పెద్దపల్లిలో గ్రాండ్ విక్టరీపై కాంగ్రెస్‌‌ కన్ను!

  • అసెంబ్లీ ఓట్ల ప్రకారం మిగిలిన పార్టీలకు అందనంత దూరంలో హస్తం
  • 7 సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలే ఉండడంతో భారీ మెజార్టీపై గురి​
  • వంశీ గెలుపును చాలెంజ్‌‌గా తీసుకున్న మంత్రి శ్రీధర్​ బాబు
  • ఎంపీ ఎన్నికలు బీఆర్ఎస్​, బీజేపీకి సవాలే! 

మంచిర్యాల, వెలుగు:  పెద్దపల్లి పార్లమెంట్​ నియోజకవర్గంలో భారీ విజయంపై కాంగ్రెస్​ కన్నేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే బీఆర్ఎస్​, బీజేపీలు కాంగ్రెస్​ దరిదాపుల్లో కూడా లేవు. దీనికితోడు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పొలిటికల్​ సీన్​ మారడంతో బీఆర్ఎస్​ బేజారవుతోంది. కాళేశ్వరం, లిక్కర్​ స్కామ్​, ఫోన్​ ట్యాపింగ్​ తదితర వ్యవహారాలతో గులాబీ పార్టీ గ్రాఫ్​ డౌన్ అయ్యింది. సిట్టింగ్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు కారు దిగుతుండడంతో ఆ పార్టీ లీడర్లకు టెన్షన్​ పట్టుకుంది. మరోవైపు పెద్దపల్లి సెగ్మెంట్‌‌లో చెప్పుకోదగ్గ లీడర్, క్యాడర్​లేని బీజేపీ.. కాంగ్రెస్ లీడర్‌‌‌‌ను చేర్చుకొని పోటీలో నిలిపింది.

 దీంతో ఆ పార్టీ ప్రభావం నామమాత్రంగా మారింది. ఇక  కాంగ్రెస్ హైకమాండ్​​వ్యూహం ప్రకారం కాకా ఫ్యామిలీ నుంచి  గడ్డం వంశీకృష్ణను బరిలో దింపడంతో ఇప్పటికే ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు.  మంత్రి శ్రీధర్​ బాబుతోపాటు ఆరుగురు ఎమ్మెల్యేలు వంశీ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ​తమదైన శైలిలో ముందుకుపోతున్నారు. ఈక్రమంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి మీటింగ్‌‌లకు  క్యాడర్​ నుంచి విశేష స్పందన వస్తోంది. మొత్తానికి పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ధీమాతో దూసుకెళ్తుండగా.. బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్​లకు ఈ ఎన్నికలు సవాల్‌‌గా మారాయని పరిశీలకులు పేర్కొంటున్నారు.   

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు 6.82 లక్షల ఓట్లు....  

పెద్దపల్లి లోక్‌‌సభ సెగ్మెంట్​ పరిధిలో పెద్దపల్లి, రామగుండం, మంథని, ధర్మపురి, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్​ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 15,92,996 ఓట్లు ఉండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు 6,82,033 ఓట్లు వచ్చాయి. బీఆర్‌‌‌‌ఎస్​, బీజేపీతో పాటు ఇతర పార్టీలు మిగతా ఓట్లను షేర్​ చేసుకున్నాయి. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీల అమలుతోపాటు తీసుకున్న నిర్ణయాలు హస్తం పార్టీ ఇమేజ్‌‌ను పెంచాయి. వివిధ పార్టీల నుంచి వలసలు కొనసాగుతుండడంతో కాంగ్రెస్​ మరింత బలపడుతోంది.

 గతంలో బీఆర్ఎస్​ ఖాతాలో ఉన్న మంచిర్యాల, నస్పూర్​, క్యాతన్​పల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీలను అధికార పార్టీ చేజిక్కించుకుని అర్బన్​ ఏరియాల్లో ఎదురులేని శక్తిగా ఆవిర్భవించింది. ఈక్రమంలో బీఆర్ఎస్​కు చెందిన పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ సర్పంచులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్​లో చేరడానికి సిద్ధమవుతున్నారు. దీంతో పార్లమెంట్‌‌ ఎన్నికల్లో పెద్దపల్లిలో కాంగ్రెస్‌‌ గెలుపు ఖాయమన్న ధీమా శ్రేణుల్లో కనిపిస్తోంది.   

బీఆర్ఎస్​కు 3.74 లక్షలే... 

పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్​ గత అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడింది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పెద్దపల్లి ఎంపీ పరిధిలోని ఏడు సీట్లలోనూ ఘోరంగా ఓడిపోయింది. పోలైన మొత్తం ఓట్లలో ఆ పార్టీకి 3,74,363 మాత్రమే వచ్చాయి.గతంలో టికెట్ల కోసం లీడర్లు పోటీపడగా.. ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థి దొరకని దుస్థితి ఎదురైంది. చివరకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌‌‌‌ను పార్టీ చీఫ్​ కేసీఆర్​ బరిలోకి దించారు. 

ఆయన కూడా అయిష్టంగానే పోటీలో నిలిచినట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. పెద్దపల్లి సిట్టింగ్​ ఎంపీ వెంకటేశ్​ సొంత గూటికి(కాంగ్రెస్‌‌) చేరి కేసీఆర్​కు షాక్​ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యకలాపాల్లో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వారు బీఆర్ఎస్‌‌ అభ్యర్థికి ఎంతవరకు సపోర్టు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితుల్లో పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో నెగ్గుకు రావడం కష్టమని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి.

బీజేపీకి డిపాజిట్లే దక్కలే...  

పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్​లో బీజేపీకి ఉన్న బలం, బలగం అంతంతమాత్రమే. ఆ పార్టీకి చెప్పుకోదగ్గ లీడర్​ గానీ, క్యాడర్​ గానీ లేకపోవడం పెద్దలోటుగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మంచిర్యాల మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. మంచిర్యాలలో వెరబెల్లి రఘునాథ్​రావు 39,829 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవగా, మిగిలిన వారికి 3వేల నుంచి 7వేల మధ్య పోలయ్యాయి.

 అసెంబ్లీ ఎన్నికల్లో 69,178 ఓట్లతో సరిపెట్టుకున్న బీజేపీ.. ఎంపీ ఎన్నికల్లో గెలవాలంటే అంతకు పదింతల ఓట్లు సాధించాలి. పీఎం నరేంద్రమోదీ చరిష్మాతో గట్టెక్కుతామని కమలనాథులు కలలుకంటున్నారు. హిందూత్వవాదులు, యువత ఓట్లు పువ్వుకే పడుతాయని భావిస్తున్నారు. కానీ ఆ సెంటిమెంట్​ ఎంతవరకు వర్కవుట్​​అవుతుందన్నది అనుమానమే.  ------