ముందుకు పోనంటున్న ‘ఓల్డ్​’ కాంగ్రెస్​

రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ పార్టీ పగ్గాలు అందుకున్న తర్వాత….ఢిల్లీలో జరిగిన తొలి ప్లీనరీ సెషన్‌‌‌‌‌‌‌‌లో చాలా పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్లు ఇచ్చారు.
పార్టీలో యువరక్తాన్ని నింపుతామన్నారు. రాష్ట్రాల్లో చక్రం తిప్పుతున్న నాయకుల్లో కొందరిని హెడ్డాఫీసుకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసేశారు.  ఈ ఊపు, ఉత్సాహం కొన్నాళ్లకే ఆవిరైపోయింది. పోయినేడాది చివరలో జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో సీనియర్లదే పై చేయి అయ్యింది. రాహుల్‌‌‌‌‌‌‌‌ తనకు అత్యంత ఆప్తులైనవాళ్లకుసైతం ఏమీ చేయలేకపోయారు. పార్టీని గాంధీ–నెహ్రూ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ నుంచి తప్పిస్తేనేకానీ, మంచి రోజులు రావని తేల్చుకున్నారు.

దేశంలో రాజకీయ పరిణామాలను చెప్పాల్సి వచ్చినప్పుడు ‘బిఫోర్‌‌‌‌‌‌‌‌ పీవీ – ఆఫ్టర్‌‌‌‌‌‌‌‌ పీవీ’ అని విశ్లేషించాలి. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ విషయంలోనైనా సరే తప్పదు. పీవీకి ముందు 15 ఏళ్లపాటు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో కుటుంబ పెత్తనమే సాగింది. పీవీ హయాంలో 1991 నుంచి 1996 వరకు నెహ్రూ కాలంనాటి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ కనిపించింది. పార్టీని పూర్తిగా డెమొక్రటిక్‌‌‌‌‌‌‌‌ వేలో నడిపించారు.  తిరుపతిలో ప్లీనరీని జరిపించి, సీడబ్ల్యూసీ సభ్యులు సహా అన్ని కీలక స్థానాలకు ఎన్నికలు జరిపించారు. వైఎస్‌‌‌‌‌‌‌‌ రాజశేఖరరెడ్డి తనతోనూ, అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డితోనూ విభేదించినప్పటికీ సీడబ్ల్యూసీలో వైఎస్‌‌‌‌‌‌‌‌ ప్రవేశించడానికి పీవీ అడ్డం పడలేదు.  అంత ప్రజాస్వామికంగా పార్టీని నడపడం టెన్‌‌‌‌‌‌‌‌ జనపథ్‌‌‌‌‌‌‌‌ కోటరీకి నచ్చలేదు. క్రమంగా పీవీ చుట్టూ అసమ్మతి వలని చుట్టేశారు.  సోనియా గాంధీ విషయంలో పీవీ అన్యాయం చేస్తున్నారన్న విషయాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చారు. చివరికి సీతారాం కేసరిని ఎగదోసి,  చాలా అవమానకరంగా పీవీని సాగనంపేశారు.

ఆ దెబ్బతో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీలో గాంధీ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ లేకుండా హైకమాండ్‌‌‌‌‌‌‌‌ అనిపించుకునే ఛాన్స్‌‌‌‌‌‌‌‌ లేకుండా పోయింది.  హైకమాండ్‌‌‌‌‌‌‌‌ అంటే గాంధీ–నెహ్రూ ఫ్యామిలీయేనని పాతికేళ్లుగా ఖాయమైపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ ఆ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ని బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేయాలని నిర్ణయించుకున్నారు. తల్లి సోనియా గాంధీ నుంచి  2017 చివరలో పార్టీ పగ్గాలు అందుకున్నాక….  పెద్దగా రాణించిందేమీ లేదు.  త్రిపుర,  కర్ణాటక, మేఘాలయ, నాగాలాండ్‌‌‌‌‌‌‌‌ ఒక బంచ్‌‌‌‌‌‌‌‌లోనూ; మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌, తెలంగాణ, మిజోరం రెండో బంచ్‌‌‌‌‌‌‌‌లోనూ ఎన్నికలు జరిగాయి. 2018లో జరిగిన మొత్తం 9 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ల్లో పూర్తిగానూ, కర్ణాటకలో సంకీర్ణంగానూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారం దక్కించుకుంది. మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఏలుబడి సుదీర్ఘంగా సాగడంతో యాంటీ–ఎస్టాబ్లిష్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఓటు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కి కలిసొచ్చింది. రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో వసుంధర రాజే సింధియాకి బీజేపీ అధిష్టానం నుంచే వ్యతిరేకత ఉన్నందువల్ల పార్టీ శ్రేణుల నుంచి సహకారం లభించలేదు. తెలంగాణలో మరలా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీయే అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.  బీజేపీ ‘లుక్‌‌‌‌‌‌‌‌ ఈస్ట్‌‌‌‌‌‌‌‌’ స్కీమ్‌‌‌‌‌‌‌‌ ఫలించడంతో త్రిపురలో సొంతంగా, నాగాలాండ్‌‌‌‌‌‌‌‌లో నేషనలిస్ట్‌‌‌‌‌‌‌‌ డెమొక్రటిక్‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రెసివ్‌‌‌‌‌‌‌‌ పార్టీ (ఎన్‌‌‌‌‌‌‌‌డీపీపీ)తోనూ,  మిజోరంలో మిజో నేషనల్‌‌‌‌‌‌‌‌ ఫ్రంట్‌‌‌‌‌‌‌‌ (ఎంఎన్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌)తోనూ, మేఘాలయలో నేషనల్‌‌‌‌‌‌‌‌ పీపుల్స్‌‌‌‌‌‌‌‌ పార్టీ (ఎన్‌‌‌‌‌‌‌‌పీపీ)తోనూ కలిసి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

దీనికంతటికీ కారణం పార్టీలో తమ కుటుంబ పెత్తనం పెరగడమేనని, నేతలందరూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతూ క్షేత్రస్థాయిలో జనాలకు దూరమవుతున్నారని రాహుల్‌‌‌‌‌‌‌‌ భావిస్తున్నారు. ఈ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ నుంచి బయటకు రావాలని రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ పిలుపు ఇచ్చేసరికి పార్టీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి.  పార్టీని కుటుంబం చేతుల నుంచి తప్పించాలనుకునేవారు రాహుల్‌‌‌‌‌‌‌‌ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు.  హైకమాండ్‌‌‌‌‌‌‌‌కి వీరవిధేయులైన పీసీసీ ప్రెసిడెంట్లుమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఏఐసీసీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా రాహుల్‌‌‌‌‌‌‌‌ ఉండాల్సిందేనన్న డిమాండ్‌‌‌‌‌‌‌‌తో  పంజాబ్‌‌‌‌‌‌‌‌ పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌ జాఖడ్‌‌‌‌‌‌‌‌,జార్ఖండ్‌‌‌‌‌‌‌‌ చీఫ్‌‌‌‌‌‌‌‌ అజయ్‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌, అస్సాం చీఫ్‌‌‌‌‌‌‌‌ రిపుణ్‌‌‌‌‌‌‌‌ బోరా,  యూపీ చీఫ్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ బబ్బర్‌‌‌‌‌‌‌‌, ఒడిశా నిరంజన్‌‌‌‌‌‌‌‌ పట్నాయక్‌‌‌‌‌‌‌‌, మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ అశోక్‌‌‌‌‌‌‌‌ చవాన్‌‌‌‌‌‌‌‌ రాజీనామాలు చేసేశారు. ఇదే బాటలో మరికొందరుకూడా ఉన్నట్లు చెబుతున్నారు.

రాహుల్‌‌‌‌‌‌‌‌ ఉద్దేశం చాలా క్లియర్‌‌‌‌‌‌‌‌గా ఉంది. పార్టీని ప్రజాస్వామికంగా నడపనంతకాలం అపజయాలు ఎదురవుతూనే ఉంటాయన్నది ఆయన వాదన. పార్టీ అత్యున్నత పదవిని గాంధీ–నెహ్రూ ట్యాగ్‌‌‌‌‌‌‌‌ లేనివాళ్లకు కట్టబెట్టాలని ఆయన స్సష్టం చేస్తున్నారు. పార్టీలో స్వార్థ రాజకీయాలు పెరిగిపోయాయని, పార్టీ ప్రయోజనాలకంటే సొంత కుటుంబంకోసమే సీనియర్లు పనిచేస్తున్నారని రాహుల్‌‌‌‌‌‌‌‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. పోయినేడాది గెలుచుకున్న మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లలో ముఖ్యమంత్రులు కమల్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌, అశోక్‌‌‌‌‌‌‌‌ గెహ్లాట్‌‌‌‌‌‌‌‌లతోపాటు తమిళనాడులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తమ తమ కొడుకులకోసం గట్టిగా పనిచేశారు. వీరిలో కమల్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌ కొడుకు నకుల్‌‌‌‌‌‌‌‌నాథ్‌‌‌‌‌‌‌‌, చిదంబరం కొడుకు కార్తి చిదంబరం గెలవగా, అశోక్‌‌‌‌‌‌‌‌ గెహ్లాట్‌‌‌‌‌‌‌‌ కొడుకు వైభవ్‌‌‌‌‌‌‌‌ గెహ్లాట్ ఓడిపోయారు. జనరల్‌‌‌‌‌‌‌‌ ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌లో పార్టీ సీనియర్లు ఈ విధంగా ప్రవర్తించడాన్ని రాహుల్‌‌‌‌‌‌‌‌ చాలా సీరియస్‌‌‌‌‌‌‌‌గా తీసుకున్నారు. అందుకే, పార్టీ బాధ్యతల్ని మరొకరికి అప్పగించడమే కాకుండా, పార్టీలో మునుపటిలా అత్యున్నత  నిర్ణయాధికారాన్నికూడా బదలాయించాలనుకుంటున్నారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ… బాబాయి సంజయ్‌‌‌‌‌‌‌‌ గాంధీ 40 ఏళ్లక్రితం ఏరికోరి తెచ్చిన కోటరీ అంత సులువుగా ఒప్పుకోకపోవచ్చు. పార్టీలో చక్రం తిప్పుతున్నవాళ్లంతా సంజయ్‌‌‌‌‌‌‌‌ అనుచరులేనన్నది మరచిపోకూడదు.

సోనియానే కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌.. కాంగ్రెసే సోనియా

రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ ఉద్దేశం ఏదయినప్పటికీ… ఆయన లేవనెత్తిన ప్రస్తావనకు మాత్రం దేశంలో అన్నివర్గాలనుంచి మంచి రెస్సాన్స్‌‌‌‌‌‌‌‌ వచ్చింది.  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో 1999 నుంచి సోనియా గాంధీ హయాం మొదలై ఇప్పుడు రాహుల్‌‌‌‌‌‌‌‌ వరకు వచ్చింది.  పార్టీని ఫ్యామిలీ అఫైర్‌‌‌‌‌‌‌‌గా సోనియా మార్చేశారు. ఈ 20 ఏళ్లలో ఒకటి  రెండుసార్లు తప్ప ప్లీనరీ సెషన్‌‌‌‌‌‌‌‌ల జోలికి వెళ్లలేదు. మేధోమధన సదస్సులు, స్పెషల్‌‌‌‌‌‌‌‌ సెషన్లుతో నడుపుకొచ్చారు. సీడబ్ల్యూసీని నామమాత్రం చేశారు. ఎమర్జెన్సీ రోజుల్లో ఏఐసిసి ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ దేవకాంత బారువా ఇచ్చిన ‘ఇండియాయే ఇందిర – ఇందిరయే ఇండియా’ అనే నినాదం  సోనియా విషయంలో నిజమైంది. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ అంటే ఇప్పుడు సోనియాయే.

దరిదాపుగా 135 ఏళ్ల చరిత్రగల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి సుదీర్ఘ కాలం చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌గా పనిచేసిన రికార్డు సోనియా గాంధీదే. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీకి మోతీలాల్‌‌‌‌‌‌‌‌ నెహ్రూ మొదలుకొని రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ వరకు ఒకే కుటుంబం నుంచి అయిదు తరాలవాళ్లు ప్రెసిడెంట్లుగా పనిచేశారు. గతంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్లీనరీ నిర్వహించుకుని చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌ని ఎన్నుకునేది. ప్రధానిగా నెహ్రూ, లాల్‌‌‌‌‌‌‌‌బహదూర్‌‌‌‌‌‌‌‌ శాస్త్రి, ఇందిరా గాంధీ… ఎవరున్నప్పటికీ కీలక నిర్ణయాలన్నీ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ వర్కింగ్‌‌‌‌‌‌‌‌ కమిటీ (సీడబ్ల్యూసీ)లో చర్చించిన తర్వాత తీసుకునేవారు.  1977 పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఘోరంగా ఓడిపోయాక… పార్టీ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌, ప్రభుత్వ అధినేత ఒక్కరే కావడం మొదలైంది. ఇందిరా గాంధీ మొత్తం పార్టీని నిర్మొహమాటంగా తన చెప్పుచేతల్లోకి తెచ్చేసుకున్నారు.  ఇక అప్పటినుంచి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ పూర్తిగా గాంధీ–నెహ్రూ ఫ్యామిలీ చేతుల్లోకి వెళ్లిపోయింది.