రైతుల శ్రేయస్సు కోరేది కాంగ్రెస్సే: మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి

చిగురుమామిడి, వెలుగు: రైతుల శ్రేయస్సు కోరేది కాంగ్రెస్ పార్టీనేనని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. ‘పల్లెపల్లె కు ప్రవీణ్ అన్న– గడప గడపకు కాంగ్రెస్’లో భాగంగా ఆదివారం చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో ప్రవీణ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కోసం పథకాలు ప్రవేశపెట్టి అమలుచేసింది కాంగ్రెస్సేనన్నారు. ఉచిత కరెంట్​ స్టార్ట్​ చేసేందే తమ పార్టీ అని, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని అధికార బీఆర్ఎస్ అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. 

ఉచిత విద్యుత్ విషయంలో జరిగే అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ బురదజల్లుతోందన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.