బీజేపీ సిట్టింగ్ సీట్లపై కాంగ్రెస్ గురి

  • ఆ నాలుగు ఎంపీ సీట్లలో బలమైన అభ్యర్థులను దింపడంపై ఫోకస్
  • సునీల్ కనుగోలు రిపోర్ట్ ఆధారంగానే ఎంపికలు

హైదరాబాద్, వెలుగు: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నది. టార్గెట్ చేరుకోవాలంటే బీజేపీ సిట్టింగ్ స్థానాలను చేజిక్కించు కోవ డం అని వార్యమని పార్టీ భావిస్తున్నది. అందుకే ప్రస్తుతం బీజేపీ చేతిలో ఉన్న సికింద్రాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ఎంపీ సీట్లపై కాంగ్రెస్ గురిపెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఈ నాలుగు సీట్లను గెలుచుకుని బీజేపీకి గట్టి షాక్ ఇవ్వాలని హస్తం పార్టీ యోచిస్తోంది.

ఇందులో భాగంగా ఈ నాలుగు సీట్లలో కాంగ్రెస్ కు విజయావకాశాలు ఎలా ఉన్నాయి? బీజేపీ ప్లస్, మైనస్ లు ఏమిటనే విషయంపై ఇటీవలే కాంగ్రెస్ స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలుతో సర్వే రిపోర్ట్ కూడా సిద్ధం చేయించారు. ఈ నాలుగు సీట్లలో గెలవాలంటే ఎవరిని నిలబెట్టాలి? ప్రత్యర్థుల బలాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి? అనే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి, ఏఐసీసీ అగ్ర నేతలకు సునీల్ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. సీఎం రేవంత్ ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో ఈ అంశంపైనా చర్చించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. 

పార్టీ పరిశీలనలో ఉన్నది వీళ్లే..  

బీజేపీ సిట్టింగ్ ఎంపీల్లో సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ తరపున ఈ నలుగురే పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వీరిని ఓడించడంపై ఇప్పటికే సునీల్ కనుగోలు కాంగ్రెస్ కు నివేదిక అందించినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ నుంచి బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపి కిషన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం. ఇక్కడ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ను కాంగ్రెస్ తరపున బరిలోకి దింపడంపై ఆ పార్టీ నేతలు యోచిస్తున్నట్లు తెలిసింది. ఇక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నిజామాబాద్ నుంచి, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డిని కరీంనగర్ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనే దానిపై పార్టీలో చర్చ సాగుతోంది.

కరీంనగర్ లో వెలమ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జగపతి రావు కొడుకు రాజేందర్ రావు పేరునూ పార్టీ పరిశీలిస్తోందని చెప్తున్నారు. ఆయన  ఇప్పటికే అక్కడి నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా టికెట్ కోసం తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇక ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ, లంబాడీలలో ఏ వర్గం నుంచి అభ్యర్థిని బరిలో నిలపాలనే దానిపై సీఎం రేవంత్ సర్వే రిపోర్టు తెప్పించుకున్నట్లు సమాచారం. ఇక్కడ మాత్రం కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపడంపైనే ఆయన దృష్టి పెట్టినట్లు తెలిసింది.