- ఇదే కాంగ్రెస్ పార్టీ విధానం.. దానికి అధికారమిస్తే రాష్ట్రం పరిస్థితి ‘కైలాసమే’
- ఇంకా టికెట్లు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంది
- 15న బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అయితది
- హుస్నాబాద్ హైదరాబాద్ నుంచి ఈశాన్యంలో ఉంటది
- ఇక్కడ సభ మొదలు పెడితే బీఆర్ఎస్దే విజయం
హుస్నాబాద్, వెలుగు : కాంగ్రెస్‌వి మాటలు, మూటలు పంచుడు, ముఠాల తగాదాలు, మంటలు రేపే విధానాలు తప్ప ఆ పార్టీకి పరిపాలించే సామర్థ్యం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీ సోషల్‌మీడియాలో ఫేక్సర్వేలు పెడుతూ గోబెల్స్ ప్రచారం చేస్తోందన్నారు. అది ఎన్ని చేసినా తెలంగాణలో బీఆర్ఎస్హ్యాట్రిక్ విజయాన్ని సాధించడం ఖాయమన్నారు. ఈనెల15న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించబోయే బీఆర్ఎస్ఎన్నికల బహిరంగ సభ కోసం మంగళవారం మంత్రి ఎమ్మెల్యే సతీశ్‌కుమార్‌తో కలిసి స్థలాలను పరిశీలించారు.
తర్వాత కార్యకర్తలతో సమావేశమై సభ సక్సెస్ కోసం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌నుంచి హుస్నాబాద్ఈశాన్యంలో ఉంటుందని, ఇక్కడ సభ మొదలుపెడితే బీఆర్ఎస్విజయం సాధిస్తుందన్నారు. గత ఎన్నికల్లోనూ కేసీఆర్ ఇక్కడి నుంచే ప్రచారాన్ని ప్రారంభించారన్నారు. ఆ ఎన్నికలప్పుడు కూడా తమదే గెలుపు అని కాంగ్రెస్ ఇప్పటిలాగే ఎగిరిందని, మంత్రి పదవులను కూడా పంచేసుకున్నారన్నారు.
ఆ పార్టీ ఢిల్లీలో ఎక్కువ, గల్లీలో తక్కువని ఎద్దేవా చేశారు. ఢిల్లీ పర్మిషన్ లేనిదే ఇక్కడ ఏమీచేయని పార్టీతో ప్రజలకు ప్రయోజనమేమిటన్నారు. తమ పార్టీ యాభై రోజుల కిందనే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చిందని, కాంగ్రెస్ ఇంకా టికెట్లు ఇచ్చుకోలేని స్థితిలో ఉందన్నారు. ‘కర్నాటకలో సంపాదించిన అవినీతి సొమ్ము మూటలు తెచ్చి తెలంగాణలో పంచి గెలుస్తరట. చెన్నారెడ్డిని సీఎం కుర్చీ నుంచి దించేందుకు మతకలహాలు పెట్టారు. హైదరాబాద్‌లో కర్ఫ్యూ పెట్టి ప్రజల ప్రాణాలను తీశారు. మతం మంటలు, గ్రూపుల సంస్కృతి ఆ పార్టీలో ఉన్నది. అది ఎండ్రికాయపార్టీ' అని అన్నారు. కేసీఆర్ హయాంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదన్నారు.
కాంగ్రెస్‌తో ఆ రెండూ వస్తాయన్నారు. ఆ పార్టీ అంటేనే నయవంచన, నాటకమన్నారు. 2004లో తమ పార్టీతో పొత్తు పెట్టుకొని పొట్టన పెట్టుకున్నదన్నారు. కామన్ మినిమం ప్రోగ్రాంను అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలోళ్లు కాళ్లల్ల కట్టె వెట్టినా తాము గౌరవెల్లి ప్రాజెక్టును కట్టామన్నారు. ప్రాజెక్టు పూర్తయితే బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇక్కడి ఎమ్మెల్యేకు నీళ్లుదెచ్చిన పేరొస్తుందనే కుట్రతో ఎన్నో అడ్డుపుల్లలు పెట్టారన్నారు. ఈ నెల 15న తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుందని, దానిని చూస్తే ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అవుతుందన్నారు. కైలాసం ఆటలో కష్టపడి నిచ్చెనలు ఎక్కి వస్తే, చివరన పాము నోట్లో పడితే మళ్లీ మొదటికి ఎలా పోతారో, కాంగ్రెస్కు అధికారాన్ని ఇస్తే రాష్ట్ర పరిస్థితి అట్లనే అవుతుందన్నారు.
తెలంగాణ సంస్కృతి కనిపించాలె
ఈనెల 15న కేసీఆర్ నిర్వహించే బహిరంగ సభ తెలంగాణ సంస్కృతులతో అలరించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. డప్పు చప్పళ్లు, బతుకమ్మలు, బోనాలు, కోలాటాలు, పోతరాజుల విన్యాసాలతో కదిలిరావాలన్నారు. తెలంగాణ సంస్కృతి మొత్తం హుస్నాబాద్‌లో కనిపించాలన్నారు. నియోజక వర్గంలోని ప్రతి ఊరు నుంచి ప్రజలను తరలించాలని సూచించారు. ప్లానింగ్‌కమిషన్ వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్‌రావు, సిద్దిపేట జడ్పీ వైస్ చైర్మన్రాయిరెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు.