ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం...సామాన్యుల ప్లేట్‌‌‌‌లోని ఆహారాన్ని లాక్కుంది : కాంగ్రెస్‌‌‌‌ చీఫ్​ మల్లికార్జున ఖర్గే

ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం...సామాన్యుల ప్లేట్‌‌‌‌లోని ఆహారాన్ని లాక్కుంది : కాంగ్రెస్‌‌‌‌ చీఫ్​ మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ: పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలపై కాంగ్రెస్‌‌‌‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌‌‌‌ ఖర్గే శుక్రవారం బీజేపీపై మండిపడ్డారు. మహారాష్ట్రలో దొడ్డి దారిన అధికారాన్ని చేజిక్కించుకున్న ట్రిపుల్‌‌‌‌ ఇంజిన్‌‌‌‌ ప్రభుత్వం సామాన్యుల పళ్లెం నుంచి ఆహారాన్ని లాక్కుందని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలకు వీడ్కోలు పలికి.. తలుపులను పూర్తిగా తెరవాలని మహారాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారని ఆయన అన్నారు.

నవంబర్ 20న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ కే ఓటు వేయడానికి రాష్ట్రం సిద్ధమవుతోందని శుక్రవారం ఆయన ఎక్స్​లో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ద్రవ్యోల్బణం మహారాష్ట్రతో సహా దేశ ప్రజలను తీవ్రంగా దెబ్బతీసిందని, దీనిని పరిష్కరించడానికి ఆ పార్టీని గద్దె దింపాలని ఆయన సూచించారు. సాధారణ 'థాలీ' ధర కేవలం ఏడాది కాలంలోనే 52 శాతం పెరిగిందని ఖర్గే ఆరోపించారు. "అక్టోబర్ 2023 నుంచి అక్టోబర్ 2024 మధ్య  టమోటా ధరలు 247 శాతం పెరిగాయి.  వెల్లుల్లి ధర 128 శాతం పెరిగింది. సగటున, అన్ని కూరగాయల ధరలు 89 శాతం పెరిగాయి”అని ఆయన చెప్పారు. ఎడిబుల్ ఆయిల్, ఉప్పు, మైదా ధరలు 18 శాతం వరకు పెరిగాయని ఖర్గే పేర్కొన్నారు.