యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. యాదాద్రి డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న లీడర్లు బుధవారం యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో సీక్రెట్మీటింగ్ నిర్వహించారు. పైళ్ల శేఖర్ రెడ్డి, కుంభం అనిల్ రెడ్డి ఒక్కటేనని, ఆయన బీఆర్‌ఎస్‌కు కోవర్ట్‌గా పనిచేస్తున్నారని ఆరోపణలు చేశారు. కుంభం డీసీసీ పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏఐసీసీ, పీసీసీ నుంచి ఆహ్వానం రావడంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన చేరినప్పటి నుంచి భువనగిరి నియోజవర్గంలో కాంగ్రెస్ దాదాపుగా రెండుగా చీలిపోయింది.
ఎంపీ కోమటిరెడ్డి అనుచరులుగా ప్రచారంలో ఉన్న లీడర్లు కుంభం రాకను వ్యతిరేకిస్తూ భువనగిరి సీటును బీసీలకే ఇవ్వాలంటూ ఏఐసీసీ, పీసీసీ లీడర్లను కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. తాజాగా ఏర్పాటు చేసుకున్న సీక్రెట్ మీటింగ్‌లో కుంభంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కుంభం వేర్వేరు కాదని, భువనగిరి టికెట్ కోసమే తిరిగి కాంగ్రెస్‌లో చేరారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఏకపక్షంగా వ్యవహరిస్తూ పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కుంభంకు టికెట్ ఇస్తే పార్టీ కచ్చితంగా ఓడిపోతుందని, ఒకవేళ గెలిస్తే మాత్రం తిరిగి బీఆర్ఎస్లో చేరుతారన్నారు.
ఈసారి భువనగిరి టికెట్ బీసీ సామాజికవర్గానికి కేటాయిస్తే కలిసి పనిచేస్తామని జిట్టా బాల కృష్ణారెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రకటించారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన మీటింగ్‌లో నియోజకవర్గంలోని భువనగిరి, వలిగొండ, బీబీనగర్, భూదాన్ పోచంపల్లికి చెందిన కాంగ్రెస్ లీడర్లు పంజాల రామాంజనేయులు గౌడ్, గర్దాస్ బాలయ్య, బర్రె జహంగీర్, తుమ్మల యుగంధర్ రెడ్డి కసుబ శ్రీనివాసరావు, కందాల రామకృష్ణారెడ్డి, బడుగు సత్యనారాయణ, ఎలిమినేటి కృష్ణారెడ్డి, చిన్నం శీను, సిరికొండ శివకుమార్ ఉన్నారు.