- కార్పొరేషన్ల చైర్మన్లు, సలహాదారులు కూడా సీఎం సూచనలతో అందిస్తున్నం: మంత్రి శ్రీధర్ బాబు
- రూ.కోటి విలువైన సరుకులు ఇచ్చిన హైసియా, నిర్మాణ డాట్ ఆర్గ్
- బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ 2 నెలల జీతాన్ని వరద బాధితులకు విరాళంగా ఇచ్చారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అలాగే కార్పొరేషన్ల చైర్పర్సన్లు, ప్రభుత్వ సలహాదారులు కూడా తమ 2 నెలల జీతాన్ని ఇచ్చారని ఆయన వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు వారు ఆ విరాళాలు ఇచ్చారని.. ఖమ్మం, మహబూబాబాద్ వరద బాధితుల సహాయార్థం వాటిని అందజేస్తామని చెప్పారు. ఆదివారం మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ కలిసి ఆదివారం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఇప్పటికే పరిహారం ప్రకటించామని గుర్తుచేశారు. కూలిన ఇండ్లు, నష్టపోయిన పంటలు, చనిపోయిన పశువులకు సంబంధించి కూడా పరిహారం అందిస్తామని మంత్రి వివరించారు. కాగా.. వరద బాధితులను ఆదుకునేందుకు హైదరాబాద్ సాఫ్ట్ వేర్ కంపెనీల సంఘం (హైసియా), నిర్మాణ డాట్‌ఆర్గ్ అనే సంస్థ రూ.కోటి విలువైన సరుకులతో పాటు సహాయ సామగ్రిని అందజేశాయి. వాటికి సంబంధించిన వాహనాలను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్‌తో కలిసి సెక్రటేరియెట్‌లో మంత్రి శ్రీధర్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. బియ్యం, వంటనూనె, చక్కెర, ఉప్మారవ్వ, ఉప్పు, కారం, పసుపు, సబ్బులు, టవల్స్, టూత్‌పేస్టు, సానిటరీ ప్యాడ్లతో కూడిన రూ.3 వేల విలువైన కిట్లను అందిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
మరో మూడు వాహనాల సామగ్రిని 2 రోజుల్లో పంపిస్తామన్నారు. ప్రభుత్వ సహాయ, పునరావాస కార్యక్రమాలకు తోడుగా ప్రైవేటు సంస్థలు, ఎన్జీవోలు ముందుకు వచ్చి వరద బాధితులకు చేయూతనివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైసియా అధ్యక్షుడు ప్రశాంత్ నాదెండ్ల, మాజీ అధ్యక్షుడు భరణి కుమార్, నిర్మాణ, ఐఎస్టీ తదితర స్వచ్ఛంద సంస్థల
ప్రతినిధులు పాల్గొన్నారు.
టాప్ అచీవర్స్ జాబితాలో తెలంగాణ
వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్) లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అయినా కూడా ప్రతిపక్ష నేతలు రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలుచేసేలా ప్రకటనలు ఇస్తున్నారని ఓ ప్రకటనలో ఆయన మండిపడ్డారు. టాప్ అచీవర్లుగా ఎంపికైన 17 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని తెలిపారు. దానికి సంబంధించి ఈనెల 5న రాష్ట్ర పరిశ్రమల శాఖకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ అవార్డును అందజేసిందని గుర్తుచేశారు.
వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికలో మొత్తం 352 పారామీటర్లకుగాను నూటికి నూరు శాతం అమలు చేసి టాప్ అచీవర్స్ జాబితాలో తెలంగాణ స్థానం సంపాదించిందని మంత్రి వెల్లడించారు. ఏదో పత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురిస్తే దాన్ని అడ్డం పెట్టుకుని.. అవార్డుల జాబితాలో తెలంగాణ లేదంటూ ప్రతిపక్షాలు ఆరోపించడం దుర్మార్గమన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ డాక్టర్
జి.మల్సూర్ ఆ అవార్డు అందుకున్నారని చెప్పారు.