
- గాంధీ భవన్లో 48 మంది నేతలతో విడివిడిగా సమావేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయడంపై పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే గురువారం గాంధీ భవన్ లో సుమారు 48 మంది నియోజకవర్గ స్థాయి నేతలతో ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథ్ లు వన్ టూ వన్ భేటీ అయ్యారు. ఇందులో పార్టీ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, వెడ్మ బొజ్జు, వంశీ కృష్ణ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీలు, అసెంబ్లీ సెగ్మెంట్లో ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.
48 మందిలో 24 మందితో విష్ణునాథ్, మరో 24 మందితో విశ్వనాథ్ విడివిడిగా భేటీ అయ్యారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పార్టీ పరిస్థితి ఏమిటి? పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తారా? మీరు ఏ పదవిని ఆశిస్తున్నారు? పార్టీలో ఎంతకాలం నుంచి పని చేస్తున్నారు? మీ పరిధిలో పార్టీకి ఏమైనా సమస్యలు ఉన్నాయా? నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది? డీసీసీ అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తే బాగుంటుంది? వంటి అంశాలపై నేతలను ఏఐసీసీ కార్యదర్శులు అడిగి.. వారు చెప్పిన విషయాలను ఓపికగా నోట్ చేసుకున్నారు.
ఎవరేం చెప్పారంటే..!
తనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి చేపట్టాలని ఉందని, అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఏఐసీసీ కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డిపై ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ ఛార్జీ సరితా తిరుపతయ్య యాదవ్ ఫిర్యాదు చేశారు. కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ గద్వాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ లో గందరగోళం సృష్టిస్తున్నాడని ఆరోపించారు. తనకు ఎమ్మెల్సీ లేదా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని సరితా యాదవ్ కోరారు. ఈ అభిప్రాయాలను అన్నింటిని నివేదిక రూపంలో రాష్ట్ర ఇన్ ఛార్జీ మీనాక్షి నటరాజన్ కు ఏఐసీసీ కార్యదర్శులు అందించనున్నారు.