పుంజుకున్న కాంగ్రెస్..ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు, ఓట్లు పెరుగుదల

  • 2018లో  హస్తానికి కేవలం ఒకే స్థానం
  • 2023లో  నాలుగు చోట్ల గెలుపు

 కామారెడ్డి, వెలుగు :  గత ఎన్నికలతో పోలిస్తే ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో  కాంగ్రెస్​ పార్టీ పుంజుకుంది.    ఎమ్మెల్యేల సీట్ల సంఖ్య పెంచుకోవటంతో పాటు, ఓట్లు గణనీయంగా పెరిగాయి.  2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో  కాంగ్రెస్​ పార్టీ  కేవలం  ఒక స్థానం (ఎల్లారెడ్డి)తోనే సరిపెట్టుకుంది. బీఆర్ఎస్​ పార్టీ 8 చోట్ల గెలిచింది.  అయితే 2023లో మాత్రం  ఓటర్లు  విలక్షణ తీర్పు ఇచ్చారు.  ఒక పార్టీ వైపు కాకుండా  మూడు ప్రధాన పార్టీల వైపు మొగ్గు చూపారు.  

మొత్తం 9 స్థానాలకు గాను  కాంగ్రెస్​కు 4,  బీజేపీకి 3,  బీఆర్ఎస్​కు 2 చోట్ల పట్టం పట్టారు.  ఐదేండ్ల క్రితం కేవలం ఎల్లారెడ్డిలో మాత్రమే  కాంగ్రెస్​ పార్టీ  గెలుపొందితే, ఈసారి  మాత్రం ఎల్లారెడ్డి, జుక్కల్,  బోధన్,  నిజామాబాద్​ రూరల్ స్థానాల్ని  కాంగ్రెస్ కైవసం చేసుకుంది.  పలు నియోజకవర్గాల్లో గణనీయంగా ఓట్లు పెరిగినప్పటికీ అభ్యర్థులు స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. 

కాంగ్రెస్​ కు పెరిగిన ఓట్లు

గత ఎన్నికలతో పోలిస్తే 9 అసెంబ్లీ నియోజక వర్గాల్లో  కాంగ్రెస్ కు 71,076 ఓట్లు పెరిగాయి.  2018లో  మొత్తం  5,01,479 ఓట్లు వస్తే,  ఈ సారి 2023లో  మొత్తం  5,72,555 ఓట్లు వచ్చాయి.   కొన్ని నియోజకవర్గాల్లో  గతంలో కంటే ఈసారి ఓట్లు తగ్గగా, మరికొన్ని చోట్ల గణనీయంగా ఓట్ల సంఖ్య పెరిగింది.  బాల్కొండ నియోజకవర్గంలో  భారీగా ఓట్లు పెరిగాయి.  ఇక్కడ 2018లో 30,433 ఓట్లు వస్తే ఈసారి  65,884 ఓట్లు వచ్చాయి.  35,451 ఓట్లు పెరిగినప్పటికీ  కాంగ్రెస్​అభ్యర్థి  ముత్యాల సునీల్ ఓడిపోయారు.  నిజామాబాద్ రూరల్​లో  2018లో  58,330 ఓట్లు వస్తే, 2023లో 78,378 ఓట్లు వచ్చాయి.  

20,048 ఓట్లు పెరగగా ఇక్కడ బరిలో నిలిచిన  భూపతిరెడ్డి విజయం సాధించారు.  నిజామాబాద్ అర్బన్​లో 13,798 ఓట్ల పెరుగుదల ఉన్నప్పటికీ అభ్యర్థి షబ్బీర్​ అలీ ఓడిపోయారు.  2018లో 46,055 ఓట్లు వస్తే ఈసారి 59,853 ఓట్లు వచ్చాయి.   జుక్కల్​లో  22,530 ఓట్లు పెరిగాయి. అయినప్పటికీ బీఆర్ఎస్​ అభ్యర్థిపై  కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మీకాంతరావు స్వల్ప ఓట్లతో గెలిచారు. 2018లో 41,959 ఓట్లు వస్తే ఈ ఎన్నికల్లో   64,489 ఓట్లు పోలయ్యాయి.

  బోధన్​లో  స్వల్పంగా 169 ఓట్లు పెరిగాయి.  ఈ సారి 2023లో 66,963  ఓట్లు వస్తే 2018లో  66,794 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సుదర్శన్​రెడ్డి​ విజయం సాధించారు.  కామారెడ్డిలో 2018లో 63,610 ఓట్లు వస్తే,  ఈ సారి  54,196 ఓట్లు వచ్చాయి.  9,414  ఓట్లు తగ్గి పార్టీ అభ్యర్థి రేవంత్​రెడ్డి ఓడిపోయారు. ఎల్లారెడ్డిలో 4,521 ఓట్లు తగ్గుదల ఉంది. 2018లో  91,510 ఓట్లకు గాను ఈసారి  86,989 ఓట్లు వచ్చాయి.  అయినా కాంగ్రెస్​ అభ్యర్థి మదన్​మోహన్​రావు గెలిచారు.  

బాన్సువాడలో   2018లో  59,458 ఓట్లు వస్తే ఈసారి 52,814 ఓట్లు వచ్చాయి.  6,644 ఓట్లు తగ్గాయి.  కాంగ్రెస్​అభ్యర్థి  రవీందర్​రెడ్డి పరాజయం చెందారు. ఆర్మూర్​లో  341 ఓట్లు తగ్గాయి.  2018లో  ఇక్కడ  43,330 ఓట్లు వస్తే ఈసారి 42,989  ఓట్లు ఆ పార్టీకి పోలయ్యాయి.  అయినప్పటికీ  పార్టీ అభ్యర్థి ఓడిపోయారు.