- మోత్కుపల్లి, సామెల్ ఎంట్రీతో మారిన సమీకరణాలు
- టికెట్ తనకే కావాలంటూ నాయకుల పైరవీలు
- ఉత్తమ్, కోమటిరెడ్డి , దామోదర్ రెడ్డి పైనే ఆశలు
సూర్యాపేట, వెలుగు : తుంగతుర్తిలో కాంగ్రెస్ ఆశావహుల మధ్య పోటీ నెలకొంది. ఎక్కువ అప్లికేషన్లు రావడంతో ఎవరికి టికెట్ వస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, మందుల సామేల్ కాంగ్రెస్ లో చేరడంతో సీన్ మారిపోయింది. ఆశావహులు పోటాపోటీగా టికెట్ కోసం పైరవీలు చేసుకుంటున్నారు. అయితే ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆశీస్సులు ఉన్నవారికే టికెట్ దక్కే అవకాశాలు ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.
బరిలో 23మంది ఆశావాహులు
తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 23 మంది ఆశావహులు టికెట్ కోసం అప్లై చేసుకున్నారు. టికెట్ విషయంలో మాదిగ సామాజిక వర్గానికే మళ్లీ అవకాశం కల్పించాలని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం మాల సామాజిక వర్గానికి కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆయా సామాజిక వర్గాల నుంచి ఎవరికి వారే తమకే టికెట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. తామేమీ తక్కువ కాదంటూ మహిళలు కూడా తెరపైకి వచ్చారు.
టికెట్ ఎవరికి దక్కేనో?
2014, 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే గాదరి కిషోర్ చేతిలో సల్ప తేడాతో అద్దంకి దయాకర్ ఓడిపోయారు. టికెట్ రేస్ లో తాను ఉన్నప్పటికీ టికెట్ ఎవరికొచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానని ఇటీవల జరిగిన మీటింగ్ లో చెప్పారు. దీనితో ఈసారి ఆయనకు టికెట్ వచ్చే అవకాశాలు లేవని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. మరోపక్క గత ఎన్నికల్లో రెబల్ గా పోటీ చేసిన వడ్డేపల్లి రవితో పాటుగా అన్నెపర్తి జ్ణాన సుందర్, ప్రీతం, గుడిపాటి నర్సయ్య రేసులో ఉన్నారు.
ALSO READ : వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల హేతుబద్ధీకరణ?..పోస్టులకోతలా?
ఇద్దరి రాకతో మారుతున్న సమీకరణలు
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడంతో నియోజకవర్గంలో సమీకరణలు మారిపోయాయి. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ తో భేటీ అయిన మోత్కుపల్లి తుంగతుర్తి టికెట్ అడిగినట్లు సమాచారం. అంతేకాకుండా 2009 లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి గెలుపొందడంతో ఈసారి ఎలాగైనా ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. మరోపక్క గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామెల్ కూడా టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ద్వారా పైరవీ చేయించారు.
క్యాడర్ ఉన్నా నాయకుడు లేని వైనం
తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉన్నా సరైన నాయకులు లేరు. ఐక్యంగా పనిచేయాలంటూ ఎవరికి వారే చెప్పుకొస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం చూపెట్టడం లేదు. దీంతో క్యాడర్ లో అయోమయం నెలకొంది.
సీనియర్ల పైనే ఆశలు
తుంగతుర్తి టికెట్ కోసం ఆశావాహులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ తనకే ఇవ్వాలంటూ ఇద్దరు నాయకులు పైరవీలు చేస్తున్నారు. ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆశీస్సులు ఉన్న వారికే టికెట్ దక్కే అవకాశాలు ఉండడంతో వీరిపైనే నాయకులు ఆశలు పెట్టుకున్నారు. మరోపక్క మోత్కుపల్లి నర్సింహులు సైతం తుంగతుర్తి టికెట్ ఇవ్వాలంటూ డీకే శివ కుమార్ ప్రయత్నిస్తునారు. దీంతో తుంగతుర్తి టికెట్ ఎవరికి దక్కుతుందోనని కాంగ్రెస్ నాయకులు ఎదురు చూస్తున్నారు.