- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 స్థానాల్లో 12 కైవసం
- ఉత్కంఠ పోరులో ఆలపై జీఎంఆర్ విజయం
- యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చేతిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరాజయ
- యూత్ లీడర్ జనంపల్లి అనిరుధ్‌రెడ్డి చేతిలో లక్ష్మారెడ్డి పరాభవం
- ప్రభావం చూపని బర్రెలక్క.. వన్ సైడ్‌గా జూపల్లి గెలుపు
- అచ్చంపేటలో వంశీకి రికార్డ్మెజార్టీ
- కల్వకుర్తిలో 'కసిరెడ్డి' ఘన విజయం
మహబూబ్‌నగర్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగుర వేసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 స్థానాల్లో గెలుపొందింది. టీపీసీసీ చీఫ్ఎనుముల రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో బంపర్ మెజార్టీతో గెలుపొందగా, మహబూబ్‌నగర్‌లో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్ రెడ్డి (వైఎస్ఆర్) చేతిలో ఓటమి పాలయ్యారు.
మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డిపై జనంపల్లి అనిరుధ్ రెడ్డి సునాయాసంగా గెలుపొందారు. మక్తల్‌లో చిట్టెం రాంమెహన్రెడ్డి, నారాయణపేటలో ఎస్.రాజేందర్ హ్యాట్రిక్ విజయం సాధించాలనే ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కాంగ్రెస్ నుంచి మక్తల్ లో వాకిటి శ్రీహరి, నారాయణపేట స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్ణికా రెడ్డి గెలుపొందారు. షాద్‌నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌పై ఘన విజయం సాధించారు.
పాలమూరులో మూడు రౌండ్ల తర్వాత కాంగ్రెస్‌కు లీడ్
పాలమూరు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. మొదటి మూడు రౌండ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి వి.శ్రీనివాస్ గౌడ్ 383, 53, 470 ఓట్ల లీడ్ సాధించగా, ఆ తర్వాత 4వ రౌండ్ నుంచి 20వ రౌండ్ వరకు వైఎస్ఆర్కు ఆధిక్యం వచ్చింది. బీజేపీ అభ్యర్థి ఏపీ మిథున్‌రెడ్డి ఇద్దరికి దీటుగా ఓట్లను పొందారు. మొత్తం 20 రౌండ్లలో 19,376 ఓట్లను సాధించారు. 20 రౌండ్లలో మొత్తం 1,77,704 ఓట్లు పోల్ కాగా శ్రీనివాస్‌గౌడ్‌కు 67,736, వైఎస్ఆర్కు 84,728 ఓట్లు పోల్ అయ్యాయి. 16,992 ఓట్ల మెజార్టీతో శ్రీనివాస్‌గౌడ్‌పై యెన్నం శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు.
ఊహించని విజయం
నారాయణపేటలో తకాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్ణికా రెడ్డి బీఆర్ఎస్అభ్యర్థి, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డికి షాక్ ఇచ్చారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలనుకున్న ఎమ్మెల్యే ఆశలపై ఓట్లరు భిన్న తీర్పు ఇచ్చి కంగుతినిపించారు. మొత్తం 20 రౌండ్లకు గాను 9వ రౌండ్ వరకు కాంగ్రెస్ లీడ్ సాధించింది. నాలుగు రౌండ్లలో బీఆర్ఎస్ ఆధిక్యతను ప్రదర్శించినా.. 14వ రౌండ్ నుంచి 20 రౌండ్ వరకు పర్ణికా ఆధిక్యతను కొనసాగించారు. 20 రౌండ్లకు 1,81,640 ఓట్లు పోల్అయ్యాయి. ఇందులో పర్ణికాకు 84,749 ఓట్లు పోల్ కాగా, రాజేందర్ రెడ్డికి 76,755 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో పర్ణికా రెడ్డి 7,950 ఓట్లమెజార్టీతో గెలుపొందారు.
చిట్టెంకు షాక్
మక్తల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ క్యాండిడేట్ చిట్టెం రాంమోహన్‌రెడ్డికి ఓటర్లు షాక్ ఇచ్చారు. మక్తల్ కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరికి విజయం కట్టబెట్టారు. బీజేపీ అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్ రెడ్డి కూడా టఫ్ ఫైట్ఇచ్చారు. మొత్తం 1,85,845 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరి 74,917, బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి 57,392 ఓట్లు, మాదిరెడ్డి జలంధర్ రెడ్డికి 45,455 ఓట్లు రాగా.. శ్రీహరి 17, 525 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
బీసీ నేతకు పట్టం
షాద్ నగర్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ 7,128 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కౌంటింగ్ ఉత్కంఠ గా కొనసాగింది. మొత్తం 22 రౌండ్ లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ కు 77,817 ఓట్లు పోలవగా, బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు 70,689 ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి అంజయ్యపై శంకర్ 7,128 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
అరంగేట్రంతోనే విక్టరీ
నాగర్‌కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ అభ్యర్థి కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి రాజకీయ అరంగేట్రంతోనే విక్టరీ సాధించారు. రాజేశ్‌కు 85,431 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి 80,427 ఓట్ల వచ్చాయి. ఫస్ట్ రౌండ్ నుంచి మర్రికి లీడ్ రాగా.. 12 వ రౌండ్ నుంచి రేస్‌లోకి వచ్చిన రాజేశ్ 6,052 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
గువ్వలకు ఓటమి
అచ్చంపేట బీఆర్ఎస్ క్యాండిడేట్, సిట్టింగ్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చిత్తుగా ఓడిపోయారు. హ్యాట్రిక్ఎమ్మెల్యేగా గెలువాలని కలలు కనగా, ఆయన కలల పై ఓటర్లు నీళ్లు చల్లారు. కాంగ్రెస్ క్యాండిడేట్ డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకు ఓటర్లు గ్రాండ్ విక్టరీని అందించారు. మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు వంశీ ఆధిపత్యం చలాయించారు. గువ్వల బాలరాజు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. వార్ వన్ సైడ్‌గా నడిచింది. మొత్తం వంశీకృష్ణకు 1,15,337 ఓట్లు పోల్ అవగా, గువ్వలకు 66,011 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో వంశీ 49,326 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
జూపల్లికి ఫస్ట్ రౌండ్ నుంచి లీడ్
కొల్లాపూర్అసెంబ్లీకి పోటీ వన్‌సైడ్ నడిచినట్లు స్పష్టమైంది. కాంగ్రెస్అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు ఓటర్లు భారీ మెజార్టీని అందించారు. బర్రెలక్క పోటీలో ఉండటం వల్ల ఓట్లు చీలుతాయ నే భావన ఉన్నా.. వార్ వన్ సైడ్‌గా నడిచింది. జూపల్లికి 91,853 ఓట్లు పోల్ అవగా, సిట్టింగ్ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి 62,872 ఓట్లు పోల్ అయ్యాయి. జూపల్లి 28,981 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కల్వకుర్తి 'కసిరెడ్డి'దే..
కల్వకుర్తి అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి రెండు రౌండ్లు మినహా అన్ని రౌండ్స్ లో లీడ్ సాధించారు. ఆయనకు 75,856 ఓట్లు రాగా 5,410 మెజారిటీ సాధించారు. ఆరోసారి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి టి.ఆచారి 70,448 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ మూడో ప్లేస్‌కు పరిమితమయ్యారు.
దేవరకద్ర ఫలితంపై తీవ్ర ఉత్కంఠ
దేవరకద్ర ఫలితంపై హైవోల్టేజ్ టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్అభ్యర్థి జి.మధుసుదన్ రెడ్డి మధ్య పోటా పోటీ వార్ నడిచింది. రౌండ్ రౌండ్ కు ఇద్దరి నడుమ మెజారిటీ దోబూచులాడింది. ఆఖరు మూడు రౌండ్లలో జీఎంఆర్‌కు 974, 1449, 366 లీడ్ రావడంతో ఉత్కంఠ పోరులో విజయం కలిగింది. 21 రౌండ్లకు గాను 1,94,543 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో ఆల వెంకటేశ్వర్ రెడ్డికి 87,002, జీఎంఆర్‌కు 88,085 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో జీఎంఆర్ ఆలపై 907 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
రేవంత్ రెడ్డికి భారీ మెజార్టీ
కొడంగల్ నియోజకవర్గం నుంచి టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి గ్రాండ్ విక్టరీ సాధించారు. మొదటి రౌండ్ నుంచే ఆధిక్యం సాధిస్తూ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ క్యాండిడేట్, సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చిత్తుగా ఓడించారు. మొత్తం 20 రౌండ్లలో 1,95,161 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో రేవంత్ రెడ్డికి 1,07,429 ఓట్లు పోల్ కాగా, నరేందర్ రెడ్డికి 74,897 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో రేవంత్ రెడ్డి 32,532 ఓట్ల భారీ మెజార్టీతో నరేందర్రెడ్డిపై గెలుపొందారు.
నడిగడ్డలో బీఆర్ఎస్ పాగా
గద్వాల/అలంపూర్ వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో నడిగడ్డలో మరోసారిత బీఆర్ఎస్ పాగా వేసింది. జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. మొత్తం గద్వాల నియోజకవర్గంలో 2,13,283 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 22 రౌండ్లు కౌంటింగ్ జరగగా 11వ రౌండ్ నుంచి 17 వరకు కాంగ్రెస్ అభ్యర్థి సరితకు కొంత లీడ్ వచ్చినా మిగతా రౌండ్లలో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దూసుకెళ్లారు. 22 రౌండ్ పూర్తయ్యేసరికి సరితపై కృష్ణమోహన్ రెడ్డి (పోస్టల్ బ్యాలెట్ లను కలుపుకొని) 7,036 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి బలిగెర బోయ శివారెడ్డికి 7,422 ఓట్లు వచ్చాయి. బీఎల్ఎఫ్ అభ్యర్థి రంజిత్ కుమార్ కు13,429 ఓట్లు వచ్చాయి. గద్వాలలో నోటాకు 761, అలంపూర్ లో 2,003 ఓట్లు నోటాకు వచ్చాయి.
అలంపూర్ లో ప్రతి రౌండ్ లో లీడ్
అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ పై (పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కలుపుకొని) 30,573 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో మొదట పోస్టల్ బ్యాలెట్ మినహాయిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంపత్ కుమార్ 21 రౌండ్లకు గాను ఏ ఒక్క రౌండ్ లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడుపై ఆధిపత్యం సాధించలేకపోయారు. విజయుడు రౌండ్ రౌండ్ కు ఆధిపత్యం సాధిస్తూ ముందుకు వెళ్లారు. చివరకు 30, 573 ఓట్లతో మెజార్టీతో విజయుడు విజయం సాధించాడు. అలంపూర్ నియోజకవర్గంలో 2, 37, 938 ఓటర్లకు గాను 1, 96, 307 ఓట్లు పోలయ్యాయి. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడుకు1,04,060 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ కు 73,487 ఓట్లు వచ్చాయి. మిగతా అభ్యర్థులకు నోటాతో కలిపి 1,9248 ఓట్లు వచ్చాయి.
జడ్చర్లలో వార్ వన్ సైడ్
జడ్చర్లలో వార్ వన్‌సైడ్‌గా నడిచింది. 20 రౌండ్లకు గాను కేవలం ఐదో రౌండ్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి సి.లక్ష్మారెడ్డి స్వల్ప ఆధిక్యాన్ని సాధించారు. మొదటి నాలుగు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్ రెడ్డి లీడ్ సాధిస్తూ రాగా.. ఏడు, ఎనిమిది, 11, 13, 15వ రౌండ్లలో భారీ ఆధిక్యం రావడంతో ఆయన గెలుపునకు బాటలు పడ్డాయి. 20 రౌండ్లకు గాను 1,73,635 ఓట్లు పోల్ అయ్యాయి. ఇందులో అనిరుధ్ రెడ్డికి 90,145 ఓట్లు పోల్ అవగా, లక్ష్మారెడ్డికి 75,515 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో లక్ష్మారెడ్డిపై అనిరుధ్ రెడ్డి 15,386 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.