భవిష్యత్తు కాంగ్రెస్​వైపే కనిపిస్తోంది.. బీజేపీకి రుచించని అంశం ఏంటంటే..

భవిష్యత్తు కాంగ్రెస్​వైపే కనిపిస్తోంది.. బీజేపీకి రుచించని అంశం ఏంటంటే..

ఇటీవల తాజా ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో రాబోయే మార్పును సూచిస్తున్నాయి. ప్రాంతీయతల పేరుతో ఎదిగిన రాజకీయ ప్రభావాలు,  క్రమక్రమంగా ఆయా ప్రాంతీయ పార్టీలను, నాయకత్వాలు తమ సొంత ఆస్తులుగా మారుస్తుంటే.. వాటిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. దానికి స్పష్టమైన సంకేతంగా మన రాష్ట్రం తెలంగాణని తీసుకుంటే ఒక కుటుంబమే పెత్తనం చెలాయిస్తోందని, అహంకారం పెరిగిపోయిందని ప్రజలు వారిని దూరం పెట్టారు.  

మరోవైపు మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లో సైతం ఒక్కడి ఎజెండాగా నడుస్తున్న పార్టీ వైసీపీ సైతం అక్కడ ఓటమిపాలైంది. ఒడిశాలో దశాబ్దాలు అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ పార్టీ కుప్పకూలిపోయింది. ఇక మహారాష్ట్రలో పోటీ రెండు జాతీయ పార్టీల  మధ్యే ఉంది. శివసేన (యూబీటీ), ఎన్సీపీ(ఎస్​సీపీ)లు తమ మనుగడను కోల్పోయాయి. ఇక కర్నాటకలో వెలుగు వెలిగిన దేవెగౌడ, కుమారస్వామిల  జేడీఎస్  ఇప్పుడు మరో జాతీయ పార్టీకి తోకపార్టీగా మిగిలిపోయింది. 

ఇక నిన్నటి ఎన్నికల్లో ఆప్ ఢిల్లీని ఊడ్చేస్తుందనుకుంటే ఎన్నికలకు ముందే అవినీతితో చతికిలపడింది, ఈ పరంపరలో భవిష్యత్తులో పశ్చిమబెంగాల్లో మమత సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్, బిహార్​లో నితీష్ సారథ్యంలోని జేడీయూ పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి, దీనికి అనేక కారణాలున్నాయి.

కామన్ పాయింట్ ఏంటంటే 2014కు ముందు దేశంలో అధికారంలో ఉన్న  కాంగ్రెస్ స్థానాన్నే ఒక దశాబ్దం నుంచి ఆయా ప్రాంతీయ పార్టీలు ఆక్రమించుకున్నవి.  నాడు కూటమిలోని పార్టీల అవినీతిని భూతద్దంలో చూపెట్టి  గోబెల్స్ ప్రచారం చేసిన అర్వింద్​  కేజ్రీవాల్ సైతం నేడు అదే అవినీతి కేసులతో అడుగంటిపోయాడు.  పదేళ్ల పాటు అధికారంలో ఉండడంతో  యాంటీ ఇన్​కంబెన్సీ  పెరిగింది. 

అనేక కారణాల వల్ల అధికారానికి కాంగ్రెస్ దూరమైనా.. ప్రజలకు దూరం కాలేదనేది.. వరుసగా 2014, 2019, 2024లో కాంగ్రెస్​కు వచ్చిన 19.3%, 19.5%, 21.19 ఓట్ల శాతమే చెపుతున్నది. ఇదే క్రమంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రాంతీయ పక్షాల ఓట్ల శాతంలో గణనీయమైన క్షీణత కన్పిస్తున్నది. 2009 నుంచి 14కు 3.51%. ఆ తర్వాత 5.24% ఇక మొన్నటి ఫలితాల్లో దాదాపుగా ఇదే స్థాయిలో వారు తమ ఓట్లను కోల్పోతూ వస్తున్నారు. 

కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే తమ నినాదాన్ని నిజం చేయాలనే కలలు ఏమాత్రం నెరవేరడం లేదనేది పైన గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఉత్తరాది  హిందీ రాష్ట్రాల్లో బీజేపీకి కొంత అనుకూలించి అధికారంలోకి రాగలిగినప్పటికీ వారిలో భయాందోళనలను కలిగిస్తోంది. ఎందుకంటే  దాదాపు  పదేళ్ల  తర్వాత పార్లమెంట్లో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఈ పరిణామాలు  రాబోయే రోజుల్లో కాంగ్రెస్​ను​ అత్యంత బలీయ శక్తిగా నిలిపి జాతీయ రాజకీయాల్లో తన పూర్వవైభవానికి తీసుకొస్తాయనేది ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాయి. 

కాలం కలిసొస్తుంది

ఇప్పుడు దేశంలో  కాంగ్రెస్ పార్టీ,  బీజేపీ,  నరేంద్ర మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్​ను​ ఎదుర్కొనే  శక్తి, ధైర్యం,  సామర్థ్యం ఉన్న నాయకుడుగా కేవలం రాహుల్ గాంధీ మాత్రమే కన్పిస్తున్నారు. కొందరు వయసు రీత్యా ఎదుర్కోలేని  స్థితిలో ఉన్నారు.  ఇక మిగతా ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే ఏపీలో ఉన్న టీడీపీ,  బిహార్​లో  ఉన్న జేడీయూలు మొదటి నుంచి బీజేపీ ఎజెండాలోనే ఉన్నాయి. 

పెద్ద రాష్ట్రమైన యూపీలో  బీఎస్పీ పూర్తిగా చతికిలపడిపోయింది, దీంతో అక్కడి దళిత,  మైనార్టీలంతా  కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. మరోవైపు  ఓబీసీల్లో బలంగా ఉన్న ఎస్పీ కాంగ్రెస్​తోనే కలిసి నడుస్తోంది.  బీహార్​లో ఆర్జేడీ కాంగ్రెస్ వైపే స్థిరంగా ఉంది. దీంతో దేశ రాజకీయాల్లో వర్టికల్ విభజన కన్పిస్తోంది. రెండు జాతీయ పార్టీల మధ్యే భవిష్యత్ రాజకీయాలు నువ్వా... నేనా... అన్నట్టు  కొనసాగే అవకాశం ఉంది.  దీనికి తోడు జమిలి ఎన్నికలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నా.. బీజేపీ ప్రభుత్వం ప్రెజర్​తో తెస్తున్నప్పటికీ కాంగ్రెస్​కు కొంత మేలు జరిగి,  ప్రాంతీయ పార్టీలు మరింత బలహీనపడతాయి.

ప్రతిపక్ష హోదా సాధించిన రాహుల్

ఈ పరిణామాలు ఇలా ఉంటే రెండు దఫాలుగా అపోజిషన్ హోదాలేని కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించి అపోజిషన్ హోదా దక్కించుకొని అపోజిషన్ లీడర్​గా, ఈ దేశ సామాన్యుడి గొంతుకగా  రాహుల్ గాంధీ నిలుస్తున్న విధానానికి, పెరుగుతున్న మద్దతుగా చెప్పొచ్చు.  ఈ  పరిణామాలు  ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్నవారికి ఒకింత భయాన్ని కలిగించినా... ప్రతిపక్ష నేత పోషిస్తున్న పాత్రను, ప్రజల్లో రాహుల్ గాంధీకి ఆదరణ పెరిగింది.  

2022 సెప్టెంబర్​లో కన్యాకుమారి నుంచి  ఆసేతు హిమాచలం వరకూ 150 రోజుల పాటు దాదాపు 4 వేల  కిలోమీటర్లకు పైగా చేసిన భారత్ జోడో  పాదయాత్ర,  తదనంతరం రగులుతున్న ఈశాన్య మణిపూర్ నుంచి ముంబై వరకూ 66రోజుల పాటు 6200 కిలోమీటర్ల భారత్ జోడో న్యాయ్ యాత్ర అతని సామాజిక  బాధ్యతలకు అద్దం పట్టాయి. 

బీజేపీకి రుచించని అంశం

భారతీయ ఆత్మను పట్టుకున్న రాహుల్ గాంధీ, ఈ దేశ దళిత, బహుజన వర్గాల కోసం తన గళాన్ని మరింత బలంగా విన్పిస్తున్నాడు. పెరిగిపోతున్న అసమానతలను, కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం దాసోహం అవుతున్న తీరును మరింత సమర్థవంతంగా ప్రజలకు తెలియజేస్తూ పాలకులను కట్టడి చేస్తున్నాడు. అందుకే తమకు ఎదురుతిరిగిన ఎవరినైనా బీజేపీ నాయకత్వం నయానో.. భయానో..తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటుంది, కానీ, రాహుల్ గాంధీపై ఎన్ని రకాల దాడులు చేసినా ఫలితాన్ని పొందలేకపోతుంది. 

ప్రజల్లో వారి పట్ల ఉన్న ఆభిమానాన్ని తగ్గించే పరిస్థితి లేదు. రాహుల్ ఈ సమర్థ పోరాటమే దక్షణాదిన కాంగ్రెస్ పార్టీ పునాదుల్ని మరింత సుస్థిరం చేస్తుంది, అందుకు తార్కాణం కర్నాటక, తెలంగాణల్లో తిరుగులేని ఆధిపత్యంతో అధికారంలోకి రావడం, తమిళనాడులోనూ కాంగ్రెస్ మిత్రపక్షాన్ని కూర్చోబెట్టడం, స్వయంగా  వయనాడ్​లో చరిత్రను  తిరగరాసే మెజార్టీతో ప్రియాంకను గెలిపించుకోవడం. ఇప్పుడిదే  బీజేపీకి రుచించని అంశం.

భవిష్యత్తు కాంగ్రెస్దే

హర్యానాలో, ఢిల్లీలో ఒంటరి పోరుతో ప్రాంతీయ పార్టీలను పక్కకు పెట్టి మరో ప్రత్యామ్నాయం దిశగా పరుగులు పెడుతోంది.  ఇక రేపు పశ్చిమ బెంగాల్లో సైతం ఇదే ఒంటరి పోరుతో ఇవే ఫలితాలు రావొచ్చు. సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు తమకు ద్రోహం చేసినవారికి తగిన గుణపాఠం చెప్పడంతోపాటు సొంతంగా ఎదగడానికే ఇక ముందు అత్యంత ప్రాధాన్యం అని చెప్పిన మాటలు రాహుల్ మాటలుగానే కనబడుతున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో ఉత్తరాదిలోనూ ప్రాంతీయ పార్టీల స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అన్ని అవకాశాలు బీజేపీ కన్నా కాంగ్రెస్​కే అధికంగా ఉన్నాయి. 

ఇది తక్షణం బీజేపీకి నష్టం కలిగించకున్నా.. భవిష్యత్తులో  కాంగ్రెస్ పార్టీ తన సామర్థ్యాన్ని,  బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడ్తుంది. దీన్ని అందిపుచ్చుకునే సమర్థ నాయకత్వం నేడు రేవంత్ రెడ్డి, సచిన్ పైలట్, డీకే  వంటి వారి రూపంలో పటిష్ట వ్యూహాలు రచించి అమలుచేసే  గణం రాహుల్ గాంధీకి దొరకడం, తనదైన భారతీయ దర్శనంను దేశానికి పరిచయం చేసే దిశలో  రాహుల్ పోతుండడం కాంగ్రెస్​కు మంచిరోజులను తెచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీల ఫలితాల సరళి చూస్తుంటే  భవిష్యత్తులో  కాంగ్రెస్​కు మేలు చేసే అంశాలే కనిపిస్తున్నాయి.

దక్షిణాదిన కాంగ్రెస్​ హవా!

ఆర్థికంగా, విద్యాపరంగా, అవకాశాల పరంగా ఉత్తరాది...  దక్షిణాది రాష్ట్రాల కంటే ఎంతో  వెనుకబడి ఉంటుంది.  కాబట్టి,  ఉత్తరాదిలో  అధికారాన్ని అందుకోవడానికి బీజేపీకి పనికొచ్చిన ఏ వ్యూహమూ దక్షిణాదిపై ప్రభావం చూపట్లేదు.  అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యం మరింతగా సుస్థిరమవడం, రాహుల్ గాంధీ ఆదరణ  రోజురోజుకూ పెరిగిపోవడం ఇప్పుడు బీజేపీ కాంపౌండ్​లో  ప్రకంపనలు  సృష్టిస్తోంది.  

తమ మతపరమైన అంశాలకు మరింత పదును పెట్టాలని, అతివాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వ్యూహాలను రచిస్తోంది. వీటన్నింటికీ రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ, సిద్దరామయ్య,  రేవంత్ రెడ్డి, డీకే వంటి బలమైన నేతలకు తోడు సాక్షాత్తు ప్రియాంక గాంధీ కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో దక్షిణాదిలో కాంగ్రెస్ బలమైన పునాదుల్ని నిర్మించుకుంటోంది.


-బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి, సీఈవో, టిసాట్ నెట్వర్క్