హస్తం డబుల్ ధమాకా .. వరంగల్, మహబూబాబాద్ లో కాంగ్రెస్ విజయం

  • 2,20,339 ఓట్ల మెజారిటీతో కడియం కావ్య 
  • 3,49,165 ఓట్ల భారీ మెజార్టీతో బలరాం నాయక్‍ విజయం 
  • ఓట్ల శాతంతో రెండుచోట్ల పుంజుకున్న కమలం 
  • రెండు సిట్టింగ్‍ సీట్లు కోల్పోయిన బీఆర్ఎస్

వరంగల్/మహబూబాబాద్, హనుమకొండ, వెలుగు: ఓరుగల్లులో అధికార కాంగ్రెస్​  పార్టీ డబుల్‍ ధమాకా సాధించింది. మంగళవారం నాటి  ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‍సభ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ వరంగల్(ఎస్సీ), మహబూబాబాద్‍ లో కడియం కావ్య, పోరిక బలరాం నాయక్‍ భారీ మెజార్టీతో విజయం సాధించారు.

 కమలం పార్టీ గతంతో పోలిస్తే ఆరూరి రమేశ్‍ ను పోటీలోకి దింపి వరంగల్​లో ఓట్ల శాతం పెంచుకోగా.. మహబూబాబాద్​లో సీతారాం నాయక్‍ కొంతమేరనే ప్రభావం చూపారు. బీఆర్​ఎస్​ మాత్రం ఈ లోక్​సభ ఫలితాల్లో ఘోరంగా చతికిలపడింది. తమ ఖాతాలో ఉన్న రెండు సిట్టింగ్ ఎంపీ స్థానాలను కొల్పోయింది. కాంగ్రెస్‍ కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాలను అందించిన ఓరుగల్లు.. ఇప్పుడు మరోసారి రెండింటికి రెండు స్థానాలు హస్తం పార్టీకే కట్టబెట్టడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. 

కడియం కావ్యకు 5,81,294 ఓట్లు.. 

రాష్ట్రంలో లోక్‍సభ ఎన్నికల్లో ఓరుగల్లు రాజకీయాలు హాట్‍ హాట్‍గా నడిచాయి. వరంగల్లో కాంగ్రెస్‍ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి అరూరి రమేశ్, బీఆర్ఎస్‍ నుంచి మారేపల్లి సుధీర్‍ కుమార్‍ బరిలో ఉండగా.. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే నడిచింది. కడియం కావ్య, అరూరి రమేశ్ఎవరికి వారుగా ఆ పార్టీలకు బలమైన అభ్యర్థులుగా ప్రచారంలో దూసుకెళ్లారు. 

కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య తన సమీప బీజేపీ ప్రత్యర్థి అరూరి రమేశ్‍పై 2,20,339 మెజార్టీతో విజయం సాధించింది. కావ్య 5,81,294 ఓట్లు సాధించగా.. రమేశ్3,60,955 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 2019 ఎన్నికల్లో అప్పటీ బీజేపీ అభ్యర్థి చింతా సాంబమూర్తికి 83,777 ఓట్లు రాగా ప్రస్తుత ఎన్నికల్లో అరూరి రమేశ్‍ నిలబడగా  బీజేపీ తన ఓట్ల శాతం  మరో మూడింతలు పెరిగింది.  బీఆర్ఎస్ అభ్యర్థి మారేపల్లి సుధీర్‍ కుమార్2,32,033 ఓట్లు సాధించాడు. మొత్తంగా కడియం కావ్య భారీ మెజార్టీతో విజయం సాధించింది. 

బలరాం నాయక్‍కు.. 6,12,774  ఓట్లు

మహబూబాబాద్​లో ఎస్టీ నియోజకవర్గంలో హస్తం అభ్యర్థి పోరిక బలరాం నాయక్ అత్యధికంగా 6,12,774 భారీ ఓట్లు సాధించారు. బీఆర్​ఎస్​ కు చెందిన సమీప సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితపై 3,49,165 మెజార్టీతో విజయం సాధించారు. ఓరుగల్లులోని రెండు స్థానాల్లో బలరాం నాయక్​దే అత్యధిక మెజార్టీగా నమోదైంది. బీఆర్​ఎస్​ అభ్యర్థి కవిత 2,63,609 ఓట్లు సాధించగా.. బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్​ సీతారాం నాయక్​ కేవలం 1,10,444 ఓట్లకే పరిమితమై మూడో స్థానంలో నిలిచాడు.

బీఆర్ఎస్‍ పార్టీకి..మరోసారి సీన్‍ రివర్స్

బీఆర్ఎస్‍ పార్టీకి ఓరుగల్లులో మరోసారి సీన్‍రివర్స్ అయింది. 2019 లోక్‍ సభ ఎన్నికల్లో వరంగల్ఎంపీగా పసునూరి దయాకర్, మహబూబాబాద్ ఎంపీగా మాలోతు కవిత తమ సమీప కాంగ్రెస్ అభ్యర్థులపై విజయం సాధించి రెండు ఎంపీ స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు అవే రెండు స్థానాల్లో కాంగ్రెస్‍ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా..కారు పార్టీ తమ సిట్టింగ్‍ సీట్లను కోల్పోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓరుగల్లులోని 12 నియోజకవర్గాల్లో 10 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్‍ నుంచి సీతక్క, గండ్ర వెంకటరమణారెడ్డి గెలవగా.. గండ్ర పార్టీ మారడంతో కాంగ్రెస్‍ పార్టీకి ఒక్కరే ఎమ్మెల్యే మిగిలారు. 

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీన్‍ రివర్స్ అవడంతో ఈసారి కాంగ్రెస్‍ పార్టీ 10 సీట్లు గెలుచుకోగా బీఆర్ఎస్‍ పార్టీ తరఫున కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్​ రెడ్డి గెలిచారు. ఇద్దరిలో కడియం పార్టీ మారడంతో కారు పార్టీకి ఒక్కరే ఎమ్మెల్యే మిగిలారు.మొత్తంగా అసెంబ్లీతో పాటు లోక్‍సభ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‍ పార్టీకి సీన్‍ రివర్స్ అయ్యే ఫలితాలే రావడంతో బీఆర్ఎస్‍ లీడర్లు, కేడర్‍ నిరాశకు గురైంది.

బలరాం నాయక్​ రికార్డ్​ మెజారిటీ..

2009 లో మహబూబాబాద్​ పార్లమెంట్ ఆవిర్భావం నుంచి  ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో అత్యధికంగా 3,49,165 ఓట్ల మెజార్టీ ని బలరాం నాయక్​ పొందారు. ఆయనకు 68,957 మెజార్టీ రాగా, 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీర సీతారాం నాయక్ 34,992 మోజార్టీతో గెలిచారు. 2019లో టీఆర్​ఎస్​ నుంచి మాలోతు కవిత 1,46,663 ఓట్ల మెజార్టీతో   విజయం సాధించారు. తాజాగా బలరాం నాయక్​ కు  3,49,165 మెజార్టీ రావడం రికార్డ్​.