- గతంలో అత్యధిగా మెజార్టీ 1.68 లక్షలు మాత్రమే
- అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే రెండు లక్షలకుపైగా పెరిగిన మెజార్టీ
ఖమ్మం/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో ‘హస్తం’ హవా కొనసాగింది. లోక్ సభకు 35 మంది అభ్యర్థులు పోటీ చేయగా కాంగ్రెస్ఏకపక్షంగా ఘన విజయం సాధించింది. మెజార్టీకి సంబంధించి గతంలో ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది. మొన్నటి వరకు 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు సాధించిన 1,68,062 ఓట్లే అత్యధిక మెజార్టీగా రికార్డుల్లో ఉండగా, ప్రస్తుతం ఆ రికార్డును కాంగ్రెస్ క్యాండిడేట్ రామసహాయం రఘురాంరెడ్డి చెరిపేశారు. ఏకంగా 4,67,847 ఓట్ల మెజార్టీతో ఆయన భారీ విజయం సాధించారు.
ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ పొందిన క్యాండిడేట్లలో నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉండగా, రఘురాంరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 16,31,039 మంది ఓటర్లకు గాను 12,41,135 మంది ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. ఇందులో రఘురాంరెడ్డికి 7,66,929 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ క్యాండిడేట్ నామా నాగేశ్వరరావుకు 2,99,082 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు 1,18,636 ఓట్లు సాధించారు. 2019 ఎలక్షన్లలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరికి 3,99,397 ఓట్లు రాగా, ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన మెజార్టీనే అంతకంటే ఎక్కువగా ఉండడం గమనార్హం.
కాగా ఆర్నెళ్ల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్ల కంటే కూడా ఈసారి ఓట్ల శాతాన్ని పెంచుకుంది. బీఆర్ఎస్ మాత్రం మొన్నటి ఎలక్షన్లలో పడిన ఓట్లను కాపాడుకోలేకపోయింది. ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్ కు 7,33,293 ఓట్లు (54 శాతం) రాగా, బీఆర్ఎస్ కు 4,67,639 (34 శాతం) ఓట్లు వచ్చాయి. ఆ ఎలక్షన్లలో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు అదనంగా 2,65,654 ఓట్లు పోల్ కాగా, ఈసారి మెజార్టీ ఏకంగా అంతకంటే 2 లక్షలు ఎక్కువగా వచ్చింది.
18 సార్లు ఎన్నికలు.. 12 సార్లు కాంగ్రెస్విజయం..
ఖమ్మం లోక్సభ స్థానంలో ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో తాజా విజయంతో కలిపి 12 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తర్వాత సీపీఎం రెండు సార్లు, పీపుల్స్డెమోక్రటిక్ ఫ్రంట్, టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఒక్కోసారి చొప్పున గెలిచారు. గత రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కూడా 2019 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ బోణీ కొట్టింది. నామా నాగేశ్వరరావునే మరోసారి బీఆర్ఎస్ బరిలోకి దింపినా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోయింది. దీంతో ఖమ్మం సెగ్మెంట్ తమ పార్టీ కంచుకోటగా కాంగ్రెస్మరోసారి రుజువు చేసింది.
మొదటి రౌండ్లోనే వెళ్లిపోయిన నామా..
లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వచ్చింది. మొదటి రౌండ్లో దాదాపు 19వేలకు పైగా కాంగ్రెస్ అభ్యర్థి తనపై మెజార్టీ సాధించడంతో ఓటింగ్ సరళిని అంతకు ముందే అంచానా వేసుకున్న బీఆర్ఎస్ క్యాండిడేట్ నామా నాగేశ్వరరావు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఐదో రౌండ్ వరకు కౌంటింగ్ సరళిని పరిశీలించి కాంగ్రెస్ అభ్యర్థికి వస్తున్న మెజార్టీని చూసి బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావు కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
ప్రజలకు కృతజ్ఞతలు : మంత్రి పొంగులేటి
ఖమ్మం రూరల్, వెలుగు : ఖమ్మం పార్లమెంట్కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి నేటి వరకు ఇంత భారీ మెజార్టీతో గెలవడం ఇదే మొదటి సారి అన్నారు.