గులాబీ కోటలో కాంగ్రెస్​ జెండా

  • ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ 
  •     13 స్థానాల్లో కాంగ్రెస్ 8, బీఆర్​ఎస్ ​5 స్థానాల్లో గెలుపు 
  •      ఓటమి పాలైన మంత్రి కొప్పుల, మాజీ మంత్రి ఈటల
  •      స్వల్ప తేడాతో బయటపడిన గంగుల
  •     బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించిన బీజేపీ చీలిక ఓటు

కరీంనగర్​/ గంగాధర, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీని నమోదు చేసింది. గులాబీ పార్టీకి కంచుకోటగా భావించే ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో హస్తం పార్టీ జెండా పాతింది. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల్లో ఎనిమిదింటిలో కాంగ్రెస్, 5 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. గెలిచినవారిలో తొలిసారిగా ఎమ్మెల్యేలు అయినవాళ్లు 8 మంది ఉండడం విశేషం.

2018 ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఈసారి బీజేపీ నుంచి బలమైన అభ్యర్థుల పోటీలో ఉండడంతో నాలుగు చోట్ల ట్రయాంగిల్ వార్ నడిచింది. హుజూరాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్లలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ అభ్యర్థులు చీల్చడంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఏడుసార్లు వరుసగా గెలిచి ఓటమి ఎరుగని నేతలుగా పేరున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. కరీంనగర్ నియోజకవర్గంలో నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోరులో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ పై మంత్రి గంగుల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.  

కరీంనగర్​ జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్​ మండలాలు హుస్నాబాద్ ​నియోజకవర్గంలో ఉండగా, ఆ నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో కలిసింది.  ఇక్కడి నుంచి కాంగ్రెస్​ తరఫున పొన్నం ప్రభాకర్ పోటీలో నిలిచి సిట్టింగ్​ఎమ్మెల్యే 
సతీశ్‌‌‌‌కుమార్​పై 19,664 ఓట్ల తేడాతో గెలిచారు.  
 
గంగుల కమలాకర్​ నాలుగోసారి.. 

కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ నాలుగోసారి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్​కు ఆయనకు మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది.  మొదటి మూడు రౌండ్లలో గంగుల ఆధిక్యం ప్రదర్శించగా.. ఆ తర్వాత 2 రౌండ్లలో బండి సంజయ్ లీడ్​లోకి వచ్చారు.  ఆ తర్వాత ఆధిక్యంలోకి వచ్చిన గంగుల18వ రౌండ్ దాకా 12,914 ఓట్ల మెజార్టీతో కొనసాగారు.

19వ రౌండ్ నుంచి అన్ని రౌండ్లలోనూ మెజార్టీ తగ్గుతూ వచ్చింది. 24వ రౌండ్ కు వచ్చేసరికి 4,648కు తగ్గింది. రాంపూర్ విద్యార్థి  హైస్కూల్ లోని 697 పోలైన ఈవీఎం, రేకుర్తి లయోలా బీఈడీ కాలేజీ 594 ఓట్లు పోలైన ఈవీఎం మొరాయించడంతో ఓట్లు లెక్కింపు సాధ్యం కాలేదు. దీంతో కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న బండి సంజయ్ రీకౌంటింగ్ కు డిమాండ్ చేశారు. ఎన్నికల అధికారులు మాత్రం మొరాయించిన ఈవీఎంల వీవీ ప్యాట్లలో పోలైన స్లిప్పులను వీడియో తీస్తూ కౌంట్ చేశారు. 25వ రౌండ్ తర్వాత పోస్టల్ బ్యాలెట్లతో కలిపి రెండు ఈవీఎంల్లోని  లెక్కించగా గంగుల కమలాకర్ కు 92,179 ఓట్లు, బండి సంజయ్ కి 89,016 ఓట్లు పోలైనట్లు గుర్తించారు. చివరికి 3163 ఓట్ల మెజార్టీతో గంగుల కమలాకర్ గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 

చొప్పదండిలో ఎవరికైనా ఒక్క చాన్సే.. 

చొప్పదండి ఓటర్లు ఎవరికైనా ఒక్క చాన్సే ఇస్తారు. ఈసారి కూడా అదే రీతిలో తీర్పునిచ్చారు. ప్రభుత్వం, ఎమ్మెల్యే రవిశంకర్ పై ఉన్న వ్యతిరేకత, రెండుసార్లు ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుండడం మేడిపల్లి సత్యంకు కలిసి వచ్చింది. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కు 52,956  ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంకు 90,395 ఓట్లు వచ్చాయి.

రవిశంకర్ ను 37,439 ఓట్ల భారీ తేడాతో సత్యం ఓడించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రవిశంకర్ తానే గెలుస్తున్నాననే ధీమాతో ప్రజల్లోకి వెళ్లారు. కొందరు మండలస్థాయి లీడర్లు కాంగ్రెస్‌‌‌‌లో జాయిన్ అవ్వడం, మరికొందరు అంతర్గతంగా మేడిపల్లితో టచ్ లోకి వెళ్లడం, ప్రచారానికి వెళ్లిన చాలా చోట్ల ప్రజలు అడ్డుగింతలు ఆయన ఓటమికి కారణంగా తెలుస్తోంది. 

గతంలో ఓడించినోళ్లపై కవ్వంపల్లి గెలుపు.. 

మానకొండూరు ఎమ్మెల్యేగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గెలుపొందారు. 2009లో పీఆర్పీ నుంచి, 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి ఆరేపల్లి మోహన్ పై, మరోసారి రసమయి బాలకిషన్ పై ఓడిపోయిన ఆయన.. వారిద్దరిని ఈ సారి ఓడించి విజయం సాధించారు.  ప్రస్తుతం కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా కవ్వంపల్లి సత్యనారాయణ పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు 64,408 ఓట్లు పోలవ్వగా, బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ కు 14,879 ఓట్లు పోలయ్యాయి. 96,773 ఓట్లు సాధించిన కవ్వంపల్లి 32,365 ఓట్ల మెజార్టీతో రసమయిపై విజయం సాధించారు.  

కౌశిక్ రెడ్డికి కలిసొచ్చిన త్రిముఖ పోరు

ఎమ్మెల్యే కావాలన్న కలను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నిజం చేసుకున్నారు.  ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేసి కాంట్రవర్సీలో ఉండే ఆయన.. కొంత కాలంగా ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా జనంలో ఉన్నారు. ఆయన భార్య, కూతురితో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గజ్వేల్ లో పోటీ చేయడం వల్ల హుజూరాబాద్ పై దృష్టి సారించకపోవడం, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తి స్థాయిలో చీల్చకపోవడంతో కౌశిక్‌‌‌‌రెడ్డికి ఈ ఎన్నికలు కలిసొచ్చాయి. తొలిరౌండ్ నుంచి కౌశిక్ రెడ్డి మెజార్టీ సాధిస్తూ వచ్చారు.  ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 63,460 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్ కు 53,164 ఓట్లు వచ్చాయి. 80,333 ఓట్లు సాధించిన పాడి కౌశిక్ రెడ్డి ఈటలపై  16,873 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 

జగిత్యాలలో  రెండు బీఆర్ఎస్.. ఒకటి కాంగ్రెస్​

జగిత్యాల, వెలుగు :  జగిత్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో రెండు చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా ఒకచోట కాంగ్రెస్ గెలుపొందింది.  కౌంటింగ్ ప్రక్రియలో కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలకు సంబంధించి గెలుపొందిన అభ్యర్థులు మొదటి రౌండ్ నుండి లీడ్ కనబరచగా జగిత్యాల నియోజకవర్గ కౌంటింగ్ ప్రక్రియ కాస్త ఉత్కంఠ రేపింది.

ఉత్కంఠగా జగిత్యాల కౌంటింగ్ 

జగిత్యాల కౌంటింగ్ ప్రక్రియ మొదటి నుంచి ఉత్కంఠగా సాగింది. మొదటి రౌండ్ నుంచి స్వల్ప లీడ్ లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి 11వ రౌండ్ నుంచి క్రమంగా లీడ్ కోల్పోతూ వచ్చారు. చివరకు బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ 15,822 ఓట్ల తేడాతో జీవన్ రెడ్డి పై గెలుపొందారు. సంజయ్ కుమార్ మొత్తం 70,243 ఓట్లు సాధించగా జీవన్ రెడ్డి 54,421 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ బీజేపీ నుంచి పోటీచేసిన బోగ శ్రావణి 42వేలకు పైచిలుకు ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు. 

సిట్టింగ్ ఎమ్మెల్యే తనయుడి గెలుపు

కోరుట్ల ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్.. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌‌‌‌పై 10,305 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సంజయ్ కుమార్ 72,115 వేల ఓట్లు సాధించగా అర్వింద్​61,810 ఓట్లు సాధించారు.  కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు 39,647 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు.

ధర్మపురి నుంచి అడ్లూరి 

ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 22,039 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌‌‌‌‌‌‌‌పై గెలుపొందారు. మొదటి రౌండ్ నుంచి లీడ్ లో ఉన్న లక్ష్మణ్ కుమార్ చివరివరకు ఆధిక్యంలో కొనసాగారు. అడ్లూరికి మొత్తం 91,393 వేల ఓట్లు పోలవ్వగా కొప్పుల ఈశ్వర్ 69,354 ఓట్లు సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఎస్‌‌‌‌.కుమార్​7,345 ఓట్లు సాధించి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.