గురి తప్పిన కాంగ్రెస్.. దూరమైన యువనేతలు

గురి తప్పిన కాంగ్రెస్.. దూరమైన యువనేతలు

లక్ష్యం ఛేదించాలంటే  గురి తప్పొద్దు. కాంగ్రెస్ గురి తరచూ తప్పుతోంది. గురి తప్పటమే కాక,  ఒకోసారి  ఎంపికా సరిగా ఉండట్లేదు. దేశంలో కాంగ్రెస్ రాజకీయ సంక్షోభం ఎదుర్కొన్న ప్రతిసారీ గట్టెక్కి, బట్టకట్టేలా ప్రాణభిక్ష పెట్టింది తెలుగునేల! అది 1977అయినా, 1980, 1989, 2004 ఏదయినా.. ఇక్కడ అపురూపంగా లభించిన మద్దతుతోనే పార్టీ మనగలిగింది. ఇటీవల, ముఖ్యంగా రాష్ట్ర విభజనతో ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లోనూ పార్టీ ఎదుర్కొన్న సంక్షోభ పరిస్థితులు ప్రజలకు తెలుసు. పది నెలల కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ద్వారా తెలంగాణలో కాంగ్రెస్  మొత్తం పార్టీకే  కొత్త స్థయిర్యాన్నిచ్చింది. కానీ, ఏపీ పరిస్థితేంటి?  నేటికీ నేల చూపులే! స్వాతంత్య్రానంతరం దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్​ పార్టీ తరచూ చేస్తున్న స్వీయ తప్పిదాల వల్ల తానే భారీగా నష్టపోతోంది. అది కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి నుంచి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే వరకు ఏ అంశమైనా కావొచ్చు. అస్సాంలో హిమంత బిశ్వశర్మ నుంచి ఏపీలో  వై.ఎస్.జగన్మోహన్​రెడ్డిని  డీల్ చేయడం వరకు ఏ వ్యవహారమైనా కావొచ్చు!

ప్రత్యర్థి ప్రతికూలతల వల్ల ప్రజలు తమకు సానుకూలంగా ఉన్నపుడు కూడా.. రాజకీయంగా దాన్ని లబ్ధిగా మలచుకోలేని స్థితిలో కాంగ్రెస్ నాయకత్వం ఉంటోంది. దానికి రెండు తెలుగు రాష్ట్రాలు సాక్షీభూతంగా నిలుస్తాయి.
 
పదేండ్లుగా రెండు రాష్ట్రాల్లోనూ దారితప్పింది

2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినపుడు, ఉద్యమ పార్టీ - తెలంగాణ రాష్ట్ర సమితి నేత కేసీఆర్ మాట ఇచ్చినట్టు ‘కాంగ్రెస్​లో టీఆర్ఎస్ విలీన’ ప్రక్రియను సరిగా నిర్వహించలేకే కాంగ్రెస్ ఓ గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంది. ఫలితం, పదేండ్లు అధికారానికి  దూరమైంది. 2018లోనే తెలంగాణలో కాంగ్రెస్​కు సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, ఆఖరు నిమిషంలో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పెట్టుకున్న పొత్తు బెడిసి మొత్తం వ్యవహారాన్నే అది తలకిందులు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డికి చనువున్నప్పటికీ, 2023లో ఆ తప్పు చేయకపోవడం వల్ల.. పరిస్థితులు అనుకూలించి పార్టీ  తెలంగాణలో  గెలుపుబాట పట్టింది. అదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ ప్రయోగాలన్నీ బెడిసికొడుతున్నాయి. 2009 తర్వాత పరిణామాల్లో యువనాయకుడు జగన్మోహన్​రెడ్డిని కాంగ్రెస్ దూరం చేసుకోవడం నుంచి నిన్నా, ఇవాళ పార్టీని ఏపీలో పునరుద్ధరించే చర్యలు వికటించడం వరకు.. అన్నీ అపప్రయోగాలే! ఎప్పుడూ నిరాశాజనక  ఫలితాలే!

లక్ష్యం ఎక్కడ? గురి ఎటు?

దివంగత ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయ వై.ఎస్.షర్మిలకు, 2024 ఎన్నికలకు కొన్ని నెలల ముందర కాంగ్రెస్​ నాయకత్వం ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పీఠాన్ని  అప్పగించింది. బాధ్యతలు చేపట్టిన కొత్తలో, ఏపీ కాంగ్రెస్ కు  ఆమె నూతన జవసత్వాలు కల్పిస్తారని, రాజకీయంగా ఉన్నతస్థితికి తీసుకువెళతారనే ఆశాభావం పార్టీలో, -బయట వ్యక్తమైంది. జనాన్ని మెప్పించగలిగే వివరణ (న్యరెటివ్) కూడా అప్పట్లో పార్టీకి ఉండింది. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న మూడు పార్టీలు వైఎస్సార్సీపీ (2019-–24), తెలుగుదేశం (2014- –19),  బీజేపీ (2014–24)  పదేండ్లు ఏపీకి ద్రోహం చేశాయనే వాదన ప్రజలను ఆకట్టుకుంది. విభజన చట్టం- హామీల ప్రకారం ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాపై మాటకు నిలబడని ఆ ముగ్గురూ దోషులేనని విమర్శించే స్థితి,  ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉండింది. అది సరిగా వాడుకోకుండా, కుటుంబపరమైన వివాదాల కారణంగా.. తన అన్న, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వై.ఎస్.జగన్మోహన్​రెడ్డిని వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకొని షర్మిల విమర్శలు, ఆరోపణలు చేయడంతో ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార సరళి దారితప్పింది. ముఖ్యంగా వారి బాబాయ్ వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యోదంతం వంటి అంశాలకే ప్రచారంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటంతో లక్ష్యం వికటించింది. ఇదేదో  తెలుగుదేశం,- జనసేన,- బీజేపీ కూటమికి మేలు చేసే వ్యవహారంలా ఉందనే భావన తట్టినపుడు, ప్రజలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఆలోచించడం మానివేశారు. అందుకే, కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటూ దక్కకపోగా ఓటు శాతంలోనూ పెద్దగా వృద్ది లేకుండా పోయింది. 

వీధుల్లోకి వచ్చిన ఇంటి గోడు

ఇటీవల కాలంలో ఏపీలో  ఏదైనా  హాట్​టాపిక్ ఉందీ అంటే, అది వైయస్​ఆర్​ సంతానం ఆస్తి తగాదా! అదీ, వీధుల్లోకి వచ్చి గొడవ పడటం!  ఆస్తి తగాదాలు- పంపకాల విషయంలో ఇప్పటికే స్థిరీకృతమై ఉన్న న్యాయఅంశాలు, సూత్రాల ఆధారంగా ఏ ట్రిబునల్లోనో, న్యాయస్థానంలోనో తేల్చుకోవచ్చు. ప్రజాక్షేత్రానికి, పార్టీ వేదికలకు.. ఈ వివాదంతో ఏం సంబంధం? వారి తల్లి, వైఎస్ఆర్ సతీమణి వై.ఎస్.విజయమ్మ ఈ విషయంలో ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. అందులో ప్రజలకు ఆమె ఏమి వినతి చేయదలచుకున్నారు?  రాజకీయ పార్టీల కొమ్ముకాచే ఆశ్రిత మీడియా కూడా ఈ అంశానికి అనుచిత ప్రాధాన్యత ఇచ్చినట్టు సగటు పౌరులు భావిస్తున్నారు. రాజకీయ పార్టీగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ బలోపేతం కావడానికి, కాకపోవడానికి ఈ అంశాలు ఏ మేర ప్రభావం చూపుతాయన్నది పార్టీ చూసుకోవాల్సిన అంశమే!

ఏపీలో కాంగ్రెస్​కు వ్యూహాత్మక పంథా ఉండాలి

శాశ్వత మిత్రులు,- శత్రువులు ఉండరనే రాజకీయ నానుడి నిజమైతే, ఏపీలో కాంగ్రెస్​కు వ్యూహాత్మక రాజకీయ పంథా ఉండాలి. 2014 నుంచి 2024 వరకు ఏపీలో ఓడినా, గెలిచినా జగన్మోహన్​రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీకి 40 శాతానికి తగ్గకుండా ఓటువాటా ఉంది. అదంతా ఒకప్పటి కాంగ్రెస్ ఓటు బ్యాంకే! టీడీపీ వైపు వెళ్లడానికి ససేమిరా.. అనే వర్గాలను తిరిగి పార్టీ వైపు తెచ్చుకునే వ్యూహం కాంగ్రెస్​కు ఉండాలనేది పార్టీ శ్రేణుల ఆకాంక్ష! 2014 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన నందిగామ ఉప ఎన్నిక ఇందుకో ఉదాహరణ. అప్పుడు టీడీపీ నుంచి ఎన్నికైన తంగిరాల ప్రభాకరరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ముందే చనిపోయారు. పోటీ పెట్టొద్దని నిర్ణయించడమే కాకుండా టీడీపీ అభ్యర్థికే ఓటు వేయండని వైసీపీ జిల్లా, రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చినా.. కాంగ్రెస్ అభ్యర్థికి పాతికవేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. అంతకు ముందు సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్​కు లభించిన ఓట్లు రెండువేల లోపే!  రాష్ట్రాల్లో పార్టీలోకి మిత్రులుగా.. ఎవరిని చేరదీయాలి, ఎవరిని దూరం పెట్టాలో కాంగ్రెస్ వంటి జాతీయ ప్రధాన స్రవంతి పార్టీకి నిర్దిష్ట వ్యూహం ఉండాలి. రాజకీయ పోరాటాల్లో నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించడానికి,  దేశంలో కొందరు యువనేతలను కోల్పోవడం వల్ల కాంగ్రెస్​ పార్టీకి తీరని నష్టమే జరిగింది. 

వ్యవహార దక్షత లేకే!

గడచిన ఒకటి రెండు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీ చాలామంది ముఖ్యనాయకుల్ని వ్యవహార దక్షత లేక కోల్పోయింది. ముఖ్యంగా సమర్థ యువనాయకత్వాన్ని దూరం చేసుకొని రాజకీయంగా నష్టపోయింది. హిమంత బిశ్వశర్మ (అస్సాం), జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్), జగన్మోహన్​రెడ్డి (ఆంధ్రప్రదేశ్),  జితిన్ ప్రసాద్ (ఉత్తరప్రదేశ్) వంటి వారు ఈ కోవలోకే వస్తారు. సచిన్ పైలెట్ (రాజస్తాన్) వంటి నాయకుల అవకాశాలను ఇంకా వృద్దతరం నాయకులే కొల్లగొట్టడం, ఆధిపత్యం చెలాయించడం, దాన్ని పార్టీ నాయకత్వం అనుమతించడం వంటివి స్థూలంగా పార్టీకి, దీర్ఘకాలంలో నష్టం కలిగించే అంశాలే!  ఒకప్పుడు కాంగ్రెస్​ను కటువుగా విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చిన మమతా బెనర్జీ (పశ్చిమబెంగాల్), శరద్​పవార్ (మహారాష్ట్ర) వంటి నేతలు,  వారి పార్టీలు  ఇప్పుడు కాంగ్రెస్​కు మిత్రపక్షాలే! 

- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్, 
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్