
- త్వరలో ఏఐసీసీ తరఫున జిల్లాకు ఒకరు చొప్పున మరో అబ్జర్వర్
- ఇయ్యాల పీసీసీ పరిశీలకులతో పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్, ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సమావేశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ ను సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం జిల్లాలకు 70 మంది అబ్జర్వర్లను హైకమాండ్ఆదేశాల మేరకు పీసీసీ నియమించింది. త్వరలో ఏఐసీసీ తరఫున జిల్లాకో అబ్జర్వర్ ను ప్రకటించనున్నారు. ఇటు ఏఐసీసీ అటు పీసీసీ పరిశీలకులు అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, స్థానిక నాయకులను, కార్యకర్తలను కలుసుకొని పార్టీ పరిస్థితిపై ఆరా తీయనున్నారు.
జిల్లా, మండల కాంగ్రెస్ కు అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తే బాగుంటుందనే దానిపై వారి అభిప్రాయం తెలుసుకోనున్నారు. అనంతరం ఈ పరిశీలకులు పీసీసీకి, ఏఐసీసీకి ఒక నివేదిక ఇవ్వనున్నారు. దాని ప్రకారం నియామకాలు జరగనున్నాయి. అయితే పీసీసీ అబ్జర్వర్లకు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చేందుకు బుధవారం గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సమావేశం కానున్నారు.