
- కాంగ్రెస్‌లో భారీగా ఆశావహులు.. చివరి దశకు చేరుకున్న కసరత్తు
- ఐదు సీట్లలో కాంగ్రెస్‌కు నాలుగు.. ఆ నాలుగింటిలో ఒకటి మిత్రపక్షం సీపీఐకి!
- మిగిలిన మూడింటిపై ఫైవ్ మెంబర్ కమిటీ చర్చలు.. హైకమాండ్‌కు రిపోర్టు
- కమిటీ పరిశీలనలో సంపత్ (మాదిగ), కుసుమ కుమార్ (కమ్మ), వీహెచ్ (మున్నూరుకాపు) పేర్లు
- శంకర్ నాయక్ కోసం జానారెడ్డి, విజయబాయికి సీటు కోసం పొంగులేటి ప్రయత్నం!
- మున్నూరుకాపు కోటాలో తన పేరునూ పరిశీలించాలని కొనగాల మహేశ్ విజ్ఞప్తి
- రేసులో అద్దంకి దయాకర్, చరణ్ కౌశిక్, సామా రాంమోహన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఫిరోజ్ ఖాన్
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లపై కసరత్తును కాంగ్రెస్ పార్టీ స్పీడప్ చేసింది. పలువురి పేర్లను ఫైవ్ మెంబర్ కమిటీ పార్టీ హైకమాండ్‌కు పంపినట్లు సమాచారం. ఆదివారం వరకు హైకమాండ్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఐదు సీట్లకు గాను 4 సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే చాన్స్ ఉండడంతో.. వీటిపై పార్టీలోని సీనియర్లు, యువ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల 10 వరకు మాత్రమే నామినేషన్ గడువు ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు పీసీసీ నాయకత్వం కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం సీనియర్ నేత జానారెడ్డిని కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. బుధవారం ఫైవ్ మెంబర్ కమిటీ సమావేశమై చర్చించిన అంశాలను జానారెడ్డి దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు.
సీపీఐకి ఒకటి!
నాలుగు ఎమ్మెల్సీల్లో ఒకటి మిత్రపక్షం సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ ఫైవ్ మెంబర్ కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి ఒక అసెంబ్లీ, రెండు మండలి సీట్లు సీపీఐకి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు సీపీఐకి ఒక ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. బుధవారం జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ ఇంట్లో ఫైవ్ మెంబర్ కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇందులో పాల్గొనన్నారు.
ఆ మూడు సీట్లు ఎవరికి?
మిత్రపక్షం సీపీఐకి ఒక సీటు పోనూ.. మిగిలిన మూడు సీట్లలో ఒకటి మాదిగ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కు ఇవ్వాలనే నిర్ణయానికి ఫైవ్ మెంబర్ కమిటీ వచ్చినట్లు సమాచారం. మరోటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ కు ఇవ్వాలనే దానిపై కమిటీ క్లారిటీకి వచ్చినట్లు తెలిసింది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నందున గ్రేటర్ పరిధిలో కమ్మ సామాజికవర్గం సుమారు ఐదు లక్షల మంది ఉండడంతో కుసుమ కుమార్ వైపు కమిటీ మొగ్గుచూపినట్లు సమాచారం. ఇక మూడో సీటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. మాజీ ఎంపీ, పీసీసీ మాజీ చీఫ్ వి.హన్మంతరావుకు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మున్నూరు కాపులు ఇటీవల వీహెచ్ ఇంట్లో సమావేశమైన అంశం ఫైవ్ మెంబర్ కమిటీ చర్చించినట్లు తెలిసింది. అయితే, మున్నూరుకాపు సామాజికవర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ పార్టీ హైకమాండ్ ను కోరుతున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ యువకులకు ప్రాధాన్యం ఇస్తున్నందున ఆ కోటాలో తనకు ఇవ్వాలని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికారంలో ఉన్నా...టీవీ డిబెట్ ల ద్వారా పార్టీ గొంతును బలంగా జనంలోకి తీసుకెళ్లానని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని మహేశ్ కోరుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లలో బీసీలకు రెండు కేటాయించాలని.. అందులో ఒకటి యాదవ సామాజిక వర్గానికి ఇవ్వాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ అంటున్నారు. ఈ మేరకు పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కు విజ్ఞప్తి చేశారు. ఎస్టీలో లంబాడి కోటా నుంచి తన శిష్యుడు, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ కు అవకాశం ఉంటే చూడాలని గురువారం సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ సందర్భంగా మాజీ మంత్రి జానారెడ్డి కోరినట్లు సమాచారం. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరురాలు విజయభాయి (వైరా)కి సీటు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మాల సామాజిక వర్గం నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, రెడ్డి సామాజిక వర్గం నుంచి పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రాంమోహన్ రెడ్డి, మైనార్టీ కోటా నుంచి సీఎం సన్నిహితుడు ఫహీం ఖురేషి, నాంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ ఫిరోజ్ ఖాన్ ఆశిస్తున్నారు.
హైకమాండ్ దృష్టికి పేర్లు
ఫైవ్ మెంబర్ కమిటీ నిర్ణయం తీసుకున్న పేర్లను గురువారం కాంగ్రెస్ హైకమాండ్ కు సిఫారసు చేసినట్లు సమాచారం. శని లేదా ఆదివారం ఢిల్లీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్ల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఫైవ్ మెంబర్ కమిటీ పంపించే పేర్లలో ఢిల్లీ పెద్దలు మార్పులు, చేర్పులు చేసే అవకాశమూ లేకపోలేదని ఆ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ లో ఇవి సాధారణమేనని, ఊహించని పేర్లు ఖరారు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నాయి. అయితే రాహుల్ కు నమ్మని బంటుగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఈ ఫైవ్ మెంబర్ కమిటీలో మెంబర్ కావడంతో అంత ఈజీగా మార్పులు ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని మరికొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ మజ్లిస్‌కు!
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఆగస్టు లో జరగనుంది. దీన్ని మజ్లిస్ కు ఇవ్వాలని కూడా ఫైవ్ మెంబర్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. లోకల్ బాడీలో ఏకంగా 50 పైనే ఓట్లు మజ్లిస్ ప్రతినిధులవే ఉండడంతో ఆ పార్టీకి కేటాయించడం కాంగ్రెస్ కు అనివార్యమైంది.
ఢిల్లీలో పలువురు ఆశావహులు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు పలువురు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీ వెళ్లారు. అయితే తాను ఎమ్మెల్సీ రేసులో లేనని, తాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరింది కూడా దీనికి సంబంధం లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తాను ఆనాడు సంగారెడ్డిలో పెట్టిన సభనే కీలకమని, దానికోసం తాను ఎంత శ్రమించానో హైకమాండ్ కు వివరించేందుకే ఢిల్లీ టూర్ అని ఆయన స్పష్టం చేశారు. అయితే టికెట్ రేసులో ఉన్న పలువురు ఆశావహులు ఢిల్లీకి చేరుకున్నారు. వీరిలో కుసుమ కుమార్, విజయభాయి తదితరులు ఉన్నారు.