కామారెడ్డిటౌన్, వెలుగు : ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ సూచించారు. శుక్రవారం మాచారెడ్డి మండలం భవానిపేటలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ నిర్వహించారు. పార్టీ 6 గ్యారంటీ స్కీమ్స్ పాంప్లేట్స్ను ఇంటింటికి వెళ్లి అందించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజలకు దగ్గరగా ఉండి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
పైడిమల్ లో...
బోధన్/వర్ని, వెలుగు : ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ వర్ని మండల అధ్యక్షుడు కులకర్ణి సురేశ్‌బాబా ధీమా వ్యక్తం చేశారు. వర్ని మండలం లోని పైడిమల్ గ్రామంలో శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. బోధన్ మండలంలోని పెంటకలాన్, భూలక్ష్మిక్యాంప్, బర్దిపూర్, పెగడపల్లి గ్రామాలలో పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వర్రావు, నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు.
బాసర వరకు పాదయాత్ర
నందిపేట, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుతూ శుక్రవారం నందిపేట మండల పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బైండ్ల ప్రశాంత్నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ దేవి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. యాత్రకు ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు పొద్దుటూరి వినయ్‌రెడ్డి, గొర్త రాజేంధర్ మద్దతు తెలిపారు.