ఆదిలాబాద్‌ జిల్లాలో అంబరాన్నంటిన కాంగ్రెస్ సంబురాలు

ఆదిలాబాద్‌ జిల్లాలో అంబరాన్నంటిన కాంగ్రెస్ సంబురాలు

దండేపల్లి/భీమారం/లక్సెట్టిపేట, వెలుగు: ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీల రిజర్వేషన్ల పెంపు బిల్లు, రాజీవ్ యువ వికాసం పథకం శాసనసభలో తీర్మానం చేసి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ​నేతలు సంబురాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ధన్యవాదాలు తెలుపుతూ దండేపల్లిలో భారీ ర్యాలీ తీశారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు, కులగణన వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని కొనియాడారు. భీమారం మండల కేంద్రంలోని పద్మశాలి కాలనీలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.

 ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి చెన్నూర్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నరేశ్, ఎ.రవి, సత్యనారాయణ, అరుణ్, శివ తదితరులు పాల్గొన్నారు. లక్సెట్టిపేటలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద అంబేద్కర్, సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి, ప్రేమ్ సాగర్ రావు ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పాస్ చేయడం చరిత్రాత్మకమన్నారు. నాయకులు నాగభూషణం, పి.రమేశ్, ఎండీ ఆరిఫ్, స్వామి, అశోక్ తదితరులు 
పాల్గొన్నారు.