత్ర పోషిస్తోంది. చావు దెబ్బలతో చతికిలపడిపోయిందనుకున్న కాంగ్రెస్​ పార్టీకి గడచిన ఏడాదిన్నర నుంచి మంచి ఫలితాలే వస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అసమ్మతి రాగం అందుకోవడం, ప్రతిపక్షంలో ఉండగా ఐకమత్యం చాటుకోవడం కాంగ్రెస్​ నేతలకు బాగా తెలుసు. అందుకే అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లో మళ్లీ పుంజుకోగలుగుతుందని చెబుతున్నారు ఎనలిస్టులు. నిజానికి, కాంగ్రెస్​ని నడిపించడానికి ఇప్పుడు పూర్తిస్థాయి చైర్​పర్సన్​ లేరు. సోనియా గాంధీ ఇంటీరమ్​ ప్రెసిడెంట్​గా ఉన్నారు.

ఈ ఏడాది మే నెలలో లోక్​సభ పలితాలు రాగానే రాహుల్​ గాంధీ ఏఐసీసీ కుర్చీ దిగిపోయారు. చాలా రాష్ట్రాల పీసీసీ ప్రెసిడెంట్లు సహా కాంగ్రెస్​లోని సీనియర్​ నాయకులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. 77 రోజులపాటు కాంగ్రెస్​ పార్టీలో హైడ్రామా నడిచిన తర్వాత సీడబ్ల్యూసీ ఆయన తల్లి సోనియా గాంధీని ఇంటీరిమ్​ ప్రెసిడెంట్​గా నామినేట్​ చేసింది. కాంగ్రెస్​ పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రెసిడెంట్​ని ప్లీనరీలోనే ఎన్నుకోవాలి. అప్పటివరకు ఆమె పదవిలో కొనసాగుతారు.

సోనియా గాంధీకి ఈ బాధ్యతలు మోయడం కొత్త కాదు. 1998లో కలకత్తా ప్లీనరీలో ఏఐసీసీ చైర్​పర్సన్​గా నియామకం జరిగాక, 2017 వరకు పార్టీ బరువు భుజానకెత్తుకున్నారు. నాన్​–బీజేపీ పార్టీలతో ఏర్పడిన యునైటెడ్​ ప్రోగ్రెసివ్​ అలయెన్స్​ (యూపీఏ)కి చైర్​పర్సన్​గా పనిచేస్తున్నారు. ఆమె నేతృత్వంలోనే 2004, 2009ల్లో రెండుసార్లు మన్మోహన్​ సింగ్​ ప్రధానిగా యూపీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. దాదాపు 20 ఏళ్లపాటు  ఇన్ని బాధ్యతలు మోసిన తర్వాత తన కొడుకు రాహుల్​ గాంధీకి ఏఐసీసీ చైర్​ అప్పగించారు. 2017 చివరలో గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ రిలీజ్​ అయ్యాక, రాహుల్​ పట్టాభిషేకం ప్రకటించారు. హిమాచల్​లో అధికారం కోల్పోగా, గుజరాత్​లో మాత్రం బలం పెంచుకుంది. 2012లో 61 సీట్లు గెలవగా, 2017లో 81 సీట్లు సాధించింది. కాంగ్రెస్​ వర్గాల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది.

రీజనల్​ పార్టీలతో దోస్తానా

లోక్​సభ ఎన్నికల్ని యూపీఏ బ్యానర్​పై ఎదుర్కొనగా, మిగతా అసెంబ్లీ ఎన్నికల్లో ఏదోక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కాంగ్రెస్​ చాకచక్యం. ప్రస్తుతం దేశమంతా రీజనల్​ పార్టీలదే హవా. వాటిని కాదని సొంతంగా ఢీకొట్టడానికి జాతీయ పార్టీలకు ఛాన్స్​ లేదు. టీఆర్​ఎస్​, టీడీపీ, వైఎస్సార్​ సీపీలే ఇందుకు పెద్ద ఉదాహరణ. నేషనల్​ పార్టీ హోదాలున్న తృణమూల్​ కాంగ్రెస్​, బహుజన్​ సమాజ్ పార్టీ, నేషనలిస్టు కాంగ్రెస్​ పార్టీ (ఎన్సీపీ), నేషనల్​ పీపుల్స్​ పార్టీ (ఎన్పీపీ)లు సైతం తమ తమ రాష్ట్రంలో అధికారంకోసమే పనిచేస్తున్నాయి. ఇక, కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు పార్టీలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ నామమాత్రంగా మిగిలాయి.  ఈ పరిస్థితుల్ని, ఓటర్లను ఇన్​ఫ్ల్యూయెన్స్​ చేస్తున్న అంశాల్ని కాంగ్రెస్​ పట్టించుకుంటోంది. దానికనుగుణంగానే అసెంబ్లీ ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలోనూ ఏమాత్రం వీలున్నా బలమైన రీజనల్​ పార్టీతో దోస్తీకి రెడీ అవుతోంది.  దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ల్లో మాత్రమే కాంగ్రెస్​తో కలవడానికి పెద్ద రీజనల్​ పార్టీలు ఇష్టంగా లేవు. మిగతా తమిళనాడు, కర్ణాటక, కేరళలో అక్కడి పార్టీలు ఆసక్తిగా ఉన్నాయి.

సీట్లకోసం పట్టుదలకు పోదు

ఎలాంటి పట్టుదలకు, బెట్టు భేషజాలకు పోకుండా సీట్ల సర్గుబాటు చేసేసుకోవడంకూడా కాంగ్రెస్​ని గట్టెక్కిస్తోంది. జార్ఖండ్​ ఎన్నికలనే గనుక తీసుకుంటే… లోకల్​గా బలంగా ఉన్న జార్ఖండ్​ ముక్తి మోర్చా (జేఎంఎం), రాష్ట్రీయ జనతా దళ్​ (ఆర్జేడీ)తో పొత్తు కలిసింది. 81 సీట్ల జార్ఖండ్​ అసెంబ్లీలో జేఎంఎంకి 43 సీట్లు వదిలేసి, కాంగ్రెస్​ 31 సీట్లు, ఆర్జేడీ ఏడు సీట్లు పంచుకున్నాయి.  జార్ఖండ్​ అసెంబ్లీకి వచ్చేసరికి సీట్ల దగ్గర పేచీ వచ్చింది. ఏజేఎస్​యూ 19 సీట్లు, ఎల్జేపీ ఆరు సీట్లు అడిగితే బీజేపీ కుదరదని తేల్చేసింది. ఎన్డీయే భాగస్వాములు విడివిడిగా పోటీకి దిగడంతో కాంగ్రెస్​ కూటమికి కలిసొచ్చింది.

అమ్మ మాటే నెగ్గుతోంది

రాహుల్​ గాంధీ న్యూఢిల్లీలో జరిగిన ఏఐసీసీ 84వ ప్లీనరీలో బాధ్యతలు తీసుకున్నాక… మొదటి ప్రసంగం చాలా ఉద్రేకంగా సాగింది. పార్టీలో పాతుకుపోయిన పడకకుర్చీ లీడర్ల ప్లేస్​ని యువ నాయకులతో నింపాలని, పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలని రివల్యూషనరీ స్టేట్​మెంట్లు ఇచ్చారు. అయితే, తల్లి సోనియా అడ్డుపడడంతో కర్ణాటక, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ల మాట వినాల్సి వచ్చింది. అమ్మ మాట విన్నందువల్ల మంచి ఫలితాలే వచ్చాయి. ఆ నాలుగు రాష్ట్రాల్లోనూ తిరుగులేదనుకున్న బీజేపీకి ఓటమి తప్పలేదు.  2018 మే నెలలో జరిగిన కర్ణాటక ఎలక్షన్స్​లో అధికారం దక్కించుకోలేకపోయినా, బీజేపీ పవర్​లోకి రాకుండా అడ్డుకోగలిగింది కాంగ్రెస్​. మాజీ ప్రధాని దేవెగౌడ నాయకత్వంలోని జనతా దళ్​ (ఎస్​)కి సపోర్ట్​ ఇచ్చింది. దాంతో 37 సీట్లు గెలుచుకున్న జేడీఎస్​, 80 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్​ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదే ఏడాది చివరలో కాంగ్రెస్​ సీనియర్లు అశోక్​ గెహ్లాట్​ (రాజస్థాన్​),  కమలనాథ్ (మధ్యప్రదేశ్​)​,  భూపేంద్ర బఘేల్ (ఛత్తీస్​గఢ్​)​ సీఎంలయ్యారు. రాహుల్​ తనకు నమ్మిన బంట్లయిన సచిన్​ పైలట్​, జ్యోతిరాదిత్య సింధియాలను ముఖ్యమంత్రులుగా చూడాలనుకున్నా సోనియా పడనివ్వలేదని ఏఐసీసీ వర్గాలు బహిరంగంగానే చెప్పుకున్నాయి.

ప్లీనరీలోనే ప్రెసిడెంట్ఎన్నిక

కాంగ్రెస్​ పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్​–28 ప్రకారం… ఎన్నుకున్న ప్రెసిడెంట్​ దిగిపోయినా, చనిపోయినా సీనియర్​ జనరల్​ సెక్రటరీ తక్షణం ఆ బాధ్యతలు తీసుకుని రోజువారీ పనులు నిర్వహిస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశమై ప్రొవిజనల్​ లేదా ఇంటీరిమ్​ ప్రెసిడెంట్​ని నామినేట్​ చేస్తోంది. ప్లీనరీ నిర్వహించి రెగ్యులర్​ ప్రెసిడెంట్​ని ఎన్నుకునే వరకు ఇంటీరిమ్​ ప్రెసిడెంట్​ కంటిన్యూ అవుతారు. కాంగ్రెస్​ గతంలో ప్రతి ఏడాది సెషన్​ నిర్వహించి ప్రెసిడెంట్​ని ఎన్నుకునేది. 1967లో మొదటిసారి చీలిన తర్వాత ఇందిరా గాంధీ హయాం వచ్చాక ఆ పద్ధతి వదిలేశారు. ప్రతి మూడేళ్లకొకసారి ప్లీనరీ నిర్వహిస్తున్నారు. చివరిసారిగా 2018లో న్యూఢిల్లీలో 84వ ప్లీనరీ జరిపారు. వచ్చే ప్లీనరీ వరకు సోనియా గాంధీయే ఇంటీరిమ్​ ప్రెసిడెంట్​గా ఉంటారు.